వేసవి వచ్చేస్తుంది. ఇక చల్లని బీరు ఇళ్లల్లో ఏరులై పారుతుందేమో. చల్లని బీరు తాగడం వల్ల నాలికకు కూల్‌గా ఉంటుందేమో కానీ శరీరానికి మాత్రం వేడి చేస్తుంది. కొంతమంది బీరును ఆరోగ్యకరమైన పానీయంగా  భావిస్తారు. ఆల్కహాల్ జాబితాలో చేర్చరు. అందుకే ఆడా, మగా తేడా లేకుండా తాగే వారి సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా దీన్ని ఏకంగా పెద్ద గ్లాసుతో లాగిస్తారు. ఒక గ్లాసు బీరు తాగడం వల్ల మీ మెదడు వయసు రెండేళ్లు పెరిగిపోతుందని చెబుతోంది ఒక కొత్త అధ్యయనం. ఇక రోజూ బీరు తాగే వాళ్లలో అయితే వారి కన్నా కూడా మెదడు ముందుగా ముసలిదైపోతుందని సూచిస్తున్నారు అధ్యయనకర్తలు. ఈ పరిశోధనను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకు చెందిన నిపుణులు నిర్వహించారు. 


మెదడు పరిమాణాన్ని లెక్కించడానికి ముందుగా పరిశోధకులు 36,000 మంది పెద్దల ఎమ్ఆర్ఐ స్కాన్‌లను విశ్లేషించారు. తరువాత వారు తీసుకునే ఆల్కహాల్ శాతాన్ని గుర్తించారు. 40 నుంచి 69 సంవత్సరాల మధ్య వయస్సు గల రోగుల MRI రికార్డులను తనిఖీ చేసి అధ్యయనం చేశారు. వారి మెదడులో వైట్ అండ్ గ్రే మ్యాటర్ ఎంత ఉందో చెక్ చేయాలనేది వారి అభిప్రాయం. ఆ పరిశోధనలో 50 ఏళ్ల వరకు రోజు ఒక గ్లాసు బీరు తాగడం వల్ల వారి మెదడు వయసు ఆరునెలలు పెరిగిందని గుర్తించారు. మెదడు పరిమాణం కూడా పెరిగినట్టు తెలిపారు. 


రోజుకు రెండు గ్లాసుల బీరు తాగే వారి మెదడు వయసు రెండున్నరేళ్లు పెరిగినట్టు తేల్చారు. అదే గ్లాసుల సంఖ్య రోజులో నాలుగుకు పెంచినట్లయితే మెదడు వయసు పదేళ్ల వృద్ధాప్యానికి దారితీస్తుందని గుర్తించారు. అంటే బీరు మెదడును ముసలిదాన్ని చేస్తుందని పరిశోధనా ఫలితం. యుకేలోని బయోబ్యాంక్ నుంచి తెప్పించుకున్న డేటాను పరిశీలించిన పరిశోధకులు ప్రజల మద్యపాన అలవాట్లను ట్రాక్ చేసేందుకు ప్రయత్నించారు. ఆ పని చేయడానికి చాలా సమయం పడుతుందని గుర్తించారు. 


మెదడుపై మద్యపానం ప్రభావం అధికంగానే ఉంటుందని, దీనిపై మరింత లోతైన పరిశోధన అవసరమని తెలిపారు అధ్యయనకర్తలు.  


గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.


Also read: తిన్న వెంటనే చల్లని నీళ్లు తాగుతున్నారా? ఈ ఆరోగ్యసమస్యలు తప్పవు మరి


Also read: న్యూజనరేషన్ ప్లేట్, తినే కంచంలో ఫోనుకీ స్థానం