పిల్లలకు చదువులు భారంగా మారుతున్నాయి. సిలబస్ అధికంగా ఉండడం, ఖాళీ లేకుండా క్లాసులు, సాయంత్రం ట్యూషన్లు... ఇవన్నీ పిల్లలపై చాలా ఒత్తిడిని, భారాన్ని కలిగిస్తాయి. వారి మెదడు త్వరగా అలిసిపోతుంది. మెదడు త్వరగా అలిసిపోకుండా, ఒత్తిడి కలగకుండా ఉండేందుకు వారికి ప్రత్యేకమైన ఆహారాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. వారికి రోజుకు మూడు వాల్‌నట్స్ తినిపిస్తే చాలు చదువుల్లో దూసుకెళ్తారు. ఒత్తిడి కూడా వారిపై పడదు. పరీక్షల సమయంలో ఆత్రుత, భయం, నెర్వస్ వంటివి కూడా తగ్గుతాయి. మెదడుకు బూస్టప్ ఇచ్చే ఆహారం ఇవ్వడం ద్వారా వారిని చిట్టి మెదడును కాపాడుకోవచ్చు.
సౌత్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయ అధ్యయనం ప్రకారం, వాల్‌నట్‌లు పొట్టలోని మంచి బ్యాక్టిరియాకు ఇవి అవసరం. ముఖ్యంగా పిల్లల్లో ఒత్తిడిని తగ్గించేందుకు ఇవి బాగా పనిచేస్తాయి. మెదడు మెరుగైన పనితీరుకు ఇవి ఎంతో సహకరిస్తాయని నిరూపించింది ఈ కొత్త అధ్యయనం. విద్యార్థులు చదువుకునే సమయంలో అకడమిక్ ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఇది వారి మానసి ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది పూర్తిగా ప్రతికూల ప్రభావాన్నే చూపిస్తుంది. ప్రతిరోజూ ఏ పిల్లలైతే వాల్‌నట్స్ తింటారో వారి మానసిక ఆరోగ్యం గట్టిగా ఉంటుందని, వారు అంత తొందరగా ఒత్తిడి బారిన పడరని చెబుతున్నారు పరిశోధకులు. అలాగే ఆ పిల్లల్లో నిద్ర నాణ్యత కూడా పెరుగుతుందని చెప్పారు.
పరీక్షల సమయంలో విద్యార్థుల్లో ఒత్తిడి, నిరాశ అధికంగా ఉన్నట్టు ఓ నివేదికలో చెప్పారు అధ్యయనకర్తలు. వారికి అలా కలగకుండా ఉండాలంటే రోజూ రాత్రి నానబెట్టిన వాల్‌నట్స్ ఉదయం తినిపించాలి. కొన్ని రోజుల్లోనే వారి మానసిక స్థితిలో చాలా సానుకూల ప్రభావం పడుతుంది. ప్రాణాంతక సమస్యలైన క్యాన్సర్, డయాబెటిస్ వంటి వ్యాధులను రాకుండా అడ్డుకుంటాయి. ఈ రోగాలు వచ్చాక తింటే వాటిని ఎదుర్కొనే శక్తిని అందిస్తాయి. ఇవి చూడటానికి మెదడు ఆకారంలోనే ఉంటాయి. అందుకే ఎక్కువ మెదడు ఆరోగ్యానికే మేలు చేస్తాయి. వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఆల్ఫా లినోలియిక్ యాసిడ్, ఫైబర్, కాపర్, యాంటీ ఆక్సిడెంట్లు, కాపర్, బయోటిన్ వంటి ఎన్నో పోషకాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ శరీర ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. వీటి ఖరీదు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కనీసం రోజుకు ఒకటి తినిపించే ప్రయత్నం అయినా చేయాలి. ఇవి ఎదిగే పిల్లల మెదడుకు అవసరం.
Also read: బిర్యానీని పడగొట్టే ఫుడ్ ఇంకా పుట్టలేదు - ప్రతి సెకనుకు రెండు బిర్యానీల ఆర్డర్, ఎప్పటికీ ఇదే టాప్
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.