IPL 2025 MS VS SRH Updates: ఉప్పల్ మైదానం వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. వారం వ్యవధింలో రెండోసారి ముంబైపై సన్ ఓడిపోయింది. ఈ రెండుసార్లు బ్యాటింగ్ వైఫల్యంతోనే ఆరెంజ్ ఆర్మీ ఓటమి మూటగట్టుకుంది. ఇక ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషాన్ ఔట్ పై చెలరేగిన వివాదం క్రికెట్ ప్రేమికులను అలజడికి గురి చేస్తోంది. ముఖ్యంగా ఇన్నింగ్స్ మూడో ఓవర్ ను దీపక్ చాహర్ బౌలింగ్ చేయగా,, లెగ్ స్టంప్ కు కాస్త ఆవలగా వచ్చిన బంతిని కిషన్ వేటాడగా, అది నేరుగా కీపర్ చేతుల్లో పడింది. అయితే దీనిపై అటు వికెట్ కీపర్ ర్యాన్ రికెల్టన్ గానీ, ఇటు బౌలర్ చాహర్ కానీ అప్పీల్ చేయలేదు. అయితే కిషన్ మాత్రం క్రీజును వీడి డగౌట్ కు వెళ్లిపోయాడు. దీంతో అంపైర్ ఔట్ గా ప్రకటించాల్సి వచ్చింది. నిజానికి అక్కడే ట్విస్ట్ నెలకొని ఉంది.
రీప్లేలో తేలింది ఇదే.. నిజానికి ఔట్ కాకుండానే కిషన్ మైదానం వీడి వెళ్లడంపై అంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. ముఖ్యంగా సన్ టీమ్ మేనేజ్మెంట్ కు నోటమాట రాలేదు. రీప్లేలో బంతి అటు బ్యాట్ కు గానీ, ఇటు ప్యాడ్ కు గానీ తగల్లేదని తేలింది. అయితే ఎడ్జ్ కానీ బంతికి క్రీజు నుంచి ఇషాన్ ఎందుకు వెళ్లాడోనని ఎవరికీ అంతు పట్టని మిస్టరీగా తేలింది. ఇక ఈ మ్యాచ్ లో ఆరంభంలోనే ట్రావిస్ హెడ్ వికెట్ కోల్పోయిన దశలో ఉన్న సన్.. ఔట్ కాకుండానే, బాధ్యతారాహిత్యంగా పెవిలియన్ కి వెళ్లిన కిషన్ నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతడిని వెంటనే టీమ్ నుంచి సాగనంపాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలి మ్యాచ్ లో సెంచరీ చేయడం తప్పించి, ఆ తర్వాత ఆడిన మ్యాచ్ ల్లో కిషన్ ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో సన్ కు వరుస పరజాయాలు ఎదురవుతున్నాయి.
రూల్ బుక్ ఏం చెబుతుందంటే..?జరిగిన సంఘటన వెనక అంపైర్ల తప్పిదం ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా రూల్ బుక్ పరిశీలిస్తే, అంపైర్లు సమయానుకూలంగా ప్రవర్తించలేదని తెలుస్తోంది. పొరపాటుగా బ్యాటర్ ను ఔట్ గా ప్రకటించి అతను పెవిలియన్ కు వెళ్లిపోతే, అందులో అంపైర్ జోక్యం చేసుకుని వెనక్కి పిలిపించే అధికారం వాళ్లకి ఉంటుందని సమాచారం. గతవారం ఇదే జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో రికెల్టన్ ఔటయి పెవిలియన్ కు వెళ్లిపోతే, థర్డ్ అంపైర్ జోక్యం చేసుకుని, అతడిని వెనక్కి పిలిచిన సంఘటన ఉంది. అదే చొరవ ఇషాన్ విషయంలోనూ ప్రదర్శిస్తే బాగుండేది కదా అని ఆరెంజ్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇరువురి విషయంలో ఒక్కలా వ్యవహరించలేదని, ఇది సబబు కాదని పేర్కొంటున్నారు. ఏదేమైనా అటు ఇషాన్, ఇటు అంపైర్ల తప్పిదంతో సన్ రైజర్స్ మూల్యం చెల్లించుకుంది. బ్యాటింగ్ పిచ్ పై చాలెంజింగ్ స్కోరును చేయడంలో విఫలమై, టోర్నీలో ఆరో ఓటమిని మూటగట్టుకుంది. దీంతో ప్లే ఆఫ్స్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. ఇప్పటి నుంచి ఆడబోయే ఆరు మ్యాచ్ ల్లో నెగ్గితేనే నాకౌట్ కు అర్హత సాధిస్తుంది. లేకపోతే, అంతే సంగతులని ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు.