భారతదేశంలో ఒక్క మంకీ పాక్స్ కేసు కూడా ఇప్పటి వరకూ నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే, ఇతర దేశాల్లో ఉన్న కేసుల దృష్ట్యా అన్ని రాష్ట్రాలను అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ ఆదేశించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం.. మంకీపాక్స్ ఒక వైరల్ జూనోటిక్ వ్యాధి. ఇది జంతువుల నుండి మానవులకు వ్యాపిస్తుంది. తర్వాత మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తుంది.
మంకీపాక్స్‌కు సంబంధించి ఆరోగ్య శాఖ కూడా రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది. గత 21 రోజుల్లో మంకీ పాక్స్ ప్రభావిత దేశాలకు వెళ్లి వచ్చిన అనుమానిత రోగులందరినీ నిశితంగా పరిశీలించాలని సూచించింది. అనుమానాస్పద రోగుల సమాచారాన్ని వెంటనే స్థానిక జిల్లా అధికారి నుండి ఆరోగ్య శాఖకు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. స్థానిక, నాన్-ఎండెమిక్ దేశాల నుండి వచ్చే ప్రయాణికులను విమానాశ్రయంలో స్క్రీనింగ్ చేయాలని సూచించింది. అటువంటి రోగులకు చికిత్స చేసేటప్పుడు అన్ని ఇన్ఫెక్షన్ నియంత్రణ పద్ధతులను అనుసరించాలని నిర్దేశించింది. నివేదిక సానుకూలంగా వస్తే, కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రారంభించాలని సూచనల్లో పేర్కొంది.
మంకీ పాక్స్ నిర్ధారణ పరీక్షల కోసం అనుమానిత రోగుల నుంచి రక్తం, కఫం లాంటి నమూనాలను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ వైరాలజీ - NIV (National Institute of Virology) పూణెకు పంపాలని సూచించింది. అనుమానిత కేసుల కోసం, ముంబయిలోని కస్తూర్బా ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. అక్కడ 28 పడకలను ఏర్పాటు చేశారు.
గత 21 రోజుల్లో పేషెంట్‌తో పరిచయం ఉన్న వ్యక్తులను వెంటనే గుర్తించి ఐసోలేట్ చేయాల్సి ఉంటుందని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అనుమానిత రోగులకు అయిన అన్ని గాయాలు నయం అయ్యే వరకు, చర్మంపై కొత్త పొర ఏర్పడే వరకు ఐసోలేషన్‌ను ముగించవద్దని, అప్పటి వరకు నిర్బంధంలోనే ఉంచాలని కేంద్ర ఆరోగ్యశాఖ నిర్దేశించింది.
బ్రిటిష్ ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. మంకీపాక్స్ సోకిన వ్యక్తికి దగ్గరగా మసలిన వారు 21 రోజులపాటు ఐసోలేషన్‌లో ఉండాలి. వ్యాధిగ్రస్తుడితో ఇంట్లో కానీ, వెలుపల కానీ సన్నిహితంగా ఉన్నవారు తాము ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరిని కలిసిందీ సంబంధిత అధికారులకు తెలపాలి. ఈ వ్యక్తులు 21 రోజులపాటు బయట తిరగకూడదు. వృద్ధులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు, గర్భిణులు, 12 ఏళ్లలోపు బాలబాలికలకు సమీపంగా వెళ్లకూడదు.
స్వలింగ సంపర్కులే ఎక్కువ
ప్రస్తుతం బ్రిటన్‌లో ఈ మంకీపాక్స్ కేసులు 20, ఐరోపా, అమెరికా, కెనడా, ఇజ్రాయెల్, ఆస్ట్రేలియా దేశాల్లో 80 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా కోతుల్లోనే కనిపించే ఈ వైరల్ వ్యాధి అంత తేలిగ్గా మనుషులకు సంక్రమించదు. వ్యాధి పీడితులకు అత్యంత సన్నిహితంగా వెళ్లిన వారికే త్వరగా సోకుతుంది. అలాగే లైంగిక క్రియ ద్వారా కూడా అది సోకుతుంది. రేవ్ పార్టీల ద్వారా స్వలింగ సంపర్కులు, ద్విలింగ సంపర్కులైన పురుషులకు మంకీపాక్స్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించి ఉండవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహాదారు డాక్టర్ డేవిడ్ హైమాన్ అభిప్రాయపడ్డారు. బ్రిటన్‌లో కూడా ఇంతవరకు కనుగొన్న కేసుల్లో ఎక్కువ భాగం స్వలింగ సంపర్కుల్లోనే కనిపించాయి.