నేడు ఈడీ ముందుకు పైలెట్ రోహిత్ రెడ్డి


ఈడీ అధికారుల ముందుకు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ మేరకు ఈడీ అధికారులు ఆయనకు ఈ నెల 16 నోటీసులు అందజేశారు. సోమవారం హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయానికి రావాలని కోరారు. ఫైలెట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన వ్యాపారాల వివరాలు, బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలు, కుటుంబసభ్యులకు సంబంధించి లావాదేవాలపై ఈడీ ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.  మరోవైపు బెంగుళూరు డ్రగ్స్ కేసుకు సంబంధించిన వివరాలుకూడా అడిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలకంగా మారిన పైలెట్ రోహిత్ రెడ్డి నేడు ఈడీ ముందుకు హాజరుకావడం చర్చినీయాంశం అయ్యింది. ఇటీవల పాదయాత్రలో బండి సంజయ్ కూడా బెంగుళూర డ్రగ్స్ కేసును తిరగతోడతామని చెప్పిన నేపథ్యంలో పైలట్ ఈడీ అధికారుల ముందుకు రావడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు సినీనటి రకుల్ ప్రీత్ సింగ్ కు కూడా ఈడీ అధికారులు నోటీసులు అందజేశారు. అయితే ఆమె ఇవాళా లేదా రేపు ఈడీ అధికారులముందు హాజరయ్యే అవకాశం ఉంది. 


నేటి నుంచి తల్లిదండ్రులు, యాజమాన్యాలు,విద్యావేత్తలతో త్రిసభ్య కమిటీ సంప్రదింపులు. స్కూల్‌ సేఫ్టీకి పటిష్ఠ మార్గదర్శకాలు. 


 రాష్ట్రంలోని పాఠశాలల్లో చిన్నారుల భద్రతకు పటిష్ఠ మార్గదర్శకాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ప్రాథమికంగా కొన్ని డ్రాఫ్ట్‌ మార్గదర్శకాలను సిద్ధం చేసిన త్రిసభ్య కమిటీ, నేటి నుంచి బుధవారం వరకు తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాలు, విద్యావేత్తలతో సంప్రదింపులు జరపనున్నది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్చార్డీ)లో మార్గదర్శకాల రూపకల్పన కోసం మూడు రోజులపాటు సమావేశాలు నిర్వహించి సూచనలు, సలహాలు స్వీకరించనున్నది. రాష్ట్రంలోని బడుల్లో విద్యార్థుల భద్రతకు చేపట్టాల్సిన చర్యలపై మార్గదర్శకాలను సిద్ధం చేసేందుకు ఇద్దరు ఐఏఎస్‌, ఒక ఐపీఎస్‌ అధికారితో కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కార్మికశాఖ ముఖ్య కార్యదర్శి రాణి కుముదిని, మహిళా శిశు సంక్షేమశాఖ కార్యదర్శి దివ్యదేవరాజన్‌, అడిషనల్‌ డీజీ స్వాతిలక్రాతో కూడిన త్రిసభ్య కమిటీ, పటిష్ఠ మార్గదర్శకాలు రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నది. సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరిపి, డ్రాఫ్ట్‌ మార్గదర్శకాలతో నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నది. వీటిని ప్రభుత్వం ఆమోదిస్తే.. తుది మార్గదర్శకాలు విడుదలకానున్నాయి.



నేడు వరంగల్, హన్మకొండ, గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్యాలయల్లో నిర్వహించే ప్రజా వాణి వాయిదా


నేడు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు హన్మకొండ జిల్లా కలెక్టర్  రాజీవ్ గాంధీ హనుమంతు  ,వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ గోపి, మునిసిపల్ కమిషనర్ ప్రావీణ్య ఓ ప్రకటనలో తెలిపారు.  నోబెల్  శాంతి అవార్డు గ్రహీత సత్యార్థి ప్రకాష్  పర్యటన నేపథ్యంలో ప్రజావాణికార్యక్రమాన్ని రద్దు చేసినట్లు లిపారు. కావున... ఫిర్యాదులను అందజేసేందుకు  కలెక్టరేట్ కార్యాలయలకు,మునిసిపల్ కార్యాలయం వద్దకు  అర్జీ దారులు ఎవరు రావద్దని సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ముందస్తుగా తెలియజేస్తున్నట్లు  ప్రకటన లో వెల్లడించారు.


రాష్ట్రంలో మరో కొత్త పథకం.. గర్భిణులకు కేసీఆర్‌ న్యూట్రీషియన్‌ కిట్లు


రాష్ట్రంలో మరో కొత్త పథకం అమలులోకి రానుంది. ఆహారంతోనే ఆరోగ్యం అనే నినాదం ప్రాతిపదికన గర్భిణుల్లో రక్తహీనతకు చెక్‌పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్‌ న్యూట్రీషియన్‌ కిట్లను పంపిణీ చేయాలని నిశ్చయించింది. ఈ కొత్త పథకాన్ని అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లాల వైద్యాధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఆయా ఆసుపత్రుల్లో కేసీఆర్‌ న్యూట్రీషియన్‌ కిట్లను నిల్వ చేసేందుకు అన్ని జిల్లాల్లోని ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా గదులను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ గదుల కేటాయింపు, నిర్వహణ బాధ్యతను ఆయా జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. కలెక్టర్లు ఆసుపత్రులను సందర్శించి కిట్ల నిల్వకు అనువైన గదులను ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. కోల్డ్‌ స్టోరేజీ గదిలో కేసీఆర్‌ న్యూట్రీషియన్‌ గదిలో నిల్వ ఉంచి పీహెచ్‌సీల వారీగా గర్భిణులకు పంపిణీ చేయనున్నారు.


కేసీఆర్‌ న్యూట్రీషియన్‌ కిట్‌లో అన్ని రకాల విటమిన్లు, పోషకాలతో కూడిన ఆహారం ఉండేలా వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. గర్భిణుల్లో దాదాపు 60శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. గర్భిణుల్లో రక్తహీనత కారణంగా పుట్టబోయే శిశువుపై ప్రభావం చూపడంతోపాటు బరువు తక్కువగా ఉండడం, ఇతరత్రా ఆరోగ్య సమస్యలతో జన్మిస్తున్నారు. కేసీఆర్‌ న్యూట్రీషియన్‌ కిట్‌ ద్వారా ఈ సమస్యను అధిగమించొచ్చని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కేసీఆర్‌ న్యూట్రీషియన్‌ కిట్‌లో వివిధ ధాన్యాలతో కూడిన పొడి, ఐరన్‌ సిరప్‌, ఖర్జూరం, నెయ్యి తదితర పోషక పదార్థాలు ఉండనున్నాయి.


కిట్లను గర్భిణులకు 5వ, 9 నెలల్లో పంపిణీ చేయనున్నారు. అయిదు నెశలలకు ఇచ్చే కిట్‌ విలువ రూ.1962 కాగా, రెండో కిట్‌ విలువ రూ.1818గా ఉండనుంది. శరీరానికి సరిపడా ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు అందించేందుకు వీలుగా ఈ కిట్లను రూపొందించారు. మొదటి విడతలో కేసీఆర్‌ న్యూట్రీషిన్‌ కిట్లను 9 జిల్లాల్లో పంపిణీ చేయనున్నారు. ఆదివాసీ, ఏజెన్సీ ప్రాంతాల్లోని మహిళల్లో ఎక్కువగా రక్తహీనత ఉన్నందున కేసీఆర్‌ న్యూట్రీషియన్‌ కిట్ల పంపిణీ పథకంలో ఆదిలాబాద్‌, ఖమ్మం, మహబబూబ్‌నగర్‌, వరంగల్‌ తదితర జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.