Mudragada Letter To Jagan : కాపు రిజర్వేషన్ల అంశంపై కాపు రిజర్వేషన్ల పోరాట సమితి నేత ముద్రగడ పద్మనాభం సీఎం జగన్ కు లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఈ డబ్ల్యూ ఎస్ పై ఇచ్చిన తీర్పు, రిజర్వేషన్లు రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చని కేంద్రమంత్రి ఇచ్చిన సమాధానం పై దృష్టి పెట్టాలని లేఖలో ముద్రగడ విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్లపై పరిశీలన చేయాలన్నారు. అందరూ అనుభవించగా మిగిలిన దానిలో తమ రిజర్వేషన్లు ఇప్పించాలని కోరారు. 2019 ఎన్నికల్లో మెజార్టీ నియోజకవర్గాలలో కాపు జాతి మీ గెలుపుకు కృషి చేశారని.. కాపు జాతికి రిజర్వేషన్ కల్పించి మరొకసారి కాపులు మీ విజయానికి ఉపయోగపడేలా చూసుకుంటే బాగుంటుందని సూచించారు.
ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో లేఖ రాయలేదని ముద్రగడ వివరణ
మిగతా కులాలు వారిలాగే కాపు జాతికి వెలుగులు చూపించాలని ముద్రగడ పద్మనాభం జగన్ ను కోరారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్ ల ను ప్రజలు దేవుళ్ళు లా భావించారు, పేద వర్గాలకు మంచి చేసి మీరు ప్రేమించబడడానికి పునాదులు వేసుకోవాలని సలహా ఇచ్చారు. రిజర్వేషన్లు కల్పించుటకు ఆలోచన చేసి పేద కాపులకు న్యాయం చేయాలన్నారు. తన ఈ లేఖ వల్ల జగన్ ఇబ్బంది పడతారని ముద్రగడ పద్మనాభం అనుకున్నారేమో కానీ చివరిలో వివరణ కూడా ఇచ్చారు. తన జాతి కోసం తపన తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆలోచన నాకు లేదని లేఖలో వివరణ ఇచ్చారు.
గత ప్రభుత్వం ఇచ్చిన కాపు రిజర్వేషన్లు చెల్లుతాయని కేంద్రం ప్రకటన
ఇటీవల పార్లమెంట్‌లో ఎంపీ జీవీఎల్ నరసింహారావు కాపు రిజర్వేషన్లపై ప్రశ్న అడిగారు. 2019లో ఏపీ అసెంబ్లీ ఒక చట్టం ద్వారా, పది శాతం ఈడబ్ల్యుఎస్ కోటా లోపల కోటాగా, కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వడం చట్టపరంగా చెల్లుబాటు అవుతుందా? అవుతుందా అని ప్రశ్నించారు. దీనికి కేద్రమంత్రి 2019లో చేసిన 103వ రాజ్యాంగ సవరణ ప్రకారం రాష్ట్రాలు గరిష్ఠంగా 10 శాతం రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చని తెలిపారు. 2021లోని 105వ రాజ్యాంగ సవరణ ప్రకారం, రాజ్యాంగంలోని 342ఏ(3) ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వాలు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడ్డ కులాల జాబితా సిద్ధం చేసి, దానికి రిజర్వేషన్లు ఇవ్వవచ్చని తెలిపింది. దీంతో ఏపీలో రాజకీయంగా కలకలం ప్రారంభమయిది.
జగన్ సర్కార్ రాగానే రిజర్వేషన్ల రద్దు - ఒత్తిడి పెంచుతున్న సంఘాలు
గతంలో కేంద్రం ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు కేటాయిస్తూ అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ తీర్మానం సహా అన్ని చట్టపరమైన ప్రక్రియలు పూర్తయ్యాయి. ఇక సర్టిఫికెట్ల జారీనే అనుకుంటున్న సమయంలో ప్రభుత్వం మారింది. ఈ రిజర్వేషన్లు చెల్లుబాటు కావని ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో చేతిలోకి వచ్చిన రిజర్వేషన్లు ఆగిపోయాయని కాపు రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇప్పుడు గత ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్లు చెల్లుతాయని స్పష్టం కావడంతో... మళ్లీ ప్రభుత్వంపై ఈ నేతలు ఒత్తిడి పెంచుతున్నారు.