US Monkeypox Cases : అమెరికాలో మంకీపాక్స్ కలకలం సృష్టిస్తోంది. మే మొదటి వారంలో బ్రిటన్‌లో బయటపడిన ఈ వైరస్ నెమ్మదిగా ఐరోపా దేశాలతో పాటు అమెరికా, పశ్చిమ దేశాలకు విస్తరిస్తోంది. అమెరికాలోనూ ఈ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మే 18న అమెరికాలో తొలికేసును గుర్తించగా, ప్రస్తుతం ఏడు రాష్ట్రాల్లో మొత్తం 9 కేసులు నమోదైనట్లు అక్కడి ప్రభుత్వాలు ప్రకటించాయి.
మంకీ పాక్స్ కేసులపై కేంద్రం అలర్ట్! రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ
కాలిఫోర్నియా, ఫ్లోరిడా, మసాచుసెట్స్, న్యూయార్క్, ఉటా, వర్జీనియా, వాషింగ్టన్ రాష్ట్రాల్లో కేసులను గుర్తించామని అన్నారు. ఈ తొమ్మిది మంది కూడా ఇటీవల వివిధ దేశాలకు వెళ్లి వచ్చినట్లు అధికారులు ధ్రువీకరించారు. రాబోయే రోజుల్లో అమెరికాలో కేసులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలోని 20 దేశాల్లో 200పైగా కేసులను ధ్రువీకరించగా, మరో 100 అనుమానిత కేసులు బయటపడ్డాయి.
మంకీపాక్స్ వైరస్ ముప్పుపై కేంద్రం అప్రమత్తం- కేరళ, మహారాష్ట్ర, దిల్లీకి కీలక ఆదేశాలు
ఆఫ్రికా దేశాలైన కామోరూన్, కాంగో, నైజీరియా, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ దేశాల్లో సాధారణంగా కనిపించే ఈ మంకీపాక్స్ వైరస్ ప్రస్తుతం బ్రిటన్, స్పెయిన్, నెదర్లాండ్స్, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, అమెరికా, చెక్ రిపబ్లక్, ఇజ్రాయిల్ వంటి దేశాల్లోనూ వెలుగు చూస్తున్నాయి. ఇది కోవిడ్ లాంటిది కాదని, దీని నియంత్రణ సాధ్యమేనని డబ్ల్యూహెచ్ఓ నిపుణులు అంటున్నారు. ఈ వైరస్ సోకిన వ్యక్తితో శారీరకంగా చాలా దగ్గరగా ఉంటేనే ఇదే సోకే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆ సమయంలో ఈ వైరస్ నోరు, ముక్కు, కళ్లు, శ్వాసనాళం ద్వారా లోపలికి ప్రవేశించవచ్చు. అలాగే గాయాలు తగిలినప్పుడు చర్మం ఓపెన్ అయి ఉంటుంది. వైరస్ ఆ గాయం ద్వారా శరీరంలో చేరే అవకాశం ఉంది.
ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్- మంకీపాక్స్‌పై WHO స్ట్రాంగ్ వార్నింగ్!
ప్రారంభ దశలో జ్వరం, తలనొప్పి, వాపు, నడుం నొప్పి, కండరాల నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. తరువాత, చర్మంపై దద్దుర్లు లేదా పొక్కులు కనిపిస్తాయి. ముందు చర్మం ఎర్రగా కందినట్టు అవుతుంది. ఆపై పొక్కులు వస్తాయి. తరువాత బొబ్బర్లుగా మారతాయి. ఆపై పెద్ద స్పోటకపు మచ్చల్లాగ ఏర్పడతాయని డబ్ల్యుహెచ్ఓ తెలిపింది. మెల్లగా అవి ఎండిపోయి, పైన పొక్కులు ఊడిపోతాయి. చాలామందికి త్వరగానే తగ్గిపోతుంది. తీవ్రమైన అనారోగ్య సమస్యలు రావని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా ఈ వ్యాధి 14 నుంచి 21 రోజుల లోపు దానంతట అదే తగ్గిపోయే అవకాశం ఉంది.