హిమాలయన్ గోల్డ్... ఇప్పుడు చైనా సైనికుల కళ్ళు దీనిపై పడ్డాయని సమాచారం. ఈ మధ్యనే పలుమార్లు చైనా సైనికులు అరుణాచల్ ప్రదేశ్లో చొరబడ్డారు. అనేక సార్లు భారత భూభాగంలోకి వారు ఎందుకు వస్తున్నారు అనే అంశంపై ఇండో పసిఫిక్ ఫర్ స్ట్రాటెజిక్ కమ్యూనికేషన్ సంస్థ ఓ నివేదికను ఇచ్చింది. ఇందులో ఎంతో విలువైన ‘కీడా జోడి’ కోసం చైనా సైనికులు ఇలా చొరబడుతున్నట్టు తేలింది. వాటిని అమ్ముకుంటే లక్షల్లో డబ్బులు వస్తాయి. ఇంకా చెప్పాలంటే బంగారం కన్నా ఎంతో విలువైనవి ఇవి. అందుకే వాటిని ఏరి పట్టుకెళ్లేందుకు చైనా సైనికులు వస్తున్నారట.  వీటిని ‘హిమాలయన్ వయాగ్రా’ అని కూడా పిలుస్తారు. లైంగిక సమస్యలను ఇది చాలా సమర్ధంగా ఎదుర్కొంటుంది. 


ఏమిటివి?
కీడా జోడి... హిమాలయా ప్రాంతాల్లో పెరిగే ఓ రకమైన ఫంగస్. వీటిని హిమాలయన్ గోల్డ్ అని పిలుస్తారు. ఇవి పుట్టగొడుగుల వర్గానికి చెందినవని చెప్పుకుంటారు, చూడటానికి మాత్రం గొంగళి పురుగుల్లా ఉంటాయి. ఇవి కిలో దొరికాయంటే లక్షాధికారి అయిపోవచ్చు. కిలో 20 నుంచి 25 లక్షలు ఉంటాయి. ముఖ్యంగా విదేశాల్లో వీటికి చాలా డిమాండ్. ప్రపంచంలో అత్యంత అరుదైన శిలీంధ్ర జాతుల్లో ఇవీ ఒకటి. 


ఎందుకంత ఖరీదు...
వీటిలో ఉండే శక్తివంతమైన ఔషధ గుణాలు వేరే ఏ పదార్థంలోనూ ఉండవు. యాంటీ మైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ వైరల్, యాంటీ డయాబెటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్, యాంటీ ఫైబ్రోటిక్, యాంటీ హెచ్ఐవి, యాంటీ మలేరియా, యాంటీ డిప్రెషన్, యాంటీ ఆస్టియోపోరోసిస్... ఇలా దీనిలో లెక్కలేనని గుణాలు ఉన్నాయి. అలాగే ప్రొటీన్లు, పెప్టైడ్స్, అమినో ఆమ్లాలు, విటమిన్ బి1, బి2, బి12 వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఎన్నో రకాల జబ్బులను రాకుండా అడ్డుకోగలదు. వచ్చాక వాటితో గట్టిగా పోరాడే శక్తిని శరీరానికి ఇస్తుంది. అందుకే ఇవి బంగారం, ప్లాటినం, వజ్రాల కన్నా ఎంతో విలువైనవి. 


ఎలా పెరుగుతాయి?
వీటిని స్కార్లెట్ గొంగళి పురుగులు అని కూడా పిలుస్తారు. ఈ పురుగులు ఆల్పైన్ గడ్డి, పొద భూములలో పెరగడానికి అయిదేళ్ల సమయం పడుతుంది. ఇవి లార్వా దశలో ఉన్నప్పుడు ఫంగస్ దాడి చేస్తుంది. గొంగళి పురుగులోని కణాలను తన కణాలతో భర్తీ చేస్తుంది. అయిదు నుంచి 15 సెంటీమీటర్ల పొడవున స్తంభాల్లా పుట్టగొడుగు ఆకారంలో పెరుగుతుంది. ఇవి ఎక్కడ పడితే అక్కడ పెరగవు. సముద్ర మట్టానికి 3,800 ఎత్తులో హిమాలయాల్లో గడ్డి ఉండే ప్రాంతాల్లో పెరుగుతాయి. మనదేశంతో పాటూ నేపాల్, భూటాన్, చైనాలో ఇవి లభిస్తాయి. వీటి ఉత్పత్తిలో చైనానే ముందుంది. ఎన్నో దేశాలకు ఎగుమతి చేస్తోంది. 


కేవలం పది గ్రాముల కీడా జడిని కొనాలంటే ఎంత లేదన్నా యాభై ఆరువేల రూపాయలు ఖర్చు పెట్టాలి. అంటే మనదేశంలో తులం బంగారం వచ్చేస్తుంది. హిమాలయాల కు చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు వీటిని ఏరుకుంటూ పర్వతాల మీదకి వెళతారు. అలా వెళ్లిన వాళ్లలో చాలా మంది వెనక్కి తిరిగి రాలేదు.  వీటి కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయిన వారి జాబితా కూడా అక్కడి పోలీస్ స్టేషన్లలో లభిస్తుంది. 


Also read: ఆ ఊరిని తక్కువ ధరకే అమ్మేస్తున్నారు, కావాలంటే కొనుక్కుని మీరే ఊరి యజమాని కావచ్చు