Blocked nose in Rainy Season | ముక్కు మూసుకుపోయి ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది కలగడాన్నే సాధారణంగా ముక్కు దిబ్బడ అని అంటుంటాం. ఇది పసిపిల్లల నుంచి ముసలి వారి వరకు అన్ని వయసుల వారిలోనూ సాధారణం. ముక్కులోపల ఆవరించి ఉండే పొరలోని కణజాలాల్లో వాపు వల్ల ఇలాంటి స్థితి ఏర్పడుతుంది. ముక్కు మూసుకు పోయిన భావన కలిగి అసౌకర్యంగా ఉంటుంది. సమస్య తీవ్రంగా ఉన్నపుడు ఊపిరి సరిగ్గా అందకపోవడం వల్ల రోజు వారి పనులకు అంతరాయం కలిగవచ్చు. అసలు ఈ పరిస్థితి ఏఏ కారణాల వల్ల ఏర్పడుతుందో తెలసుకుందాం.


జలుబు


ముక్కుదిబ్బడకు అత్యంత సాధారణ కారణం జలుబు. ఇదే ముఖ్యమైందిగా చెప్పుకోవచ్చు. జలుబు ఒక సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్. దీని వల్ల శరీరంలో అధికంగా శ్లేష్మ ఉత్పత్తి అవుతుంది. ముక్కులో, శ్వాస నాళాల్లో ఇన్ఫ్లమేషన్ కు కూడా కారణం అవుతుంది. సాధారణంగా జలుబు చేసినపుడు గొంతు నొప్పి, దగ్గు, ముక్కు కారడం, తుమ్ములు లక్షణాలు ఉంటాయి. శరీరంలోని నిరోధక వ్యవస్థ జలుబును సాధారణంగా వారంలో పూర్తిగా తగ్గిస్తుంది.


అలెర్జిక్ రైనైటిస్


అలెర్జిక్ రైనైటిస్ వల్ల కూడా ముక్కు దిబ్బడేస్తుంది. ఇది ఒక రకమైన శ్వాస వ్యవస్థలో కలిగే అలెర్జీ. రకరకాల ట్రిగరింగ్ కారకాల వల్ల రోగనిరోధక వ్యవస్థ  అతిగా స్పందించి హిస్టమైన్ లు విడుదలవుతాయి. అందువల్ల ముక్కులోపలి పోరలోని  కణజాలాల్లో వాపు వచ్చి ముక్కు దిబ్బడేస్తుంది. ఎడతెరపి లేని తుమ్ములకు కారణమవుతుంది.


ముక్కుదూలం వంకర


ముక్కులోపలి కుహరాన్ని రెండుగా విభజించే మృదులాస్థి ఎముకను సెప్టం లేదా ముక్కుదూలం అంటారు. ఇది వంకరగా ఉన్నపుడు రెండు ముక్కురంద్రాల్లో ఒకటి ఇరుకైపోతుంది. దీని వల్ల దీర్ఘకాలికంగా ముక్కుదిబ్బడేసే ప్రమాదం ఉంటుంది. కొంత మందికి ఈ సమస్య పుట్టుకతోనే ఉంటే, మరి కొందరికి ప్రమాదాల వల్ల ఇలా జరగవచ్చు. ఈ సమస్య పరిష్కారానికి తప్పకుండా శస్త్రచికిత్స అవసరమవుతుంది.


నాసల్ పాలిప్స్


మక్కులో పాలిప్ లు ఏర్పడడం వల్ల ముక్కు దిబ్బడేస్తుంది. ముక్కులోపలి సైనస్ లైనింగ్ ల మీద ఈ పాలిప్ లు ఏర్పడడం వల్ల నాసికా మార్గాలు మూసుకుంటాయి. అందువల్ల శ్వాసతీసుకోవడం లో ఇబ్బంది, వాసన గుర్తించలేకపోవడ వంటి సమస్యలు వస్తాయి. వీటి వల్ల తరచుగా సైనస్ లలో ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. ఈ పాలిప్ లకు చికిత్సగా మందులు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో సర్జరీ కూడా అవసరం కావచ్చు.


వాతావరణంలో పరిసరాల్లో వచ్చే మార్పులు


సిగరెట్ పొగ, చాలా బలమైన వాసనలు, కాలుష్యం లేదా రసాయనాలు కొన్ని సార్లు నాసికా భాగాలను చికాకు పెడతాయి. అలెర్జీ లేని వ్యక్తులు కూడా వీటి ప్రభావంతో ఇబ్బంది పడవచ్చు. వైరల్ ఇన్ఫెక్షన్ల వంటి వాటి నుంచి ఉపశమనం కోసం విశ్రాంతిగా ఉండడం, ఎక్కువ నీళ్లు తాడం, డీకోంగ్నెస్టెంట్ మందులు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 


ముక్కుదిబ్బడ సమస్య దీర్ఘకాలికంగా వేధిస్తే, లేదా జ్వరం, తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలు కూడా ఉంటే తప్పకుండా డాక్టర్ సలహాతో సరైన చికిత్స తీసుకోవడం అవసరం.