సాధారణ వ్యక్తులతో పోలిస్తే మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారికి కోవిడ్ (Covid- 19) సోకే ప్రమాదం ఎక్కువని తాజా అధ్యయనంలో వెల్లడైంది. మానసిక రుగ్మతలు ఉన్న వారికి కోవిడ్ సోకితే అధికంగా మరణించడమో, ఆసుపత్రి పాలు కావడమో జరుగుతోందని తేలింది. యూరోపియన్ కాలేజ్ ఆఫ్ న్యూరో సైకోఫార్మాకాలజీకి (European College of Neuro psychopharmacology) చెందిన ఇమ్యునో న్యూరో సైకియాట్రీ నెట్‌వర్క్ (Immuno Neuro Psychiatry Network) ఈ అధ్యయనాన్ని నిర్వహించింది.
దీని ప్రకారం మిగతా వారితో పోలిస్తే మానసిక రుగ్మతలు ఉన్న వారికి కోవిడ్ సోకితే మరణించడం, ఆసుపత్రుల్లో చేరడం వంటివి రెండు రెట్లు అధికంగా జరుగుతాయని స్పష్టమైంది. యాంటిసైకోటిక్స్ (antipsychotics ) లేదా యాంజియోలైటిక్స్ (anxiolytics) వంటి ఆందోళన తగ్గించే మందులతో చికిత్స పొందుతున్న వారిలో కూడా ఇవే ఫలితాలు కనిపించాయి.
మొత్తం 22 దేశాలకు చెందిన 1,469,731 మంది (వీరిలో 43,938 మంది మానసిక రోగులు ఉన్నారు) కోవిడ్ పేషెంట్లపై నిర్వహించిన 33 అధ్యయనాల సమాచారం ఆధారంగా ఇమ్యునో న్యూరో సైకియాట్రీ నెట్‌వర్క్ ఈ విషయాలను వెల్లడించింది. వీటిలో 23 అధ్యయనాల్లో కోవిడ్ సంబంధిత మరణాలు, ఆసుపత్రిలో చేరడం, ICU లో ఉంచడం వంటి పలు అంశాలను పరిశీలించింది.
"తీవ్రమైన మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారిలో మరణాలు, ఆసుపత్రిలో చేరే అవకాశాలు ఎక్కువని మేం చాలా సార్లు వెల్లడించాం. టీకాలు అమలు చేసే విధానాన్ని మార్చాలని మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కూడా పలు దేశాలకు సూచించాం. అయితే మానసిక రుగ్మతలతో బాధపడుతున్న రోగుల మరణాలు, ఆసుపత్రిలో చేరే వారి సంఖ్యపై సరైన ఆధారాలు లేకపోవడం వల్ల మా సిఫార్సుల అమలుకు ఆటంకం కలుగుతుంది. ఇదే కారణంతో చాలా దేశాల జాతీయ ఆరోగ్య అధికారులు మా అభ్యర్థనలను తిరస్కరిస్తున్నారు. ఈ కారణంగానే మేం లిఖిత పూర్వకంగా అధ్యయన వివరాలు ప్రకటిస్తున్నాం. ఈ కొత్త సాక్ష్యాలతోనైనా పరిస్థితులు మారతాయని ఆశిస్తున్నాం. తీవ్రమైన ముప్పు ఉన్న మానసిక రోగులందరికీ పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ అందించాలి. కోవిడ్ సోకిన మానసిక రోగులను జాగ్రత్తగా చూసుకునేందుకు వీలుగా వారిని పెద్ద ఆసుపత్రులకు రిఫర్ చేయాలి" అని ఈ అధ్యయనంలో పాల్గొన్న బెల్జియంలోని యూనివర్సిటీ సైకియాట్రిక్ హాస్పిటల్ క్యాంపస్ డఫెల్ కు చెందిన డాక్టర్ లివియా డి పికర్ వెల్లడించారు.
ఇమ్యునో న్యూరో సైకియాట్రీ నెట్‌వర్క్ డైరెక్టర్ మేరియాన్ లెబోయర్ మాట్లాడుతూ.. "మానసిక రోగులు ఉపయోగించే మందుల వల్ల కూడా కోవిడ్ లక్షణాలు తీవ్రం అయ్యే అవకాశం ఉంది. మానసిక రోగులకు ఇచ్చే బెంజోడయైజెఫైన్స్ (Benzodiazepines) సహా ఇతర మందుల వల్ల కూడా శ్వాస సంబంధ సమస్యలు కనిపిస్తున్నాయి. దీని వల్ల అధిక మరణాలు సంభవిస్తున్నట్లు భావిస్తున్నాం. అయితే దీని గురించి మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది" అని అన్నారు. తీవ్రమైన మానసిక అనారోగ్యం, రుగ్మతలతో బాధపడే వారికి మొదటి ప్రాధాన్యతగా వ్యాక్సిన్లు ఇవ్వడం ద్వారా ఈ ప్రమాదం నుంచి బయటపడవచ్చని వైద్యరంగానికి చెందిన జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు చెందిన పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ఈ అధ్యయన వివరాలు 'లాన్సెట్ సైకియాట్రీ' (Lancet Psychiatry) జర్నల్ లో ప్రచురితమయ్యాయి.