భారత్‌లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతోంది. లక్షల కేసుల నుంచి 40 వేల వరకు రోజువారీ కేసులు జూన్ నెలలో దిగొచ్చాయి. కానీ కేరళ, మహారాష్ట్రలలో పాజిటివ్ కేసులు అధికంగా నమోదు అవుతుండటంతో దేశంలో థర్డ్ వేవ్ మొదలైందా అనే చర్చ సైతం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొవిడ్19 నిబంధనలు పాటించడంతో పాటు కరోనా టీకాలు తీసుకోవడం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూకే రీసెర్చర్లు జరిపిన అధ్యయనంలో పలు ఆశ్చర్యకర విషయాలు వెలుగుచూశాయి.


లండన్‌కు చెందిన కింగ్స్ కాలేజీ పరిశోధకులు కరోనా వైరస్ వ్యాప్తి, కరోనా లక్షణాలు, మార్పులపై తాజాగా అధ్యయనం చేశారు. ద లాన్సెట్ డిజిటల్ హెల్త్ అనే జర్నల్‌లో ప్రచురించిన విషయాల ప్రకారం.. కొవిడ్19 లక్షణాలు వయసు వారీగా మారుతున్నాయి. పురుషులు, స్త్రీలలో సైతం కరోనా లక్షణాలలో స్వల్ప వ్యత్యాసం ఉన్నట్లుగా గుర్తించారు. అయితే అందరిలో గుర్తించిన సాధరణంగా గుర్తించిన లక్షణం దగ్గు, వాసనను కోల్పోవడం. మరికొందరిలో పొత్తి కడుపులో నొప్పి రావడం లాంటి లక్షణాలు గుర్తించినట్లు జర్నల్‌లో పేర్కొన్నారు. కరోనా వైరస్ (SARS-CoV-2) సోకిన తొలి దశలో వయసు, లింగ భేదాన్ని బట్టి భిన్న లక్షణాలు పేషెంట్లలో వైద్యులు గుర్తించారని తాజా అధ్యయనంలో తేలింది. 


Also Read: India Corona Cases: దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా.. భయపెడుతున్న డెల్టా ప్లస్, కొత్త కేసులు ఎన్నంటే..


40 నుంచి 59 ఏళ్ల వయసు వారిలో అధికంగా దగ్గు సమస్య ఉండగా, చలి లేదా వణుకు లక్షణం ఉన్నవారిలో పొడిదగ్గు ఉందన్నారు. 60 ఏళ్లు పైబడిన వారిలో కొందరిలో మాత్రమే వాసన కోల్పోవడం లాంటి లక్షణాన్ని రీసెర్చర్స్ గుర్తించారు. 80 ఏళ్లు పైబడిన వారిలో డయేరియా సమస్య అధికంగా కనిపించింది. 60 నుంచి 70 ఏళ్ల వారిలో ఛాతీలో నొప్పి, కండరాల నొప్పి, శ్వాసం సంబంధిత సమస్యలు, వాసనను కోల్పోవడం లాంటి లక్షణాలు గుర్తించినట్లు ద లాన్సెట్ డిజిటల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించారు.


ఆడ, మగవారిలో భిన్నంగా కరోనా లక్షణాలు.. 
స్త్రీ, పురుషులలో సైతం కరోనా తొలి దశలో లక్షణాలు భిన్నంగా ఉన్నాయని చెప్పారు. మగవారిలో అధికంగా శ్వాస సంబంధిత సమస్యలు, చలి, వణుకు, అలసట లాంటి లక్షణాలను గుర్తించారు. మహిళా కరోనా బాధితులలో రుచిని కోల్పోవడం, ఛాతీలో నొప్పి, నిరంతరం దగ్గుతూనే ఉండటం లాంటి లక్షణాలు ఉన్నాయి. ఓ కుటుంబంలో ఉన్న అందరిలో ఒకే రకమైన కొవిడ్19 లక్షణాలు లేవని, వయసు, లింగ భేదాన్ని బట్టి భిన్నమైన కరోనా లక్షణాలు కనిపించాయని నిపుణులు వెల్లడించారు. గతంతో పోల్చితే ప్రస్తుతం పుట్టుకొస్తున్న కొత్త వేరియంట్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని తెలిపారు.


Also Read: Covid Third Wave: కరోనా థర్డ్ వేవ్ దగ్గర పడిందా? నిర్లక్ష్యమే కారణమా?