ఎన్ని సార్లు నీళ్లు తాగినా తనివి తీరడం లేదా? ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరడం లేదా? ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్‌ను సంప్రదించండి. ఎందుకంటి.. అతిగా దాహం వేయడం డయాబెటిస్‌కు సంకేతం కావచ్చు. 


డయాబెటిస్‌తో బాధితుల్లో సాధారణంగా ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఇది ఈ పాండమిక్ రోజుల్లో చాలా ప్రమాదకరం కావచ్చు. అంతేకాదు అదుపులో లేని బ్లడ్ షుగర్ లెవెల్స్ వల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడవచ్చు.


టైప్ 2 డయాబెటిస్ బారిన పడిన తర్వాత కూడా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా 10 సంవత్సరాల వరకు సాధారణ జీవితం గడపడం సాధ్యమే. పాంక్రియాస్ తగినంత ఇన్సులిన్ తయారు చెయ్యలేకపోయినా లేదా తయారైన ఇన్సులిన్ క్రీయాశీలంగా లేకపోయినా ఆ స్థితిని టైప్ 2 డయాబెటిస్ అంటారు. ఇలా ఇన్సులిన్ తగినంత లేకపోయినా లేదా ఇన్సులిన్ సరిగా పనిచెయ్యక పోయినా రక్తంలోని గ్లూకోజ్ శక్తిగా మారదు. ఫలితంగా శరీరంలో గ్లూకోజ్ నిల్వలు పెరిగిపోతాయి. ఇది శరీరంలోని ముఖ్యమైన అన్ని అవయవాలకు ప్రమాదకరంగా మారుతుంది. 


గమనించాల్సిన ముఖ్య లక్షణాలు



  • ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చెయ్యాల్సి రావడం, ముఖ్యంగా రాత్రిపూట

  • త్వరగా అలసిపోవడం

  • ఎలాంటి ప్రయత్నం లేకుండానే బరువు తగ్గడం

  • జననేంద్రియాల దగ్గర దురద గా ఉండడం 

  • చిన్న గాయాలైనా త్వరగా మానకపోవడం

  • కంటి చూపులో స్పష్టత లోపించడం


ఇవి కూడా ఉండొచ్చు



  • డార్క్ స్కిన్ ప్యాచెస్

  • త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడడం

  • చర్మం మీద అకారణంగా దురదలు

  • నోరు తరచుగా ఎండి పోవడం

  • చికాకుగా ఉండడం

  • శ్వాస ఒకరకమైన తీపి వాసన రావడం

  • నోటి దుర్వాసన

  • వంటి లక్షణాలు కూడా కొందరిలో అరుదుగా కనిపిస్తాయి.


పెరుగుతున్న డయాబెటిస్ రోగులు


ఇది వరకటి రోజుల్లో మధ్య వయస్కుల్లోనే డయాబెటిస్ రోగులు కనిపించేవారు. కానీ ఇప్పుడు యువకుల్లో సైతం ఈ సమస్య ఎక్కువగానే కనిపిస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. 1990 నుంచి 2019 వరకు జరిపిన గణాంకాలలో 1990ల్లో ప్రతి లక్ష మంది డయాబెటిక్ రోగుల్లో 117 మంది 30 సంవత్సరాల లోపు వారు ఉన్నారు. కానీ ఈ సంఖ్య 2019 నాటికి 183 కి చేరింది. అంటే దాదాపు 56.4 శాతం పెరుగుదల ఉందని అర్థం. ఈ స్థితి సమాజానికి అంత మంచిది కాదు. యువకుల్లో పెరుగుతున్న డయాబెటిక్ రోగుల వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ వంటివి ఎక్కువ అవుతున్నాయి. ఇది సమాజం మీద భారంగా పరిణమిస్తోందని గుర్తించాలి. ఇందకు కారణం తీసుకుంటున్న ఆహారం, పనివేళలు, పనిచేసే తీరు, పెరగిన ఒత్తిడి, సెడంటరీ లైఫ్ స్టయిల్ ఇలా రకరకాల కారణాలు ఉంటున్నప్పటికి నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు త్వరగా గుర్తించే అవగాహన కూడా అవసరమని కొత్త గణాంకాలు తేల్చి చెబుతున్నాయి.



Also Read: ఈ టైమ్‌లో నిద్రపోయారంటే గుండెకి ఏ ఢోకా ఉండదు