Summer Activities for Kids : వేసవి సెలవులు వచ్చేశాయి. ఈ హాలీడేల కోసం పిల్లలు ఏడాదంతా ఎదురు చూస్తారు. చదవాల్సిన అవసరమే ఉండదు కాబట్టి.. సంతోషంగా ఆడుకుంటారు. తల్లిదండ్రులు మాత్రం.. పిల్లలు ఇంట్లో ఉంటే వారు చేసే అల్లరిని ఎలా భరించాలా అని తెగ ఆలోచించేస్తూ ఉంటారు. సరిగ్గా ప్లాన్ చేసుకోవాలే కానీ.. పిల్లలను సమ్మర్​లో కూడా ఎంగేజ్ చేస్తూ వారిని యాక్టివ్​గా ఉంచవచ్చు. శారీరకంగా, మానసికంగా వారు అభివృద్ది చెందేలా సమ్మర్​ను ప్లాన్ చేసుకోండి.


కొందరు పేరెంట్స్ చేసే అతిపెద్ద తప్పు ఏంటి అంటే.. వారి అల్లరిని భరించలేక పిల్లల చేతికి ఫోన్ ఇచ్చి గేమ్స్ ఆడుకోమంటూ.. వీడియోలు చూడమంటూ వదిలేస్తారు. ఇలా చేస్తే వారి గోల ఉండదనుకుంటారు. కానీ పిల్లలకు ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. పైగా మానసికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. బద్ధకం పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని యాక్టివిటీలు చేయించడం వల్ల వారు యాక్టివ్​గా ఉండడంతో పాటు వివిధ కొత్త అంశాలు నేర్చుకోగలుగుతారు. బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుంది. 


ఆ విషయం తెలుసుకోండి.. 


మీ పిల్లలకు ఏదైనా స్పోర్ట్​పై ఆసక్తి ఉన్నా.. లేదా ఇతర అంశాలపై ఆసక్తి ఉందో లేదో తెలుసుకోండి. మీ పిల్లలకి క్రికెట్ లేదా షటిల్ వంటి ఆటలపై ఇంట్రెస్ట్ ఉంటే వారికి ఇండోర్ శిక్షణ ఇప్పించండి. చెస్, క్యారమ్స్ వంటి వాటిపై ఆసక్తి ఉంటే.. ఇంట్లో మీరు ఆడడమో.. లేదా క్లాస్ ఇప్పించడమో చేయించవచ్చు. ఇవేమి కాకుండా డ్యాన్స్, సింగింగ్​పై ఆసక్తి ఉంటే.. ఆ వైపుగా మీరు వారిని సమ్మర్​లో బిజీగా ఉంచవచ్చు. సమ్మర్​లో ఫస్ట్ ప్రయారిటీ.. పిల్లలకు నచ్చిన అంశాలపై వారిని ట్రైన్ చేసేలా ప్లాన్ చేసుకోండి. 


ఆ మిస్టేక్ చేయవద్దు..


పిల్లలు స్కూల్​కి వెళ్లకుంటే చాలామంది తల్లిదండ్రులు వారిని లేట్​గా నిద్రలేపుతారు. లేదా వాళ్లు నిద్ర లేవకుంటే తమ పనికి ఇబ్బంది ఉండదని ఎక్కువసేపు పడుకునేలా చేస్తారు. అది చాలా తప్పు. ఇలా చేయడం వల్ల స్కూల్​ ఓపెన్ అయ్యే సమయానికి వారికి ఈ నిద్ర షెడ్యూల్ మార్చడం కష్టమవుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఉదయాన్నే వారు నిద్ర లేచేలా చూడండి. దీనివల్ల రాత్రుళ్లు త్వరగా పడుకుంటారు. ఇది వారి ఆరోగ్యానికి, మంచి లైఫ్​స్టైల్​కి హెల్ప్ చేస్తుంది. 


వ్యాయామం.. 


పిల్లలు ఉదయాన్నే నిద్రలేస్తారు కాబట్టి వారిని వాక్ చేయమనడమో.. లేదా చిన్న చిన్న కాంపిటేషన్​ పెట్టి.. రన్నింగ్ చేయించడమో చేయించాలి. లేదంటే యోగాను వారి రొటీన్​లో భాగం చేయాలి. గార్డెనింగ్ చేయడం.. పిల్లలతో కలిసి నడుచుకుంటూ వెళ్లి పాలు తెచ్చుకోవడం వంటివి చేస్తూ ఉంటే వారు ఫిజికల్​గా యాక్టివ్​గా ఉంటారు. శారీరకంగా యాక్టివ్​గా ఉంటే మానసికంగా కూడా పరిణితి చెందుతారు. 


చదువు.. 


సమ్మర్​లో కూడా చదువు అంటే పిల్లలు కంగారు పడిపోతారు. కాబట్టి వారికి ఏదైనా ఓ స్టోరీని క్రిస్పీగా చెప్పి.. దానిలో ప్లాట్ తెలియాలంటే ఈ బుక్ చదువు అంటూ స్టోరి బుక్స్ ఇవ్వొచ్చు. లేదా సైన్స్​కి సంబంధించిన ఆసక్తికరమైన ఎక్స్​పర్మెంట్స్​ గురించి పిల్లలకు ఇంట్రెస్ట్ క్రియేట్ చేయవచ్చు. లేదా చదువుతోనే కాదు.. మీకు తెలిసినా అంశాల గురించి పిల్లలతో డిస్కస్ చేస్తూ ఉన్నా కూడా పిల్లలు ఆసక్తితో వింటారు. 


కిచెన్​లో.. 


పిల్లలకు ఫోన్ ఇచ్చి పక్కన కూర్చోబెట్టేయకుండా.. కిచెన్​లో మీకు చిన్న చిన్న హెల్ప్స్ చేసేలా వారిని ఎంగేజ్ చేయాలి. చిన్న పిల్లలు అయితే కిచెన్​లోని కూరగాయలు, ఇతర వంటకాల పేర్లు చెప్పమంటూ ఎంగేజ్ చేయొచ్చు. కొంచెం పెద్దవారు అనుకుంటే కూరగాయలు కట్ చేయడం, వంటలో హెల్ప్ చేయడం వంటివి దగ్గరుండి చేయించుకోవచ్చు. 


పోషకాహారం..


పిల్లలు స్కూల్​కి వెళ్తే అన్ని టైమ్​కి తింటారో లేదో అనే డౌట్ చాలామంది పేరెంట్స్​కి ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఉన్న సమయాన్నే వారికి హెల్తీ ఫుడ్​ ఇవ్వడానికి సరైన సమయం. వారికి పోషకాలతో నిండిన ఆహారం అందించడం ద్వారా శారీరకంగా, ఆరోగ్య పరంగా ఇబ్బందులు రావు. గ్రోత్​కి మంచిది. 


ఆటలు.. 


ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో పిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్లకుండా ఉండేలా ఇండోర్ గేమ్స్ ప్లాన్ చేసుకోండి. కానీ ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వారిని బయట గేమ్స్ ఆడుకోనివ్వచ్చు. మీరు కూడా వారితో కలిసి గేమ్స్ ఆడవచ్చు. స్విమ్మింగ్ లేదా సైక్లింగ్ వంటివి నేర్పించవచ్చు. 


సొంతూరు.. 


సమ్మర్​ హాలీడేస్​లో టూర్​లకు అందరూ వెళ్లలేరు. అలాంటి వారు అమ్మమ్మలు, నానమ్మల ఇంటికి తీసుకెళ్లొచ్చు. వారు చేసే పాతకాలం వంటలు, బంధాలు గురించి పిల్లలకు కనీస అవగాహన ఉంటుంది. 


ఇవన్నీ పిల్లలు సమ్మర్​లో శారీరకంగా యాక్టివ్​గా ఉండేలా చేస్తాయి. అలాగే పిల్లలను మీరు అర్థం చేసుకోవడానికి.. మిమ్మల్ని పిల్లలు అర్థం చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. మొబైల్ ఇస్తే ఇవేమి ఉండకపోగా.. పిల్లలు మీకు దగ్గరగా ఉన్నా దూరమైపోతారు. పిల్లలకు పేరెంట్స్ ఇవ్వాల్సిన టైమ్​ని సరిగ్గా ఇస్తే.. ఫ్యూచర్​లో వారు మీకు దూరంగా ఉన్నా దగ్గరగా ఉండేందుకు ట్రై చేస్తారు.