ICMR Guidelines: ఆరోగ్యంగా ఉండాలంటే చక్కటి పోషకాహారం తీసుకోవాలి. ఎంత మంచి ఫుడ్ తీసుకుంటే అంతే ఆరోగ్యంగా ఉంటారు. సమతుల ఆహారంతో అందరూ హెల్దీగా ఉంటారు. లేదంటే, రకరకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో దేశ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే సుమారు 17 రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలంటూ లిస్టు విడుదల చేసింది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషణ అందుతుందని, అన్ని వయసుల వాళ్లు ఆరోగ్యంగా ఉంటారని తెలిపింది. 


ఇండియాలో 56 శాతం రోగాలు ఆహార లోపాల వల్లే వస్తున్నాయని ICMR పేర్కొంది. ప్రోటీన్ సప్లిమెంట్ల వాడకాన్ని అదుపు చేయాలని పేర్కొంది. ప్రొటీన్ పౌడర్‌లను అధికంగా తీసుకోవడం వల్ల ఎముకలు, కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందని వెల్లడించింది. కాబట్టి, ICMR సూచించినట్లు ప్రోటీన్ సప్లిమెంట్స్‌కు దూరంగా ఉండండి.


ICMR మార్గదర్శకాలివే..


తాజాగా ప్రజలు అనుసరించాల్సిన మార్గదర్శకాలకు సంబంధించిన బుక్ లెట్ ను ఐసీఎంఆర్ విడుదల చేసింది. 'మై ప్లేట్ ఆఫ్ ది డే' కోసం కనీసం 8 రకాల ఆహార పదార్థాలకు సంబంధించిన మాక్రోన్యూట్రియెంట్లు, సూక్ష్మపోషకాలను అందేలా చూసుకోవాలని ఐసీఎంఆర్‌-ఎన్‌ఐఎన్‌ డెరెక్టర్‌ డాక్టర్‌ హేమలత తెలిపారు. కూరగాయలు, పండ్లు, ఆకు కూరలు, వేర్లు, దుంపలు రోజువారీ ఆహారంలో సగానికిపైగా ఉండాలని సూచించారు. వీటితో పాటు మిల్లెట్లను తీసుకోవాలన్నారు. పప్పులు, మాంసం, గుడ్లు, గింజలు, నూనె గింజలు, పాలు, పెరుగును రోజూ తప్పకుండా తీసుకోవాలన్నారు. రోజూ మనం తీసుకునే ఆహారంలో 45 శాతం మిల్లెట్లు, 15 శాతం వరకు  పప్పులు, గుడ్లు, మాంసం ఉండేలా చూసుకోవాలన్నారు. మనం తీసుకునే ఆహారం మొత్తంలో కొవ్వు పదార్థాలను 30 శాతం వరకు ఉండాలన్నారు. గింజలు, నూనె గింజలు, పాల ఉత్పత్తులు 10 శాతం వరకు ఉంటే సరిపోతుందన్నారు.  


ఆహారం తీసుకోవడమే కాదు, వ్యాయామం తప్పనిసరి!


మనం తీసుకునే ఆహారంలో శరీరానికి తృణధాన్యాల ద్వారా 50 శాతం నుంచి 70 శాతం వరకు శక్తి అందుతుందని తెలిపారు. పప్పులు, మాంసం, పాలు, చేపలు కలిసి మొత్తం 6 శాతం నుంచి 9 శాతం వరకు శక్తిని అందిస్తాయన్నారు. చక్కెర, ఉప్పు, కొవ్వు పదార్థాలలను వీలైనంత తక్కువగా తీసుకోవాలని సూచించారు. పండ్లు, కూరగాయలు కూడా శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయని వెల్లడించారు. సమతుల ఆహారం తీసుకోవడంతో పాటు నిత్యం వ్యాయామం చేయాలని సూచించారు. శారీరక శ్రమ తప్పనిసరి అన్నారు.  


దేశ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకే మార్గదర్శకాలు- డాక్టర్ రాజీవ్


ICMR-NIN డైరెక్టర్ డాక్టర్ హేమలత ఆర్ మార్గదర్శకత్వంలోని నిపుణుల బృందం 17 సమగ్ర సిఫార్సులను చేసింది. ఈ బుక్ లెట్ విడుదల సందర్భంగా ICMR చీఫ్ డాక్టర్ రాజీవ్ బహ్ల్ కీలక విషయాలు వెల్లడించారు. “గత కొన్ని దశాబ్దాలుగా దేశ ప్రజల ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మార్పులు పలు వ్యాధుల వ్యాప్తికి కారణం అయ్యింది. ఇప్పటికీ పోషకాహార లోపం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో దేశ ప్రజల ఆరోగ్యాన్ని ఆకాంక్షిస్తూ ఆహార మార్గదర్శకాలను విడుదల చేశాం” అని వెల్లడించారు.






Read Also: ముడతలున్న డ్రెస్‌తోనే ఆఫీస్‌కి రండి, ఐరన్ చేసుకోవద్దు - ఉద్యోగులకు వింత కండీషన్ పెట్టిన కంపెనీ