భారత్‌లోని రైల్వే ట్రాక్‌ల వినాశనానికి పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ పథక రచన చేస్తోంది. ఈ మేరకు దేశ నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. స్లీపర్ సెల్‌తో కలిసి ఐఎస్‌ఐ పంజాబ్ పరిసర ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌ను పేల్చివేసేందుకు ప్రయత్నిస్తోందని దేశ భద్రతా సంస్థలు స్పష్టం చేశాయి.


ఇండియా టుడే నివేదిక ప్రకారం, పంజాబ్, దాని చుట్టుపక్కల రాష్ట్రాల్లోని రైల్వే ట్రాక్‌లను లక్ష్యంగా చేసుకోవడానికి పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) భారీ కుట్ర పన్నిందని భారత నిఘా సంస్థలు హెచ్చరించాయి. రైల్వే ట్రాక్‌లను పేల్చివేసేందుకు ఐఎస్‌ఐ కార్యకర్తలు ప్లాన్ చేశారని, ముఖ్యంగా పంజాబ్‌తో పాటు దాని చుట్టుపక్కల రాష్ట్రాల్లోని రైల్వే ట్రాక్‌లను పేల్చివేసేందుకు ప్రణాళికలు రచించారని ఏజెన్సీలు హెచ్చరికలో పేర్కొన్నాయి. రైళ్లు ఢీకొని భారీ నష్టం కలిగించే విధంగా రైల్వే ట్రాక్ ను పేల్చివేయాలనేది వారి ప్లాన్ గా తెలుస్తోంది.


భారీ స్థాయిలో రైల్వే ట్రాక్‌లను లక్ష్యంగా చేసుకోవడానికి ఐఎస్‌ఐ భారతదేశంలోని తన కార్యకర్తలకు నిధులు సమకూరుస్తోందని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కూడా తమ హెచ్చరికలో పేర్కొన్నాయి. ఈ పనిని చేయడానికి, భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ కూడా పాకిస్తాన్ నుండి భారతదేశానికి వస్తున్నారని భద్రతా సంస్థలు వెల్లడించాయి.


రైల్వే ట్రాక్‌లు ధ్వంసమే లక్ష్యంగా ఇలా బెదిరింపులు రావడం ఇదేం మొదటి సారి కాదు. 2021లోనూ ఇలాంటి బెదిరింపులే ఓ సారి వచ్చాయి. 2021 జులైలో ఐఎస్ఐ సంస్థే భారత్‌లోని ఉత్తర్ ప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లోని రైల్వే ట్రాక్‌లను ధ్వంసం చేస్తామని హెచ్చరించింది. ఆ కరోనా సమయంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. వలస కార్మికులను ఒకచోటి నుంచి మరో చోటికి చేర్చడం మాత్రం అప్పుడు జరుగుతోంది. కాబ్టటి, వలస కూలీల ప్రాణాలే లక్ష్యంగా ఆ దాడులు ప్లాన్ చేశారని అంతా భావించారు. దీంతో అప్పుడు వెంటనే రైల్వే మంత్రి ఏకంగా బిహార్‌లోని 11 మంది ఎస్పీలకు ఈ హెచ్చరికల గురించి లేఖ రాశారు. దీంతో అప్పట్లో వారు కూడా రంగంలోకి దిగారు. మొత్తానికి అప్పుడు రైల్వే ట్రాక్‌లకు ఎలాంటి నష్టమూ జరగలేదు.


ఇటీవలి కాలంలో, పాకిస్థాన్‌కు చెందిన ISI ముఖ్యంగా పంజాబ్, పరిసర రాష్ట్రాల్లో అనేక ఉగ్రవాద కుట్రలు పన్నింది. మొహాలీలోని పంజాబ్ పోలీసుల ఇంటెలిజెన్స్ కార్యాలయంపై జరిగిన దాడిలో ఖలిస్తాన్ ఉగ్రవాదులతో కలిసి ఐఎస్ఐ పనిచేసినట్లు వార్తలు వచ్చాయి. పంజాబ్ పోలీసులు BSFతో సహా పంజాబ్‌లో పేలుడు పదార్థాలు పాకిస్తాన్ నుండి వచ్చాయని ఆరోపించాయి.