ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) యాంటీ బయోటిక్స్ పనితీరుపై ఓ నివేదికను విడుదల చేసింది. ఇది చూస్తే ఎవరికైనా కలవరం పుట్టడం ఖాయం. భయంకరమైన బ్యాక్టరియాలతో పోరాడేందుకు వైద్యులు యాంటీ బయోటిక్స్ సూచిస్తారు. కానీ అవి సమర్థంగా పనిచేయడం లేదని, దీని వల్ల మరణాల రేటు పెరిగే అవకాశం ఉందని ఓ నివేదికను విడుదల చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. దాదాపు 127 దేశాల నుంచి తెప్పించుకున్న డేటాను విశ్లేషించాకే WHO ఈ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికకు “గ్లోబల్ యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ అండ్ యూజ్ సర్వైలెన్స్ సిస్టమ్ (గ్లాస్)’ అని పేరు పెట్టింది.
ప్రమాద స్థాయిలో...
ఈ నివేదికలో “క్లెబ్సియెల్లా న్యుమోనియా” వల్ల రోగులు చనిపోతున్న విషయాన్ని ప్రస్తావించింది. ఎసినెటోబాక్టర్, ఎస్పిపి అనే రెండు బ్యాక్టీరియాల వల్ల ఆ వ్యాధి వస్తుంది. తీవ్రంగా మారిన రోగులను ఆసుపత్రిలో చేర్చాల్సి వస్తుంది. ఆ బ్యాక్టిరియా ఇన్ఫెక్షన్ రక్తంలోకి కూడా చేరుతుంది. వీరికి ఇచ్చిన యాంటీ బయోటిక్స్ సరిగా పనిచేయలేదు. దీంతో కొంతమంది రోగులు చనిపోయారు. ముఖ్యంగా కార్బపెనెమ్ అనే యాంటీ బయోటిక్స్ కొన్ని బ్యాక్టిరియల్ ఇన్ఫెక్షన్లపై ప్రభావవంతంగా పనిచేయడం లేదని వారు చెప్పారు. ఇవి కొత్తగా తయారైన యాంటీ బయోటిక్స్. నేటితరం యాంటీ బయోటిక్స్ కొన్ని రకాల మొండి బ్యాక్టిరియాలపై పనిచేయడం పోవడం కలవరానికి గురిచేసే అంశమని అభిప్రాయపడింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. కార్బపెనెమ్‌తో పాటూ పనిచేయని యాంటీ బయోటిక్స్ జాబితాలో ఇమిపెనెమ్, మెరోపెనెమ్, ఎర్టాపెనెమ్, డోరిపెనెమ్ వంటి బలమైన యాంటీ బయాటిక్స్ ఉన్నాయి.
ఇవి కూడా...
E. coli బాక్టీరియాను చంపేందుకు తయారుచేసిన యాంటీబయోటిక్స్‌లో చాలా మందులు పనిచేయడం లేదు. E coli బాక్టీరియా సాధారణంగా మూత్రనాళ ఇన్ఫెక్షన్లలో కనిపిస్తుంది. నివేదికలో, 2017 నుండి ఇప్పటి వరకు, అంటే 2022 వరకు ఎన్ని మార్పులు చోటు చేసుకున్నాయో అంచనా వేశారు. మునుపటితో పోలిస్తే ఇన్‌ఫెక్షన్ రక్తంలోకి చేరే కేసుల సంఖ్య 15% పెరిగినట్టు గుర్తించారు.
పేద దేశాల్లోని చాలా ఆసుపత్రులు డేటాను అందివ్వలేకపోతున్నాయి. కాబట్టి అందుబాటులో ఉన్న డేటానే విశ్లేషించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అవి కూడా కలుపుకుంటే పనిచేయని యాంటీ బయోటిక్స్ శాతం పెరుగుతుంది. యాంటిబయోటిక్స్ పనిచేయక పోవడం అనేది ప్రపంచం ఎదుర్కొంటున్న పది అతిపెద్ద ముప్పులలో ఒకటి అని చెప్పుకొచ్చింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. లాన్సెట్ సర్వే ప్రకారం, 2019లో యాంటీబయాటిక్స్ పనిచేయకపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా 12 లక్షల 70 వేల మంది మరణించారు.
Also read: బ్రిటన్లో పిల్లలను చంపేస్తున్న కొత్త వ్యాధి - ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.