చార్‌ధామ్ యాత్ర సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు. ఉత్తరాఖండ్ హైకోర్టు గురువారం చార్‌ధామ్ యాత్రపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసిన తరువాతి రోజే సీఎం ప్రకటన వెలువడటం విశేషం. అయితే యాత్రికులు కచ్చితంగా కొవిడ్ నిబంధనలు పాటించాలని సీఎం తెలిపారు. కోర్టు ఆదేశాలను పాటిస్తూ చార్‌ధామ్ యాత్ర చేసుకోవాలని సూచించారు.


హైకోర్టు తీర్పు..


చార్‌ధామ్ యాత్రపై ఉత్తరాఖండ్ హైకోర్టు గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. యాత్రపై నిషేధాన్ని ఎత్తివేసింది. అయితే భక్తులకు, అధికారులకు కీలక సూచనలు చేసింది. దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యను పరిమితం చేయాలని సూచించింది.


చార్‌ధామ్ యాత్రకు వచ్చే భక్తులు తప్పనిసరిగా తమతో పాటు కరోనా వైరస్ నెగిటివ్ రిపోర్టులు ఉంచుకోవాలని కోర్టు తెలిపింది. రెండు డోసుల టీకా తీసుకున్న సర్టిఫికేట్‌ను తప్పనిసరి చేసింది కోర్టు. కరోనా మార్గదర్శకాలను పాటించేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. 





అనుమతి ఇచ్చినప్పటికీ..




చార్‌ధామ్‌ను సందర్శించేందుకు హైకోర్టు యాత్రికులను అనుమతించినప్పటికీ  భక్తుల సంఖ్యపై మాత్రం పరిమితులు విధించాలని తెలిపింది. కేదార్‌నాథ్ ఆలయంలో 800 మంది భక్తులు, బద్రీనాథ్ ఆలయంలో 1200 మంది, గంగోత్రిలో 600 మంది, యమునోత్రి ధామ్‌లో 400 మంది భక్తులను మాత్రమే అనుమతించాని హైకోర్టు ఆదేశించింది.


గతంలో కరోనా థర్డ్‌వేవ్‌ ముప్పును దృష్టిలో పెట్టుకుని చార్‌ధామ్‌ యాత్రకు పర్మిషన్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌, యమునోత్రి, గంగోత్రిలను కలిపి చార్‌ధామ్‌లుగా పిలుస్తారు. ఈ ఆలయాలు సంవత్సరంలో ఆరు నెలలు మంచుతో మూసుకుపోయి ఉంటాయి. వేసవి నుంచి ఆరు నెలలు మాత్రమే భక్తులు సందర్శించుకునేందుకు వీలుంటుంది.


గురుద్వార యాత్ర..


చార్‌ధామ్ యాత్రతో పాటు గురుద్వార హెమ్‌కుంత్ సాహెబ్ యాత్ర కూడా సెప్టెంబర్ 18నే మొదలుకానుంది. ప్రతిరోజు దర్శనానికి 1000 మంది భక్తులకు మాత్రమే అనుమతి ఉంది. దర్శనం చేసుకునే 72 గంటల లోపు చేయించుకున్న నెగిటివ్ ఆర్‌టీ-పీసీఆర్ రోపోర్ట్‌ను చూపించాల్సి ఉంటుంది.