Stock market News: 2022 క్యాలెండర్ సంవత్సరం చివరి వారంలోకి వచ్చాం. ఈ క్యాలెండర్ ఇయర్‌లో ఇప్పటి వరకు ఆర్జించిన లాభాలను నిఫ్టీ50 వదులుకోకపోతే, వరుసగా ఏడు సంవత్సరాలు సానుకూల రాబడితో ఈ ఇండెక్స్ చరిత్ర సృష్టిస్తుంది.
2016 నుంచి 2021 వరకు, ఇండెక్స్ ప్రతి క్యాలెండర్ సంవత్సరంలో నిఫ్టీ లాభాలతో ముగిసింది. 28.6% వార్షిక లాభం 2017 సంవత్సరం బెస్ట్‌గా నిలిచింది. తనను నమ్మిన వాళ్లకు గత మూడు సంవత్సరాలుగా రెండంకెల లాభాలను బహుమతిగా నిఫ్టీ ఇచ్చింది.
చైనాలో పెరుగుతున్న కోవిడ్-19 కేసులు, భారతదేశంలోనూ BF 7 ఒమిక్రాన్ సబ్ వేరియంట్ వ్యాప్తి చెందొచ్చన్న ఆందోళనల మధ్య... గత వారం నిఫ్టీ 2.5 శాతం నష్టపోయింది. మాంద్యం భయాలు, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు మరింత ఎక్కువ కాలం కొనసాగించవచ్చన్న సూచనలు ఇప్పటికే ఇబ్బందికర పరిస్థితులను సృష్టించాయి.
మరో 2.6 శాతం నష్టపోతే?
ఈ వారంలో నిఫ్టీ మరో 2.6 శాతం నష్టపోతే, గత 6 ఏళ్ల విన్నింగ్ స్పెల్ విచ్ఛిన్నం అవుతుంది.
నిఫ్టీ50 1996లో ప్రారంభమైన తర్వాత, 2002 - 2007 సంవత్సరాల మధ్య కాలం ఒక అత్యుత్తమ సిరీస్. ఈ కాలంలో ఇండెక్స్ అనేక రెట్లు పెరిగింది, ఆరు సంవత్సరాల నాన్ స్టాప్ లాభాలను అందించింది. ఇప్పుడు, 2016 నుంచి 2021 వరకు వరుస లాభాలు ఆర్జించిన నిఫ్టీ, వరుసగా ఏడో సంవత్సరమైన 2022ను కూడా సానుకూలంగా ముగిస్తే లక్కీ 7గా నిలుస్తుంది, 2022-2007 నాటి ఆరేళ్ల రికార్డ్ బ్రేక్ అవుతుంది.
నిఫ్టీ ఉనికిలోకి వచ్చిన గత 26 సంవత్సరాల్లో, 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభంలో అత్యంత భారీగా నష్టపోయింది. ఆ తర్వాతి ఏడాది 2009లో అనూహ్యంగా పుంజుకుని 75.8% లాభాన్ని ఇన్వెస్టర్లకు అందించింది. ఇదే ఇప్పటి వరకు రికార్డ్ లెవల్ గెయిన్స్. ఆ తర్వాతి స్థానాల్లో 2003 సంవత్సరం (71.9%), 1999 సంవత్సరం (67.4%) ఉన్నాయి, భారతీయ పెట్టుబడిదారులకు అదృష్టాన్ని తెచ్చాయి.
మరోవైపు, 1996, 1998, 2000, 2001, 2008, 2011, 2015 క్యాలెండర్ సంవత్సరాల్లో, కేవలం ఏడు సందర్భాల్లో మాత్రమే మదుపర్ల సంపదను నిఫ్టీ కొల్లగొట్టింది.
గత రెండు దశాబ్దాల చరిత్రను తిరగేస్తే, నిఫ్టీకి డిసెంబర్ నెల ఒక మంచి నెలగా కనిపిస్తోంది. గత 20 డిసెంబర్ నెలల్లో 16 సార్లు (80%) నెలవారీ లాభంతో ఇండెక్స్ ముగిసింది. అయితే, ఇండెక్స్ ఈ నెలలో ఇప్పటివరకు 5% పైగా కోల్పోయింది. కాబట్టి, ఈ డిసెంబర్‌లో సానుకూల ముగింపు మీద సందేహాలు ఉన్నాయి.
మరింత ఎక్కువ కాలం కొనసాగనున్న వడ్డీ రేట్లు, అభివృద్ధికి మోకాలడ్డుతున్న ప్రపంచ పరిణామాల మధ్య రాబోయే కొన్ని నెలలు భారత మార్కెట్‌లో కన్సాలిడేషన్ కనిపించే అవకాశం ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.