IPL 2025 RCB 1ST WIN After 3 Consecutive Losses In Home Soil: రాజస్థాన్ కు మరోసారి నిరాశ ఎదురైంది. వరుసగా మూడో మ్యాచ్ లోనూ చేతిలోకి వచ్చిన మ్యాచ్ ను, ఒత్తిడికి తట్టుకోలేక ప్రత్యర్థికి అప్పగించింది. దీంతో టోర్నీలో ఏడో పరాజయంతో దాదాపు గా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించినట్లే. గురువారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో 11 పరుగులతో ఓడిపోయింది. దీంతో సొంతగడ్డ చిన్నస్వామి స్టేడియంలో ఈ సీజన్ లో ఆర్సీబీ తొలి విజయాన్ని నమోదు చేసింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల‌కు 205 ప‌రుగులు చేసింది. స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ (42 బంతుల్లో 70, 8 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) స్ట‌న్నింగ్ ఫిఫ్టీతో స‌త్తా చాటాడు. సందీప్ శ‌ర్మ‌కు రెండు వికెట్లు ద‌క్కాయి. అనంత‌రం ఛేద‌న‌లో రాయ‌ల్స్ ఓవ‌ర్ల‌న్నీ ఆడి 9 వికెట్ల‌కు 194 ప‌రుగులు చేసింది. విధ్వంసక ఓపెనర్ యశస్వి జైస్వాల్ సూపర్భ్ హిట్టింగ్ (19 బంతుల్లో 49, 7 ఫోర్లు, 3 సిక్సర్లు) తో దడదడలాడించాడు. జోష్ హేజిల్ వుడ్ కు నాలుగు వికెట్లు దక్కాయి. 

వ‌న్ మేన్ షో.. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీకి మాజీ కెప్టెన్ కోహ్లీ చ‌క్క‌ని ఆరంభాన్ని అందించాడు. ముఖ్యంగా మ‌రో ఓపెన‌ర్ ఫిల్ సాల్ట్ (26) తో కలిసి శుభారంభాన్ని అందించాడు. ఓ వైపు సాల్ట్ ఆచితూచి ఆడ‌గా, కోహ్లీ మాత్రం సూప‌ర్ ట‌చ్ లో క‌నిపించి, బౌండ‌రీలు బాదాడు. దీంతో తొలి వికెట్ కు 40 బంతుల్లోనే 61 ప‌రుగుల తుఫాన్ స్టార్ట్ వ‌చ్చింది. ఆ త‌ర్వాత దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ (27 బంతుల్లో 50, 4 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) తో క‌లిసి కోహ్లీ జ‌ట్టును ముందుకు న‌డిపించాడు. వీరిద్ద‌రూ గేర్లు మార్చ‌డంతో స్కోరు బోర్డు వేగంగా ప‌రుగులెత్తింది. ప‌ర్యాట‌క బౌల‌ర్ల‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కొని దూకుడుగా ఆడి, రెండో వికెట్ కు కీల‌క‌మైన 95 ప‌రుగులు జోడించారు. ఈ క్ర‌మంలో 32 బంతుల్లో కోహ్లీ ఫిఫ్టీ చేసుకోగా, 26 బంతుల్లోనే ప‌డిక్క‌ల్ అర్థ సెంచ‌రీ చేసి పూర్తి చేసుకున్నాడు. ఆ త‌ర్వాత వేగంగా ఆడే క్ర‌మంలో కోహ్లీ ఔట్ కాగా, త‌ర్వాతి ఓవ‌ర్లో ప‌డిక్క‌ల్ పెవిలియ‌న్ కు చేరాడు. ఈ ద‌శ‌లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన టిమ్ డేవిడ్ (23), జితేశ్ శ‌ర్మ (20 నాటౌట్) ధ‌నాధ‌న్ ఆట‌తీరుతో స‌త్తా చాట‌డంతో ఆర్సీబీ 200+ ప‌రుగుల మార్కును దాటింది. 

జైస్వాల్ హిట్టింగ్.. అనుకున్న‌దానికంటే ఓ 25 ప‌రుగుల వ‌ర‌కు అద‌నంగా ఇచ్చిన రాయ‌ల్స్.. బ్యాటింగ్ లో మాత్రం దూకుడే మంత్రంగా బ‌రిలోకి దిగింది. వ‌చ్చిన బ్యాట‌ర్లు వ‌చ్చిన‌ట్లు బౌండ‌రీలు బాద‌డ‌మే టార్గెట్ గా పెట్టుకున్నారు. ఆరంభంలో వైభ‌వ్ సూర్య‌వంశీ (16)తో క‌లిసి జైస్వాల్ వేగంగా ఆడే ప్ర‌య‌త్నం చేశాడు. వీరిద్ద‌రూ బౌండ‌రీలు బాద‌డంతో తొలి వికెట్ కు 52 ప‌రుగుల భాగ‌స్వామ్యం న‌మోదైంది. ఈ ద‌శ‌లో స్లో బాల్ తో వైభ‌వ్ ను భువ‌నేశ్వ‌ర్ కుమార్ బోల్తా కొట్టించాడు. మ‌రో ఎండ్ లో ఏమాత్రం త‌గ్గ‌ని జైస్వాల్ ప‌ది బౌండ‌రీల‌తో దూకుడుగా ఆడాడు. అయితే ఫిఫ్టీకి ఒక్క ప‌రుగు దూరంలో త‌ను ఔట‌య్యాడు. ఈ త‌ర్వాత నితీశ్ రాణా (28), కెప్టెన్ రియాన్ ప‌రాగ్ (22) త‌మ‌కు ద‌క్కిన శుభారంభాల‌ను స‌ద్వినియోగం చేసుకోలేదు. ఓ ఎండ్ లో ధ్రువ్ జురెల్ (47) రెచ్చిపోయినా, షిమ్రాన్ హిట్ మెయ‌ర్ (11) మ‌రోసారి విఫ‌ల‌మ‌య్యాడు. షరామాములుగానే చివరి ఓవర్లో చోక్ చేసిన రాయల్స్.. టోర్నీలో ఏడో పరజాయాన్ని మూటగట్టుకుంది. దీంతో 6వ విజయం సాధించిన ఆర్సీబీ.. పట్టికలో టాప్-3కి చేరుకుంది. మిగతా బౌలర్లలో క్రునాల్ పాండ్యా కి రెండు వికెట్లు దక్కాయి.