ఇప్పుడు ఎవరి దుస్తుల బీరువా చూసినా సగం బట్టలు జీన్ ప్యాంట్లే ఉంటాయి. అన్ని దేశాల్లోని ప్రజలు వాడుతున్న ఫ్యాబ్రిక్ ‘జీన్స్’. ఈ ప్యాంట్లు అతి తక్కువ ధరకు లభిస్తాయి, అలాగే ఖరీదైనవీ కూడా ఉంటాయి. కాగా ఇప్పుడు ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన ప్యాంటులను వేలానికి పెట్టారు. ‘హోలాబర్డ్ వెస్ట్రన్ అమెరికన్ కలెక్షన్స్‌’ వారు ఈ వేలం నిర్వహిస్తున్నారు. రెండు ప్యాంటులను వేలానికి ఉంచారు. వీటి ఖరీదు రూ.94 లక్షలుగా నిర్ణయించారు. నచ్చిన వాళ్లు కొనుక్కోవచ్చు. అయితే వేసుకోవడానికి మాత్రం ఇది పనికిరాదు. 


ఏంటి చరిత్ర?
ఆ జీన్ ప్యాంటులకు చాలా చరిత్ర ఉంది. అవి ఈనాటివి కావు. 1857లో సెప్టెంబర్ 12న, నార్త్ కరోలినా తీరంలో ఓ పెద్ద ఓడ మునిగిపోయింది. సముద్రంలో వచ్చిన తుఫాను కారణంగా ఈ ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో అందులో ఉన్న నావికుల దుస్తులు ట్రంకు పెట్టెల్లో అలాగే ఉన్నాయి. ఆ ఓడను కనిపెట్టాక అందులోని వస్తువులను జాగ్రత్త పరిచారు. ఇటీవల ఆ ట్రంకుపెట్టెల్లోంచి తెరిచి చూడగా రెండు జీన్ ప్యాంట్లు కనిపించాయి. అవి ఓడ మునిగిపోయే నాటికి చాలా కొత్తవే కానీ, నీళ్లలో నానిపోయి పాడైపోయాయి. అందులోనూ వాటిని తయారు చేసి 170 ఏళ్లకు పైగా అవుతోంది. దీంతో అవి పురాతన వస్తువుల జాబితాలోకి వెళ్లిపోయాయి. 


ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన జీన్స్ తయారీదారులలో లెవీ స్ట్రాస్ సంస్థ ఒకటి. ఇది చాలా ప్రాచీనమైన జీన్స్ తయారీ సంస్థ కూడా. ఈ పురాతన జీన్స్ ప్యాంటు కూడా అదే సంస్థ తయారుచేసిందని భావిస్తున్నారు చరిత్రకారులు. అయితే కొంతమంది మాత్రం కాదని వాదిస్తున్నారు. 


కొన్ని నెలల క్రితం 1880ల నాటి లెవీస్ జీన్స్ జత  ఓ గనిలో బయటపడింది. వాటిని కూడా వేలంలో అమ్మారు. అవి రెండు 71 లక్షల రూపాయలకు అమ్ముడుపోయింది. 


జీన్స్ ఎక్కడ పుట్టాయి?
జర్మనీకి చెందిన వ్యక్తి లెవిస్ స్ట్రాస్. ఈయన 1851లో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు వలస వెళ్లాడు. అక్కడ బంగారు గనుల్లో పనిచేసే వారికి కాస్త మందంగా ఉండే ప్యాంట్లు, దుస్తులు, దుప్పట్లు అవసరం అని గుర్తించాడు. అందుకోసం జెనీవా నగరం నుంచి మందపాటి వస్త్రాన్ని తెప్పించి అమ్మేవాడు. రష్యాకు చెందిన జాకబ్ డేవిస్ అనే వ్యక్తి టైలర్‌గా పనిచేసేవాడు. అతను లెవిస్ స్ట్రాస్ దగ్గర వస్త్రాన్ని కొని ప్యాంట్లుగా కుట్టాడు. అవే జీన్ ప్యాంట్లు. 1873లో ఆ పేటెంట్ కూడా పొందాడు. వారిద్దరూ కలిసి Lewis Strass @ co అనే కంపెనీ మొదలుపెట్టారు. ఇదే సమయంలో జీన్స్ ను పోలిన డెనిమ్ అనే ఫ్యాబ్రిక్‌ను ఫ్రాన్స్ లో తయారు చేశారు. ఆ ఫ్యాబ్రిక్‌తో కూడా జీన్ ప్యాంట్లు కుట్టడం మొదలుపెట్టారు. అవి అందరికీ నచ్చడంతో ప్రపంచమంతా పాకాయి.


Also read: మన యాంటీబయోటిక్స్ వేస్టేనా? మరణాల రేటు పెరగడానికి కారణం ఇదే - WHO షాకింగ్ న్యూస్