Diabetes Diet | జీవితాంతం డయాబెటిస్, అది తెచ్చే సైడ్ ఎఫెక్టులతో బతకాలని ఎవరు అనుకుంటారు చెప్పండి. నోరు కట్టేసుకుని, ఏది తినలేక.. ఒక వేళ తిన్నా మధుమేహం పెరిగిపోతుందనే భయంతో బిక్కుబిక్కుమని బతికే రోజులకు స్వస్తి చెప్పాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ, అది సాధ్యమా? 


ఎందుకు సాధ్యం కాదు? మీరు తలచుకుంటే తప్పకుండా అది జరిగి తీరుతుంది. డయాబెటిస్‌ను తిరిగి తన ఇంటికి పంపించి మళ్లీ మీరు ఆరోగ్యవంతమైన జీవితాన్ని కొనసాగించవచ్చు. అదెలా అని అనుకుంటున్నారా? ఇటీవల జరిపిన అధ్యయనంలో అది సాధ్యమేనని తేలింది. సుమారు 70 శాతం మందికి.. వారి టైప్-2 డయాబెటిస్‌ను దూరం చేయడానికి ప్రత్యేకమైన డైట్ సహాయపడింది. 


కేలరీలను కంట్రోల్ చేయడం ద్వారా..: టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు కేలరీ నియంత్రిత ఆహారాన్ని తీసుకోవడం ద్వారా శరీరంలో చక్కెర స్థాయిలను తగ్గించుకుని, ఇన్సులిన్ ప్రక్రియను మెరుగుపరుచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఊబకాయంల్లో చాలామందికి డయాబెటిస్ ప్రమాదం ఉంది. కేవలం 10 శాతం మంది బాధితుల్లో మాత్రమే బాడీ మాస్ ఇండెక్స్(BMI) తక్కువగా ఉంటుందట. కాబట్టి, బరువు ఎక్కువగా ఉండేవారు ముందుగా అది తగ్గించుకొనే ప్రయత్నం చేయాలట. మరి, స్లిమ్‌గా ఉన్నా డయాబెటిక్‌కు గురయ్యేవారి పరిస్థితి ఏమిటనేగా మీ సందేహం? 


క్లోమం, కాలేయమే కీలకం: న్యూకాజిల్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ రాయ్ టేలర్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘ఇదివరకు నేను జరిపిన పరిశోధనల్లో అధిక బరువు కలిగిన టైప్-2 డయాబెటిస్ బాధితులు బరువు తగ్గడం ద్వారా ఉపశమనం పొందడం సాధ్యమవుతుందని తేల్చాం. ఫలితంగా  యూకేలోని NHS సూప్, షేక్ డైట్ ప్లాన్‌ను అందించగలిగాం. రక్తంలోని చక్కెర నియంత్రణలో పాల్గొనే రెండు కీలక అవయవాలు.. క్లోమం, కాలేయం. వీటి లోపల నుంచి కొవ్వును తొలగిస్తేనే వ్యాధి నియంత్రణలోకి వస్తుంది. ఊబకాయం లేదా అధిక బరువు కలిగిన వ్యక్తులు టైప్-2 డయాబెటిస్ నుంచి బయటపడేందుకు ఇది చాలా కీలకం’’ అని తెలిపారు. 
 
70 శాతం మందికి విముక్తి: ReTUNE అనే అధ్యయనంలో 20 మంది సన్నగా ఉండే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఫార్ములా మీల్ రీప్లేస్‌మెంట్‌లు, పిండి పదార్థాలు లేని కూరగాయలతో కూడిన ఆహారాన్ని రెండు నుంచి నాలుగు వారాల పాటు ఇచ్చారు. వారంతా రోజుకు 800 క్యాలరీల ఆహారాన్ని ఖచ్చితంగా తీసుకొనేలా చేశారు. 4-6 వారాల్లో వారంతా బరువు తగ్గారు. ఆ తర్వాత వారికి సాధారణ ఆహారాన్ని ఇచ్చి చూశారు. ఆ తర్వాత వారిలోని ప్యాంక్రియాస్(క్లోమం), కాలేయంలోని కొవ్వు మొత్తాన్ని పరిశీలించారు. చిత్రం ఏమిటంటే 12 నెలల తర్వాత వారి BMI సగటు 22.4, 24.8 వరకు తగ్గింది. అంటే వారు ఆరోగ్యకరమైన బరువు పరిధిలో ఉన్నట్లే. ఇంకో గుడ్ న్యూస్ ఏమిటంటే.. వారిలో 70 శాతం మంది పూర్తిగా డయాబెటిస్ నుంచి విముక్తి పొందారు. 


అధ్యయనంలో పాల్గొన్న డయాబెటిస్ రోగి స్పందన ఇది: మీరు తీసుకొనే డైట్ కాలేయానికి మేలు చేసిదిగా ఉండాలి. ముఖ్యంగా అక్కడ పెరిగే హానికరమైన కొవ్వును తొలగించే విధంగా ఉండాలి. ఈ అధ్యయనంలో పాల్గొన్న సుందర్‌ల్యాండ్‌లోని క్లీడన్‌కు చెందిన డేవిడ్ చైల్డ్స్ చెప్పిన వివరాల ప్రకారం.. 48 ఏళ్ల వయస్సులో డయాబెటీస్ తీవ్రత ఎక్కువైంది. తలనొప్పి, కంటిచూపు మందగించడం, మూర్ఛ వంటి సవాళ్లను ఎదుర్కొన్నారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న తర్వాత ఆరోగ్యం మెరుగైంది. ‘‘డయాబెటీస్ వల్ల నా ఆరోగ్యం క్షిణిస్తుందని భయపడ్డాను. తగిన వ్యాయామం, సరైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా నేను డయాబెటీస్‌ను నియంత్రించగలిగాను’’ అని డెవిడ్ తెలిపారు.


Also Read: వేసవిలో వేడి నీటితో స్నానం చేయొచ్చా? చేస్తే ఏమవుతుంది?


800 కేలరీల డైట్‌తో..: డయాబెటీస్ వల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలు కూడా పెరిగాయి. ఫలితంగా యూకేలోని National Health Service(NHS) రెండు వేర్వేరు కేలరీ డైట్ ప్రోగ్రామ్‌ను రూపొందించి, వివిధ ట్రస్టులకు అందించింది. ఈ డైట్‌ను పాటించేవారు నెల తర్వాత సగటున 7.2 కిలోల బరువు తగ్గిపోతారట. మూడు నెలల తర్వాత 13.4 కిలోలు వరకు బరువు కోల్పోతారు. ఫలితంగా 3 నెలల్లోనే డయాబెటీస్ దానికదే కంట్రోల్ అవుతుంది. అవయవాలకు కూడా ముప్పు తప్పుతుంది. కాలేయం వద్ద పేరుకున్న కొవ్వు తొలగిపోవడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి కూడా మెరుగుపడుతుంది. రోజు భోజనం, ఇతరాత్ర ఆహారాల ద్వారా కేవలం 800 కేలరీలను తీసుకోవడం కుదరదు. ఇది కేవలం సూప్‌లు, షేక్‌ల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఈ డైట్ పాటించడానికి ముందు మీరు వైద్యుడిని సంప్రదించాలి. అలాగే, రోజుకు 800 కేలరీలు మాత్రమే లభించే ఫుడ్ తీసుకొనేందుకు ఆహార నిపుణుల సలహా తీసుకోండి. 


Also Read: మాంసాహారం, ప్రోటీన్ షేక్స్ బాగా లాగిస్తున్నారా? పురుషులూ, ఇక పడక గదిని మరిచిపోండి!


గమనిక: యూకేలోని పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డయాబెటిస్ బాధితులు వైద్యులు, ఆహార నిపుణుల సూచన తర్వాత డైట్ పాటించాలి. బరువు తగ్గాలనే టార్గెట్‌తో ఆహారం మానేసినా ప్రమాదమే. కాబట్టి, డాక్టర్‌ను సంప్రదించి మీ రెగ్యులర్ డైట్‌ను రూపొందించగలరు. ఈ కథనంలోని అంశాలు చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని గమనించగలరు.