Packaged Snacks, Fizzy Drinks Shorten Lifespan: జంక్ ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యానికి తీవ్ర ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తూ ఉంటారు. ప్రాసెస్డ్ ఫుడ్ ద్వారా హృదయ సంబంధ సమస్యలతో పాటు పలు రకాల ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయంటారు. ఇదే విషయానికి సంబంధించి తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ప్యాక్ చేసిన ప్రాసెస్డ్ ఫుడ్స్, స్నాక్స్, ఫిజీ డ్రింక్స్,  షుగరీ సెరెల్స్ మనుషుల ఆయుష్షును గణనీయంగా తగ్గిస్తుందని తేల్చింది. అంతేకాదు, వీటిని అధికంగా తీసుకోవడం వల్ల మనిషి చనిపోయే అవకాశం ఉందని తెలిపింది. తాజా స్టడీకి సంబంధించిన వివరాలను BMJ జనరల్ వెల్లడించింది. ఈ అధ్యయనం సుమారు 30 ఏండ్ల పాటు కొనసాగినట్లు తెలిపింది. 


ప్రాసెస్డ్ ఫుడ్‌తో తీవ్ర ఆరోగ్య సమస్యలు


ప్రాసెస్ చేసిన ఆహారం రుచిగా ఉండేందుకు కృత్రిమ రసాయనాలు కలుపుతుంటారు. శుద్ధి చేసిన కార్బొహైడ్రేట్లను ప్రాసెస్ పదార్థాల్లో వాడుతారు. దీంతో రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు తలెత్తుతాయి. అంతేకాదు, శాట్యురేటెడ్ ఫ్యాట్, ఉప్పును అధికంగా కలుపుతారు. ఇందులో విటమిన్లు, ఫైబర్ అనేవి ఉండవు. వీటిని తిన్నవాళ్లు ఈజీగా అనారోగ్యానికి గురవుతారు. ఊబకాయం, మధుమేహం, రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధులతో పాటు క్యాన్సర్ ముప్పు ఏర్పడుతుంది.


మూడు దశాబ్దాల పాటు కొనసాగిన పరిశోధన


అమెరికా, బ్రెజిల్, చైనాతో సహా అంతర్జాతీయ పరిశోధకుల బృందం, 1984 నుంచి 2018 మధ్య ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. అమెరికాలోని 11 రాష్ట్రాలకు సంబంధించిన 74,563 మంది మహిళలు, 1986 నుంచి 2018 వరకు అమెరికాలోని 50 రాష్ట్రాలకు చెందిన 39,501 పురుషుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ను రోజుకు సగటున 7 సార్లు తినడం వల్ల అకాల మరణాల సంఖ్య 4 శాతం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. న్యూరోడెజెనరేటివ్ మరణాల ప్రమాదం 8 శాతం పెరిగినట్టు గుర్తించారు. ప్రాసెస్ చేసిన మాంసం, పౌల్ట్రీ, సీఫుడ్ ఆధారిత ఫుడ్స్ తినడం వల్ల అకాల మరణ ప్రమాదం పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. చక్కెర, కృత్రిమంగా తయారు చేయబడిన స్వీట్ డ్రింక్స్, డైరీ ఆధారిత అల్ట్రా ప్రాసెస్డ్ బ్రేక్‌ ఫాస్ట్ ఫుడ్ తో కూడా చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు గుర్తించారు. చక్కటి ఆరోగ్యం కోసం కొన్ని రకాల అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ ను తీసుకోకపోవడం మంచిదని పరిశోధకులు వెల్లడించారు. తప్పని పరిస్థితులలో వీలైనంత వరకు పరిమితంగా తీసుకోవాలని సూచించారు.


ICMR కొత్త ఆహార మార్గదర్శకాలు


తాజాగా దేశ ప్రజలకు ఐసీఎంఆర్ సరికొత్త ఆహార మార్గదర్శకాలను విడుదల చేసింది. రోగాల ముప్పును తగ్గించుకునేందుకు చక్కెర, ఉప్పు తినడాన్ని తగ్గించాలని సూచించింది. మొత్తం జబ్బుల్లో 56.4 రోగాలకు కారణం అనారోగ్యకర ఆహారమేనని వెల్లడించింది. షుగర్, ఫ్యాట్ ఎక్కువగా ఉండే ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఊబయకాయం లాంటి సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపింది. చెక్కెర కలిపిన డ్రింక్స్, ఫుడ్స్ తగ్గించాలని సూచించింది. ఆకు కూరలు, కూరగాయలు, పండ్లు, మిల్లెట్స్ ఎక్కువగా తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు 17 ఆహార మార్గదర్శకాలతో కూడిన బుక్ లెట్ రిలీజ్ చేసింది. 


Read Also : 56 శాతం రోగాలు అలాంటి ఆహారం వల్లే - ఈ నియమాలు పాటిస్తేనే ఆరోగ్యం: ICMR