దానిమ్మ గింజలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలిసిందే. అయితే, దానిమ్మ తొక్కలో కూడా అనే ఔషద గుణాలు ఉంటాయట. అది ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా అందాన్ని కూడా పెంచుతుందట.   


పండ్లు తిన్న తర్వాత తొక్కలను పడేస్తారనే సంగతి తెలిసిందే. కానీ ఆ తొక్కల్లో ఫైబర్, విటమిన్స్, మినరల్స్, యాంటిఆక్సిడెంట్స్ వంటి పోషకాలు ఉంటాయనే సంగతి చాలామందికి తెలీదు. అందుకే ఆరోగ్య నిపుణులు ఆపిల్, చికూ, పీచ్, దోసకాయ వంటి వాటిని తొక్కతో సహా తినాలి అని సలహా ఇస్తారు. దానిమ్మ విషయానికొస్తే.. ఎర్రగా, మధురంగా ఉండే దానిమ్మ పండ్లను అందరూ ఇష్టపడతారు. కానీ వాటి తొక్కలను పడేస్తుంటారు. అయితే, నిపుణులు.. దానిమ్మ తొక్కల్లో పుష్కలమైన యాంటిఆక్సిడెంట్స్ ఉంటాయని, అవి శరీరంలో నిర్విషీకరణకు సహకరిస్తాయని చెబుతున్నారు. అలాగే  జలుబు, దగ్గు, చర్మ, జుట్టు సమస్యలకు చికిత్సకూ సహాయపడుతాయని చెబుతున్నారు. అదనంగా ఇవి మధుమేహం, రక్త పోటు, కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తుందట. 


దానిమ్మ తొక్కలను ఎలా ఉపయోగించాలి?


చలి కాలంలో చాలా పండ్లు అందుబాటులో ఉంటాయి అందులో ఒకటి దానిమ్మ. దానిమ్మలో ఫైబర్, ఐరన్, విటమిన్స్, మినరల్స్, యాంటిఆక్సిడెంట్స్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. అలాగే దీనిలో తక్కువ కేలరీలు, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలను, శరీర బరువును నియంత్రించడంలో సహాయపడుతుందని పోషకాహార నిపుణులు పేర్కొన్నారు. 
దానిమ్మ గింజల తరహాలోనే  దాని తొక్కలో కూడా చాలా లాభాలున్నాయి. 


ముందుగా దానిమ్మ తొక్కలను కొన్ని రోజులు ఎండలో పెట్టాలి. ఆ తర్వాత వాటిని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని గది ఉష్ణోగ్రత వద్ద ఒక కూజాలో నిల్వ చేసుకోవాలి. ఇలా నిల్వ చేసిన దానిమ్మ తొక్కల పొడిని రోగనిరోధక శక్తి మెరుగుపరచడానికి ఆహారంలో చేర్చుకోవచ్చు లేదా చర్మ సౌందర్యం కోసం కూడా వాడుకోవచ్చు.


దానిమ్మ తొక్కలు మందంగా.. తోలులా ఉంటాయి. అందరు ఈ తొక్కలు దేనికి పనికిరావు అని అనుకుంటారు. కానీ శాస్త్రవేత్తలు ఈ తొక్కలను చాలా ప్రయోజనాల కోసం వాడుతారని  నిరూపించారు. వీటిని న్యూట్రాస్యూటికల్ , కాస్మోటిక్స్ ఉత్పత్తుల తయారీలో వాడుతారు. ఈ దానిమ్మ తోక్కలోని లక్షణాలు దానిమ్మ పండులోని లాభాలతో సమానంగా ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు. 


దానిమ్మ తొక్క వల్ల కలిగే ప్రయోజనాలు   


శరీర నిర్విషీకరణకు ఉపయోగపడుతుంది: 


తాజా దానిమ్మ తొక్కలను పారే నీటి కింద శుభ్రంగా కడిగి కొన్ని నిమిషాల పాటు ఉడికించి దాని నుంచి వచ్చే రసాన్ని తీసుకోవాలి. ఆ రసాన్ని చిటికెడు ఉప్పు, నిమ్మ రసం తో కలిపి రోజంతా తీసుకుంటే శరీరం నిర్విషీకరణ అవుతుంది. అలాగే ఈ దానిమ్మ తొక్కలు శరీర నిర్విషీకరణకు అవసరమయ్యే యాంటిఆక్సిడెంట్స్, విటమిన్ -సి లను కలిగి ఉంటుంది. (నిర్విషీకరణ అంటే.. మన శరీరంలో ఉండే విషతుల్యాలను బయటకు పంపే ప్రక్రియ). 


జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది:


దానిమ్మ తొక్కలను సూర్య రష్మిలో ఎండబెట్టి తర్వాత వాటిని మెత్తగా పొడి చేసుకోవాలి. కావాలంటే పొడి చేసే ముందు వేయించుకోవచ్చు కూడా. ఈ పొడిని గాలి చొరబడకుండా బిగువగా ఉండే ఒక జార్‌లో పెట్టి మూత పెట్టాలి. లేదా ఫ్రిజ్ లో నిల్వ చేసుకోవాలి. జలుబు, దగ్గు ఉన్న సమయంలో అర చెంచా తేనేలో ఒక చెంచా దానిమ్మ తొక్క పొడిని వేసుకొని తాగాలి. ఈ మిశ్రమం ఏ వయసు వారికైనా బాగా ఉపయోగపడుతుంది. దానిమ్మ తొక్కలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ అలెర్జీక్ గుణాలు గొంతులోని ఇన్ఫెక్షన్ తగ్గించడంలో సహాయపడుతుంది.  


చర్మ సౌందర్యానికి, జుట్టు సమస్యలకు సహాయపడుతుంది:


దానిమ్మ తొక్కలను శుభ్రంగా కడిగి వాటిలో కాస్త అలోవేరా గుజ్జు, రోజ్ వాటర్, కొంత పెరుగు కలిపి దాన్ని బాగా రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా చేసుకున్న మిశ్రమాన్ని మెరిసే, అందమైన చర్మం కోసం వారానికి రెండు సార్లు ఫేస్ ప్యాక్ లా పెట్టుకోవాలి. ఈ తొక్కలు కణాల పెరుగుదలకు, చర్మంలోని  కొల్లాజెన్ ను విచ్ఛిన్నం చేసి.. చర్మ ఆకృతిని మెరుగుపరుస్తుంది. అలాగే ముఖం పొడిబారడం, ముడతలు, యాంటి ఇంఫెక్టివ్ వంటి లక్షణాలను తొలగిస్తుంది. మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. సాధారణంగా శీతాకాలంలో జుట్టు రాలడాన్ని, చుండ్రును నివారించడానికి ఇదే మిశ్రమాన్ని వారానికి ఒక సారి అప్లై చేసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది.


పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది:


దానిమ్మ తొక్కల పొడిని వేడి నీళ్ళల్లో కలుపుకోవచ్చు లేదా కొన్ని టీ ఆకులతో కలిపి ఉడికించి దానిమ్మ టీ ని తయారు చేసుకోవచ్చు. ఈ దానిమ్మ టీని రోజు ఉదయాన్నేతాగడం వల్ల మలబద్దకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే ప్రేగు వాపు తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అవసరమైన ప్రోబయోటిక్ ను అందిస్తుంది. 


మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది:


దానిమ్మ తొక్క పొడి మాత్రమే అన్ని జీవన శైలి రుగ్మతల స్థాయిలను నిర్వహించడానికి సరిపోతుంది. ఒక చెంచా తొక్క పొడిని ఒక గ్లాసు వేడి నీళ్ళలో కలిపి రోజు తాగితే వాటిలోని చికిత్స, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఈ జీవన శైలి రుగ్మతలను నియంత్రించడానికి సహాయపడతాయి. 


గర్బిణీలకు మేలు చేస్తుంది:


దానిమ్మ తొక్కలు గర్బిణీలకు కూడా మేలు చేస్తాయట. అయితే, వైద్యుడి సూచన లేకుండా మాత్రం వీటిని డైట్‌లో చేర్చుకోకూడదు.  దానిమ్మ తొక్కలోని యాంటిఆక్సిడెంట్స్ గుణాలు పాలీ ఫేనాలిక్ సమ్మేళనాలు, ఫోలిక్ యాసిడ్, విటమిన్ -సి  ఎదుగుతున్న పిండానికి సరైన పోషకాలను అందిస్తాయట. దాని వల్ల ముందస్తు గర్భధారణ నష్టాన్ని నివారిస్తాయి. గర్భిణీ స్త్రీలులో చర్మ పై పిగ్మెంటేషన్, జుట్టు రాలడం వంటి సమస్యలను నివారించకోవడానికి ఈ దానిమ్మ తొక్కలు సహాయపడతాయి.



Also Read: BRAT డైట్ అంటే ఏంటి? బరువు తగ్గేందుకు ఇది పాటించవచ్చా?



గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.