ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఇంకా కొనసాగుతోంది.  నిన్నటితో పోల్చితే కరోనా కేసులతో పాటు మరణాలు స్వల్పంగా పెరిగాయి. యాక్టివ్ కేసులు 150 రోజుల కనిష్టానికి చేరుకున్నాయి.  గడిచిన 24 గంటల్లో తాజాగా 18,86,271 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 36,571 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు.  అదే సమయంలో మరో 540 మంది కరోనా మహమ్మారితో పోరాడుతూ మరణించారు. 


దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ 4,33,589 మందిని కరోనా బలిగొంది. మరోవైపు దేశంలోని మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 3.23 కోట్లకు చేరుకుంది. వీరిలో నేటి ఉదయం వరకు 3.15 కోట్ల మంది కరోనా మహమ్మారిని జయించారని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో తెలిపింది. దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు మెరుగ్గా ఉంది. ప్రస్తుతానికి కరోనా రికవరీ రేటు 97.54 శాతానికి చేరినట్లు అధికారులు వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 3,63,605గా ఉన్నాయి. గత 150 రోజులలో అత్యల్ప క్రియాశీలక కరోనా కేసులు ఇవి.


Also Read: Taliban Crisis: స్వాతంత్య్ర దినోత్సవం రోజు తాలిబన్ల కాల్పులు.. పలువురు మృతి


57 కోట్ల డోసులు పంపిణీ


దేశంలో నేటి ఉదయం 8 గంటల వరకు 50,26,99,702 శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు పూర్తయ్యాయి. వీటిలో నిన్న ఒక్క రోజులోనే 18 లక్షల 86 వేల 271 శాంపిల్స్‌కు కొవిడ్ టెస్టులు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తాజా ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకూ రాష్ట్రాలకు 57 కోట్ల డోసుల కరోనా టీకాలు పంపించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. నిన్న ఒక్కరోజు 54.7 లక్షల మంది కొవిడ్ టీకాలు తీసుకున్నారు. రాష్ట్రాల వద్ద ఇంకా రెండు లక్షల మేర కరోనా టీకాలు నిల్వ ఉన్నట్లు సమాచారం.


Also Read: Hyderabad: ఇంట్లోకి చొరబడి దొంగతనం.. కానీ మంచోడట! అవాక్కైన బాధితుడు.. ఎలాగంటే..


ఆందోళన పెంచుతున్న కేరళ..


గత రెండు నెలలుగా కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో నమోదయ్యే కేసులలో సగానికి పైగా ఆ ఒక్క రాష్ట్రం నుంచే నమోదవుతున్నాయి. తాజాగా నమోదైన కేసులలో 20 వేలకు పైగా కేరళ రాష్ట్రం నుంచే నిర్ధారణ అయ్యాయి. అతిపెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దేశంలో కరోనా టీకాల రెండో డోస్‌ను నిర్ణీత సమయంలో తీసుకోని వారు 3.86 కోట్ల మంది వరకు ఉన్నారని కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. తప్పనిసరిగా తమ రెండో టీకాను నిర్ణీత సమయానికి తీసుకుంటే కరోనా తీవ్రత తక్కువగా ఉంటుందని ఐసీఎంఆర్, వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 


Also Read: కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఈ 5 ఆహారాలను తప్పక తీసుకోవాలి