NeoCoV Variant: నో టెన్షన్.. 'నియోకొవ్'కు అంతలేదట..! చైనా శాస్త్రవేత్తలే కాస్త మసాలా జోడించారట!

ABP Desam   |  Murali Krishna   |  30 Jan 2022 07:19 PM (IST)

నియోకొవ్ వైరస్‌కు అంత భయపడాల్సిన పనిలేదని తాజాగా భారత శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది మనుషులకు వ్యాపించే అవకాశం చాలా తక్కువన్నారు.

నో టెన్షన్.. 'నియోకొవ్'కు అంతలేదట..! చైనా శాస్త్రవేత్తలే కాస్త మసాలా జోడించారట!

ప్రపంచదేశాలు ఒమిక్రాన్ వేరియంట్‌ ధాటికి గజగజలాడుతోన్న వేళ నియోకొవ్ అనే కొత్త వేరియంట్ వార్తలు మరింత వణికిస్తున్నాయి. అయితే ఈ వేరియంట్ గురించి అంత భయపడాల్సిన పనిలేదని నిపుణులు తాజాగా తెలిపారు. ప్రస్తుతం ఉన్న రూపంలో ఈ వేరియంట్ అంత ప్రమాదకరం కాదని, అయినా ఇది మెర్స్ కోవ్ అనే పాత వైరస్‌యేనని కొత్తదేం కాదని వివరించారు. 

'నియో కోవ్‌' వైరస్‌.. గబ్బిలాల్లోని యాంజియోటెన్సిన్‌ - కన్వర్టింగ్‌ ఎంజైమ్‌ (ACE2)ను ప్రభావవంతగా వాడుకొంటుంది. కానీ ఈ వైరస్ మనుషుల్లోని ACE2ను వాడుకోవడం కష్టం. కొత్త మ్యూటేషన్ వస్తే తప్ప అధి సాధ్యం కాదు. ఈ వైరస్ గురించి బయట వస్తోన్న వార్తలంతా ప్రచారం మాత్రమే.                                                      - డా. శంశాక్ జోషి, మహారాష్ట్ర కొవిడ్ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు

ఇప్పటివరకు లేదు..

దిల్లీకి చెందిన సీఎస్ఐఆర్- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయోలజీ ప్రధాన శాస్త్రవేత్త వినోద్ స్కారియా కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం నియోకొవ్ ఉన్న రూపంలో మనుషులపై ఏమాత్రం ప్రభావం చూపలేదన్నారు. ఇప్పటివరకు ఈ వైరస్ మనుషులకు ఇంకా సోకలేదని గుర్తు చేశారు.

అందులోనూ ఏదైనా వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకడం చాలా అరుదైన అంశమన్నారు. అయితే ఇలాంటి వైరస్‌లపై దృష్టి సారించడం అవసరమన్నారు.

చైనా మాత్రం..

చైనాలోని వుహాన్​ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మాత్రం 'నియోకొవ్​'తో పెను ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ఈ వైరస్​ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని, మరణాల రేటు ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు. వైరస్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోయే ముప్పు ఉందని అంచనా వేశారు.

2012, 2015లో పశ్చిమాసియాలో వ్యాపించిన మెర్స్-కొవ్​కు, నియోకొవ్​కు సంబంధం ఉందని వారు తెలిపారు. నియోకొవ్​ను తొలుత దక్షిణాఫ్రికాలోని గబ్బిలాల్లో గుర్తించారని.. ఇప్పటివరకు మనుషులకు సోకలేదని వివరించారు. ప్రస్తుతం ఇది జంతువుల నుంచి జంతువులకు మాత్రమే పాకుతున్న వైరస్‌గా గుర్తించారు. చైనీస్ అకాడమీ ఆఫ్​ సైన్సెస్​లోని ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ బయోఫిజిక్స్​తో కలిసి వుహాన్​ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన ఈ అధ్యయనం బయోఆర్​షివ్​లో ప్రచురితమైంది. అయితే ఈ అధ్యయనాన్ని ఇంకా పీర్​ రివ్యూ చేయలేదు.

Also Read: Pegasus Spyware Row: మరోసారి చెలరేగిన పెగాసస్ దుమారం.. సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు

Published at: 30 Jan 2022 06:07 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.