ABP  WhatsApp

Corona Deaths: కరోనా తెచ్చిన కన్నీళ్లు.. అయ్యో పాపం పసివాళ్లు..!

ABP Desam Updated at: 21 Jul 2021 01:23 PM (IST)

కరోనా తెచ్చిన కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే లోకం పోకడ తెలియని పసివాళ్లను కూడా కరోనా వదల్లేదు. ఈ కరోనా సంక్షోభంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు ఎంతమందో తెలుసా?

CHILD

NEXT PREV

కరోనా.. ప్రపంచానికే కొత్త పాఠాలు నేర్పింది. ఎంతోమంది కన్నవారిని కోల్పోతే.. మరి కొంత మంది ఉన్న ఆస్తిని కోల్పోయారు. ప్రైవేట్ ఆసుపత్రులు వైద్యం పేరుతో చాలామందిని నిలువు దోపిడి చేసేశాయి. ఎంత ఖర్చు పెట్టినా కొంతమంది అన్నీ అనుకున్న అమ్మానాన్నలనే కోల్పోయారు. ఇదీ సింపుల్ గా చెప్పాలంటే కరోనా చేసిన పని. భారత్ లోనూ చాలా మంది పసిపిల్లలు అనాథలయ్యారు. ఆ లెక్కలు చూస్తే కరోనా తెచ్చిన కన్నీళ్లు ఏంటో అర్థమవుతాయి. 


పాపం పసివాళ్లు..


ఏడాదిన్నర కాలంగా యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తోన్న కరోనా మహమ్మారి విలయంలో హృదయవిదారక కోణమిది. ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసిన ఈ మహమ్మారి.. ఎంతో మంది చిన్నారులకు కన్నవారిని దూరం చేసింది. లక్షల మంది పిల్లలను దిక్కులేనివారిని చేసింది. కొవిడ్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 15 లక్షల మందికి పైనే చిన్నారులు తల్లిదండ్రులు, సంరక్షకులను కోల్పోయినట్లు లాన్సెట్‌ తాజా అధ్యయనం వెల్లడించింది. ఒక్క భారత్‌లోనే 1.19 లక్షల మంది పిల్లలపై కరోనా కాఠిన్యం చూపించింది. 


ఆ మూడు దేశాలపై.. 


2020 మార్చి నుంచి 2021 ఏప్రిల్‌ వరకు 14 నెలల కాలంలో ప్రపంచవ్యాప్తంగా 21 దేశాల్లో 15,62,000 మంది చిన్నారులు తల్లిదండ్రులు, సంరక్షకుల్లో(బామ్మా తాతయ్యలు లేదా ఇతర బంధువులు) కనీసం ఒకరిని కోల్పోయినట్లు లాన్సెంట్‌ నివేదిక వెల్లడించింది. ఇందులో 10,42,000 మంది తల్లీ/తండ్రీ లేదా ఇద్దరినీ కోల్పోయినట్లు తెలిపింది. తల్లుల కంటే నాన్నలను కోల్పోయిన చిన్నారులు ఐదు రెట్లు అధికంగా ఉన్నారు. అత్యధికంగా మెక్సికోలో 1.41లక్షల మంది పిల్లలు అమ్మానాన్నలు లేదా ఇతర సంరక్షకులను కోల్పోయారు. బ్రెజిల్‌, భారత్‌, అమెరికా దేశాల్లోనూ ఈ సంఖ్య లక్షకు పైనే ఉంది. మిగిలిన దేశాల్లోనూ కరోనా ప్రభావం పిల్లలపై ఎక్కువగానే ఉంది.



భారత్‌లో..



"ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న ప్రతి రెండు కరోనా మరణాలకు.. ఒక చిన్నారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులను కోల్పోతుండటం విషాదకరం. ఈ ఏడాది ఏప్రిల్‌ 30 నాటికి ప్రపంచవ్యాప్తంగా 30లక్షల కొవిడ్‌ మరణాలు సంభవించగా.. 15లక్షల మంది పిల్లలకు కన్నవారు/సంరక్షకులు దూరమయ్యారు" - డాక్టర్‌ సూసన్‌ హిల్లీస్‌, అమెరికా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ లీడ్ ఆథర్‌.


కరోనా కారణంగా భారత్‌లో 1,19,000 మంది చిన్నారులు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకర్ని లేదా సంరక్షకుల్లో ఒకరిని కోల్పోయినట్లు లాన్సెట్‌ పేర్కొంది. ఇందులో 1.16లక్షల మందికి తల్లీ/తండ్రీ లేదా ఇద్దరినీ దూరం చేసినట్లు తెలిపింది. భారత్‌లో 25,500 మంది పిల్లలు తల్లులను కోల్పోగా.. 90,751 మంది చిన్నారులు తండ్రి ప్రేమకు దూరమయ్యారు. ఎవరూ ఊహించని కష్టాలను తెచ్చిన కరోనా అంతం ఎప్పుడో చూడాలి.


Published at: 21 Jul 2021 01:23 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.