డయాబెటిస్ వస్తే తీసుకునే ఆహారంలో కోతలు తప్పవు. కొన్ని రకాల ఆహారపదర్థాలు తినకూడదు, కొన్ని తినవచ్చు కానీ అధికంగా తినకూడదు... ఇలాంటి నియమాలు ఉంటాయి. అలాగే బరువును అదుపులో ఉంచుకోవాలి, వ్యాయామం రోజూ చేయాలి... అప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అయితే డయాబెటిస్ రోగులు బంగాళాదుంపల విషయంలో చాలా సందేహాలు ఉన్నాయి. అవి తినవచ్చా? పూర్తిగా తినడం మానేయాలా? అప్పుడప్పుడు తింటే ఫర్వాలేదా? అసలు ఎందుకు బంగాళాదుంపలు తినకూడదంటారు? ఇలా. 


బంగాళాదుంపలు ఎందుకు వద్దు?
డయాబెటిక్ రోగులను బంగాళాదుంపలను తినవద్దని సూచిస్తారు ఆరోగ్యనిపుణులు. దీనికి కారణం అందులో కార్బోహైడ్రేట్లు అధికంగా నిండి ఉంటాయి.  అలాగే గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా అధికంగా ఉంటుంది. మధుమేహం ఉన్న వ్యక్తికి కార్బోహైడ్రేట్లను గ్రహించడం కష్టంగా మారుతుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోయి. ఇలా చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు ఇన్సులిన్ విడుదలవుతుంది. ఈ ఇన్సులిన్ సాధారణ వ్యక్తుల్లో అయితే చక్కెరను శక్తిగా మారుస్తుంది. కానీ మధుమేహం ఉన్నవారిలో ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వదు, లేదా చాలా తక్కువగా అవుతుంది.దీంతో చక్కెర శక్తిగా మారలేదు. ఫలితంగా టైప్ 2 డయాబెటిస్ పెరిగిపోతుంది. 


ఇలా వండితే బెటర్...
బంగాళాదుంపలు తినాలనిపిస్తే కొన్ని చిట్కాలు చెబుతున్నారు పోషకాహార నిపుణులు. బంగాళాదుంపలు ఉడికిస్తే అందులోని కార్బో హైడ్రేట్లు తగ్గుతాయి. తరువాత ఆకుకూరలు అంటే మెంతి, పాలకూర లేదా బెండకాయ వంటి వాటితో కలిపి వండితే వాటిలోని గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. ఇలా వండుకుని బంగాళాదుంపలను తినడం వల్ల గ్లూకోజ్ రక్తంలో అధికంగా పెరగకుండా ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడ బంగాళాదుంపలు తినాలనిపిస్తే డయాబెటిక్ రోగులు ఇలా వండుకుని తినడం బెటర్. కానీ చిప్స్, ఫ్రెంచ్ ప్రైస్ రూపంలో తింటే చాలా అనర్థం. వీటిలోని క్యాలరీలు కూడా అధికంగా పెరుగుతాయి.అలాగే వాటి గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. బంగాళాదుంపలను  అధిక ఫైబర్ ఉన్న కూరగాయలతో కలిపి వండితే వాటి గ్లైసెమిక్ ఇండెక్స్ సూచిక తగ్గుతుంది. 


మితంగా...
బంగాళాదుంపలు పైన చెప్పినట్టు వండుకున్నా కూడా మితంగా తింటేనే మంచిది. వాటిని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. అయిదు కట్టల పాలకూరలో, రెండు బంగాళాదుంపలు వండుకుని తినవచ్చు. అది కూడా రోజూ తినకూడదు. వారానికోసారి ఇలా ఇతర కూరగాయలతో కలిపి వండుకుని తింటే ఫర్వాలేదు. 


Also read: ప్రపంచంలోనే అతి పురాతన జీన్ ప్యాంటు ఇదే - జీన్స్ పుట్టుక వెనుక ఇంత కథ ఉందా?





































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.