కరోనా సెకండ్ వేవ్ దేశ ప్రజలపై ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. సమీప బంధువుల్లో ఎవరో ఒకరు చనిపోవడంతో ఈ సారి ప్రతి ఒక్కరూ కరోనా మహమ్మారికి భయపడ్డారు. కరోనా బారినపడి కోలుకున్న వాళ్లు కొందరు... హఠాత్తుగా గుండెనొప్పి తదితర సమస్యలతో ఒక్కసారిగా కుప్పకూలిన వార్తలు విన్నాం, చదివాం. కొంత మంది కరోనా బారిన పడినవాళ్లు మానసికంగా కుంగిపోయి చావుకు దగ్గరైన వాళ్లు ఉన్నారు. కరోనాను ధైర్యంగా ఎదుర్కొవాలి. ఇందుకు ఉదాహరణే విశ్వాస్ సైనీ. 






ఉత్తరప్రదేశ్ కి చెందిన విశ్వాస్ సైనీ 130 రోజులు కరోనా మహమ్మారితో పోరాడి విజయం సాధించాడు. సుమారు నాలుగు నెలలపాటు పోరాడి ఈ మధ్యే ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చాడు. ఏప్రిల్ 28న విశ్వాస్ నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది. ముందు ఇంట్లోనే హోం క్వారంటైన్ ద్వారా చికిత్స పొందాడు. కానీ, విశ్వాస్ ఆరోగ్యం కాస్త క్షీణించింది. దీంతో కుటుంబసభ్యులు మీరట్‌లోని నూటిమా ఆస్పత్రికి తరలించారు. 






‘సుమారు నెల రోజులపాటు విశ్వాస్‌కి వెంటిలేటర్ పై చికిత్స అందించారు. తన ఆక్సిజన్ లెవల్స్ 16కు చేరిన సందర్భాలు ఉన్నాయి. ఎలాగైనా బతకాలి అన్న అతని సంకల్పమే అతడ్ని కరోనాపై విజయం సాధించేలా చేసింది’ అని విశ్వాస్‌కి చికిత్స చేసిన డాక్టర్ సైనీ తెలిపారు. విశ్వాస్ చికిత్స పొందినన్ని రోజులు కుటుంబసభ్యులను ఒక్కసారి కూడా కలవలేదు. 24గంటలు అతడు ఆక్సిజన్ మాస్క్ ధరించే ఉండేవాడని డాక్టర్ చెప్పారు. 


ఎంతో మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోవడం స్వయంగా చూశాను. ఆ సమయంలో చాలా ఆందోళన చెందారు. నాకు చికిత్స అందించిన డాక్టర్లు నన్ను motivate చేశారు. కోలుకోవడం పై ద్రుష్టి పెట్టమని సూచించేవారని విశ్వాస్ చెప్పాడు. ఒకానొక సమయంలో నేను చచ్చిపోతానని డాక్టర్లు కూడా  అనుకున్నారు. కానీ, నా లక్ బాగుంది. అందుకే మళ్లీ తిరిగి కుటుంబసభ్యుల వద్దకి చేరుకున్నా. ఇప్పుడు చాలా సంతోషంగా ఉందన్నాడు. 


ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినప్పటికీ ప్రస్తుతం ప్రతి రోజూ కొన్ని గంటల పాటు అతడికి ఆక్సిజన్ సపోర్టు ఉండాలి. ఇప్పటికీ అతడు మెడికేషన్లోనే ఉన్నాడని వైద్యులు తెలిపారు.