ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం కోటిన్నర వ్యాక్సిన్ డోసులను అందించాలని ఆరోగ్యశాఖ లక్ష్యం పెట్టుకుంది. అయితే అనూహ్యంగా 2 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసి కొత్త రికార్డ్ సృష్టించింది. వ్యాక్సినేషన్ కార్యక్రమం జెట్ స్పీడ్‌లో సాగుతోంది.
మధ్యాహ్నం 1.30 గంటల లోపు..
శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 1:30 గంటల లోపు కోటికిపైగా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఆ తర్వాత మరో నాలుగు గంటల్లోనే మరో కోటి డోసులు పంపిణీ చేసి ఆశ్చర్యపరిచింది. నెల రోజుల కన్నా తక్కువ వ్యవధిలో రోజుకు కోటి డోసులు పంపిణీ చేయడం ఇది నాలుగోసారి. కానీ ఒక్కరోజులో 2 కోట్ల డోసులు అందివ్వటం ఇదే తొలిసారి.
శుక్రవారం ఉదయం నాటికి మొత్తం 77.24 కోట్లకు పైనే టీకా డోసులు పంపిణీ చేసినట్లు వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భారత్ వేగంగా ఉందని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించింది.