ICMR Cooking Methods Guidelines: ఏం తింటున్నామనే కాదు. ఎలా వండుతున్నామనేది మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందంటున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్‌లు. వంట వండే పద్ధతుల్లో చిన్న చిన్న మార్పులు చేస్తే హల్తీగా ఉండొచ్చని చెబుతున్నారు. ఇప్పుడు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కూడా ఇదే విషయం మరోసారి స్పష్టం చేసింది. Dietary Guidelines for Indians (DGI) పేరుతో వంటకు సంబంధించిన కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఎలా వండితే ఆయా పదార్థాల్లో పోషకాలను కోల్పోకుండా ఉంటామో వివరించింది. కొన్ని కుకింగ్ టెక్నిక్స్ కూడా వెల్లడించింది. అంతే కాదు. ఎలాంటి పాత్రల్లో (Healthy Cooking Methods) వంట చేస్తే ఎంత మేర పోషకాలు మనకు అందుతాయో ఉదాహరణలతో సహా వివరించింది. వంట చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలనూ తెలిపింది. ఆహార పదార్థాలు చెడిపోకుండా ఉండాలన్నా, వాటిలో పోషక విలువలు తగ్గకూడదు అనుకున్నా కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలని చెప్పింది.
నానబెడితేనే ఆరోగ్యకరం..
తృణ ధాన్యాలు, పప్పు ధాన్యాలను వండే ముందు నానబెట్టాలని సూచించింది. అలా చేయడం ద్వారా అందులోని Phytic Acid తగ్గిపోతుంది. సాధారణంగా ఫిటిక్ యాసిడ్ ఆహార పదార్థాల్లోని ఖనిజాలను తగ్గించేస్తుంది. ధాన్యాలను నానబెట్టకుండా వండితే అందులో మినరల్స్ అన్నీ వృథా అయిపోతాయని ICMR చెబుతోంది. ఇక కూరగాయల్ని కాసేపు నీళ్లలో ఉడికించాలని సూచిస్తోంది. వాటిని పండించేందుకు పెద్ద ఎత్తున పురుగు మందులు వాడతారు. వాటి అవశేషాలు కూరగాయలపై అలాగే ఉండిపోతాయి. ఈ అవశేషాల్ని తొలగించాలంటే కాసేపు నీళ్లలో ఉడికించాలి. ఇలా చేయడం వల్ల కూరగాయల్లో విటమిన్ - C వృథా కాకుండా ఉంటుందని ICMR వివరించింది. మరి కొన్ని కీలక విషయాలూ వెల్లడించింది.
ఏ పాత్రలో వండితే ఎంత ఆరోగ్యం..?
ప్రెజర్ కుకర్‌లో వండితే పోషకాలు ఎక్కడికీ పోవని చెబుతున్నారు నిపుణులు. కూరగాయల్లోని విటమిన్‌లు, ఖనిజాలు శరీరానికి తగిన విధంగా అందుతాయని వివరిస్తున్నారు. కొంత మందికి ఫ్రై చేసుకుని తినడం అలవాటు. అలా చేస్తే తప్ప ముద్ద దిగదు. కానీ ఇలా వేపుకు తినడం వల్ల ఆహార పదార్థాల్లో కొవ్వు శాతం పెరగడంతో పాటు గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తోంది ICMR.మైక్రోవేవ్ వినియోగంతో పెద్దగా ఇబ్బంది లేదని వెల్లడించింది. బార్బిక్యూ, రోస్టింగ్, గ్రిల్లింగ్ లాంటి కుకింగ్ మెథడ్స్ వల్ల హానికరమైన polycyclic aromatic hydrocarbons (PAH) పెరిగిపోతాయని హెచ్చరించింది. ఇవి జీర్ణవ్యవస్థను పాడు చేయడమే కాకుండా అనేక రకాల అనారోగ్య సమస్యల్నీ తెచ్చి పెడుతుందని హెచ్చరిస్తోంది. మెటల్ స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రల్లో వంట చేయడం సురక్షితమే అని ICMR వెల్లడించింది. ఇక నాన్ స్టిక్ ప్యాన్స్ వల్ల కూడా పెద్దగా ప్రమాదం లేదని, కాకపోతే ఎక్కువ సేపు వేడి చేస్తే హానికర రసాయనాలు విడుదలవుతాయని చెప్పింది. గ్రనైట్ పాత్రల్లో వండడం కన్నా సురక్షితమైన పద్ధతి మరోటి లేదని వెల్లడించింది. అందులో ఎలాంటి కెమికల్స్ ఉండవని, ఆరోగ్యానికి ఇది చాలా మంచిదని వివరించింది.