దిల్లీ:  ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని కాశీ విశ్వనాథ దేవాలయం-జ్ఞాన్‌వాపి మసీదు కేసు(Kashi Vishwanath temple-Gyanvapi mosque case)లో వారణాసి( Varanasi) జిల్లా కోర్టు సోమవారం వాదనల విచారణను పూర్తి చేసింది. తన నిర్ణయాన్ని రేపటికి రిజర్వ్ చేసింది. కోర్టులో మొత్తం 3 పిటిషన్లు దాఖలయ్యాయి. దానిపై విచారణ జరిగింది. జిల్లా జడ్జి డాక్టర్ అజయ్ కుమార్ విశ్వేష్(Dr. Ajay Kumar Vishvesha ) విచారణ చేపట్టారు. దాదాపు 45 నిమిషాలపాటు కోర్టులో విచారణ జరిగింది. అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ ముస్లింల తరఫున పిటిషన్ దాఖలు చేసింది. హిందూ పక్షాన లక్ష్మీదేవి, రాఖీ సింగ్, సీతా సాహు, మంజు వ్యాస్, రేఖా పాఠక్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.


విచారణ సందర్భంగా 19 మంది న్యాయవాదులు, నలుగురు పిటిషనర్లు సహా 23 మందిని మాత్రమే కోర్టు గదిలోకి అనుమతించారు. అలాగే కోర్టు ఆవరణలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.






వారణాసి కోర్టులో ఇరుపక్షాల తరఫున మొత్తం 7 డిమాండ్లు ఉంచారు. శృంగార గౌరీలో నిత్య పూజలు చేయాలని, 'వాజు ఖానా'లో కనిపించే శివలింగాన్ని పూజించేందుకు అనుమతి ఇవ్వాలని, నంది ఎదురుగా ఉన్న గోడను పగులగొట్టి శిథిలాలు తొలగించాలని, శివలింగం పొడవు, వెడల్పు తెలుసుకునేందుకు సర్వే చేయాలని హిందూ పక్షం కోరింది. 


మరోవైపు, ముస్లిం పక్షం పిటిషన్ దాఖలు చేసి కోర్టు ముందు రెండు డిమాండ్లను ఉంచింది. 'వాజు ఖానా' ముద్ర వేయడాన్ని ముస్లిం పక్షం వ్యతిరేకించింది. దీంతోపాటు జ్ఞాన్వాపీ సర్వేపైనా, 1991 చట్టం కింద కేసుపైనా ప్రశ్నలు లేవనెత్తారు. 


జ్ఞాన్‌వాపీ విచారణ కోసం వారణాసి కోర్టుకు 8 వారాల గడువు ఇచ్చిన సుప్రీంకోర్టు ఈ లోగా విచారణను పూర్తి చేయాలని కోరింది.