తెలంగాణలో నమోదైనా తొలి డ్రగ్స్ మృతిపై విచారిస్తున్న పోలీసులకు సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఓ పోలీసు కుమారుడే ఈ దందాలో ప్రధాన నిందితుడిగా ఉన్నట్టు తెలుస్తోంది.
డ్రగ్స్ తీసుకుంటూ మృతి చెందిన ఓ విద్యార్థి కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. నల్లకుంట రోడ్‌లో ప్రేమ్ ఉపాధ్యాయ అనే వ్యక్తితోపాటు ముగ్గుర్ని అరెస్టు చేశారు పోలీసులు. ఎంత కంట్రోల్ చేస్తున్న డ్రగ్స్ ఎలా వస్తున్నాయనే క్వశ్చన్ వాళ్లను వేధిస్తోంది. ఈ కేసులో నిందితుల కోసం హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
ఆ బీటెక్ విద్యార్థి హష్ ఆయిల్ తీసుకోవడం వల్లే చనిపోయినట్టు వైద్యులు నిర్దారించారు. దీన్ని బట్టి ఈ ఆయిల్ ఎవరు సరఫరా చేశారని ఆరా తీసిన పోలీసులకు షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ప్రేమ్ ఉపాధ్యాయ అనే వ్యక్తిని అరెస్టు చేసిన తర్వాత ఈ కేసులో లక్ష్మీపతి అనే వ్యక్తి ప్రధాన నిందితుడుగా గుర్తించారు. ఆయన ఆరేళ్లుగా ఈ డ్రగ్స్ దందా సాగిస్తున్నట్టు తెలుస్తోంది.
లక్ష్మీపతి సంగారెడ్డి జిల్లా బీరంగూడలోని తులసివనం కాలనీకి చెందిన పోలీస్ అధికారి కుమారుడు. బీటెక్‌ను డిస్‌కంటిన్యూ చేసి మొదట్లో గంజాయి సరఫరా చేసేవాడు. అరకుతోపాటు విశాఖ ఏజెన్సీకి చెందిన అనేక మంది గంజాయి సరఫరాదారులతో పరిచయాలు ఏర్పాటు చేసుకున్నాడు.
ఏజెన్సీ నుంచి గంజాయి తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయించేవాడు. పోలీసు నిఘా పెరగడంతో హైదరాబాద్ శివారులోనే బస్ దిగి స్నేహితుల సహాయంతో నగరంలోకి వచ్చేవాడు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి తరచూ బస మారుస్తుండే వాడు.
అరకు మండలంలోని లోగిలి ప్రాంతానికి చెందిన నగేష్ సహాయంతో హష్ ఆయిల్ దందా మొదలుపెట్టాక మరింత రెచ్చిపోయాడు లక్ష్మీపతి. ప్రవేట్ బస్సుల్లో రావడం సిటీ అవుట్‌స్కర్ట్స్‌లో దిగడం నల్గొండతోపాటు హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఆ హష్ ఆయిల్ అమ్మేవాడు. ఈ దందా కారణంగా ఇతనపై విశాఖ, నల్లగొండ, హయత్‌నగర్ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. అరెస్టులు కూడా అయ్యాడు. అందుకే అరెస్టై తిరిగి వచ్చిన తర్వాత మకాం మార్చేసేవాడు.
లక్ష్మీపతి ఏజెన్సీలో లీటర్ హష్ ఆయిల్ లక్షకు కొని నాలుగు నుంచి ఐదు లక్షల వరకు అమ్మేవాడు. హష్ ఆయిన్‌ను 5, 10 ఎంఎల్ పరిమాణంలో ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్‌లోకి మార్చి విక్రయించాడు. డిమాండ్ పెరగడంతో దీన్ని కల్తీ కూడా చేశాడు. ఇందులో ఇసోప్రోపిక్‌ను కలిపేవాడు. దీని వల్ల చాలా మంది బానిసలుగా మారిపోయారు. ఆన్‌లైన్ ఫుడ్ డెలవరీ యాప్స్ ద్వారా విక్రయాలు సాగించేవాడు.