కోవిడ్ భయం మళ్లీ మొదలైంది. ఒమిక్రాన్ ఉప వేరియంట్ అయిన BF.7 చైనాలో కల్లోలానికి కారణమవుతుంది. అమెరికా, బ్రెజిల్ దేశాల్లో కూడా ఈ వేరియంట్ కేసులు కనిపిస్తున్నాయి. మనదేశంలో కూడా కొన్ని కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉంది. ఈ వేరియంట్ వల్ల మనకు పెద్ద సమస్య రాదని కూడా చెబుతున్నారు. అయినా జాగ్రత్తగా ఉండడంలో తప్పులేదు. అయితే ఇప్పుడు బూస్టర్ డోసులు వేసుకునే వారి సంక్య పెరుగుతూ వస్తోంది. ఇలాంటి సమయంలో ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్‌ల కేసులను, COVID-19 వ్యాక్సిన్‌లకు లింక్ చేస్తూ సోషల్ మీడియాలో అనేక వీడియోలు, సందేశాలు వచ్చాయి. దీంతో ప్రజల్లో కలవరం మొదలైంది. ఇదే అంశంపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కూడ అధ్యయనం చేస్తోంది. 


బంధం ఉందా?
మన దేశంలో కార్డియాక్ అరెస్టులు భారీగా నమోదైన విషయాన్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ గుర్తించింది. గత రెండేళ్లుగా కరోనా వ్యాక్సిన్లను ప్రజలు తీసుకున్నారు. కాబట్టి వాటికి, కార్డియాక్ అరెస్టుకు ఏమైనా సంబంధం ఉందా అనే అనుమానం తలెత్తింది. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) నుండి అగ్రశ్రేణి కార్డియాలజిస్టులు, నిపుణుల బృందం కార్డియాక్ అరెస్టుల బారిన పడిన కేసులను పరిశీలించింది. శవ పరీక్షలను నిర్వహించింది. కార్డియాక్ అరెస్టుతో మరణించిన వ్యక్తుల స్థితిగతులు, మరణానికి గల కారణాల గురించి సమాచారాన్ని సేకరించింది. ఆరోగ్యశాఖ మంత్రిత్వ శాఖకు చెందిన ఒక అధికారి మాట్లాడుతూ ‘ కార్డియాక్ అరెస్ట్‌ల పెరుగుదల వెనుక కారణాల గురించి తప్పులు ప్రచారం జరుగుతోంది. చాలా మంది వ్యక్తులు కార్డియాక్ అరెస్టుకు, కోవిడ్ వ్యాక్సిన్‌కు మధ్య బంధాన్ని తప్పుగా అనుసంధానిస్తున్నారు’ అని అభిప్రాయపడ్డారు. 


అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం, కార్డియాక్ అరెస్ట్ అనేది 'విద్యుత్' సమస్య. ఇది మానవ శరీరంలోని విద్యుత్ కార్యకలాపాలతో ముడిపడి ఉంటుంది. గుండెకు రక్త ప్రసరణ హఠాత్తుగా ఆగడంతో ముడిపడి ఉంటుంది. కోవిడ్ వ్యాక్సిన్‌కు దీంతో ఎలాంటి సంబంధం లేదు. 


రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నవారు, బూస్టర్ డోస్ కూడా పూర్తి చేసుకుంటే మంచిది. BF.7 వల్ల ఎలాంటి సమస్యా ఎదురవ్వకుండా ఉంటుంది.కేసులు పెరుగుతున్నాయని ప్రభుత్వమే చెబుతోంది కాబట్టి, మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటివి చేయాలి.


Also read: లక్షల్లో విలువ చేసే ఫంగస్, దీని కోసం చైనా సైనికుల చొరబాట్లు? ఏమిటీ ఫంగస్?













గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.