ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘురామకృష్ణరాజుతో పాటు రెండు టీవీ చానళ్లపై రాజద్రోహం కేసులు పెట్టింది. ఇప్పుడు ఆ కేసుల విషయంలో సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. ఆరోపణలు చేయడానికి  రఘురామకృష్ణరాజుకు టీవీ చానళ్లు డబ్బులిచ్చాయని.. ఆ అఫిడవిట్‌లో ప్రభుత్వం తెలిపింది.  రఘురామ రాజుకు టీవీ5 చైర్మన్‌ పదిలక్షల యూరోలు బదిలీ చేశారని పేర్కొన్నారు. అందుకు బదులుగా రఘురామ రాజు తన పదవిని.. టీవీ ఛానళ్లు, వ్యక్తుల ప్రయోజనాల కోసం వినియోగించారని ఆరోపించింది. అందుకే రఘురామకృష్ణ రాజు చేసిన ప్రసంగాలు, ఇచ్చిన ఇంటర్వ్యూలను ముందుగానే ఒక పథకం ప్రకారం తయారు చేసి ప్రసారం చేశారని పేర్కొంది. 


రఘురామరాజును అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఫోన్‌ను స్వాధీనం చేసుకుని అందులో ఉన్న డేటాను పరిశీలించినప్పుడు... ప్రెస్‌ మీట్ల తర్వాత మీడియా వ్యక్తుల నుంచి ఆయనకు ప్రశంసలు వచ్చాయని అదే కుట్రకు సాక్ష్యామని ప్రభుత్వం అఫిడవిట్‌లో వాదించింది. రఘురామరాజు ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లను ఛానళ్లు తమ విధిలో భాగంగా మాత్రమే చేయలేదని.. రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం చేశాయని ప్రభుత్వం చెబుతోంది.  వివిధ సామాజిక వర్గాల మధ్య శత్రుత్వాన్ని, ప్రభుత్వం పట్ల విద్వేషాన్ని రెచ్చగొట్టి, హింసకు ప్రేరేపించే కుట్రకు పాల్పడ్డాయని ఆరోపించింది. ఈ మొత్తం వ్యవహారం వెనుక చంద్రబాబు ఉన్నారని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రఘురామ రాజు, చంద్రబాబు, లోకేశ్‌ మధ్య ఫోన్లలో సంభాషణలు, వారు డాక్యుమెంట్లు షేర్ చేసుకున్నారని ప్రభుత్వం వాదించింది.


అయితే ఈ అఫిడవిట్‌పై టీవీ 5 మండిపడింది. సుప్రీంకోర్టును సైతం తప్పుదోవ పట్టించేందుకు ప్రభుత్వం వెనుకాడటం లేదని... రఘురామకృష్ణరాజుతో టీవీ5కి అసలు ఎప్పుడూ ఆర్థిక లావాదేవీలు లేవని స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహరంపై తాము సుప్రీంకోర్టుకు వివరణ  పంపుతామని..   నిజాల్ని వెల్లడిస్తామని ప్రకటించింది. అయినా... టీవీల్లో మాట్లాడినందుకు డబ్బులు  ఇస్తారని.. అదీ కూడా కోట్లకు కోట్లు ఇస్తారని ఎవరూ అనుకోరు. ఇప్పుడు.. ఈ అఫిడవిట్ వ్యవహారం వివాదాస్పదంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే..  ఆరోపణలు చేయడం.. విమర్శించడమే తప్పన్నట్లుగా రాజద్రోహం కేసులు పెట్టిన ఏపీ సర్కార్‌కు.. సమర్థించుకోవడంలోనూ తప్పుడు ఆరోపణలు చేశారన్న విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. 


నిజానికి టీవీ ఛానళ్లలో ఇలా ప్రభుత్వంపై ఆరోపణలు చేసేందుకు.. ఛానళ్ల యాజమాన్యాలు కోట్లకు కోట్లు ఇస్తాయని ఎవరూ అనుకోరు. అలా ప్రభుత్వంపై డబ్బులు తీసుకుని ఆరోపణలు చేయాల్సినఅవసరం.. రఘురామకృష్ణరాజుకు ఉందని కూడా ఎవరూ అనుకోరు. కానీ ఏపీ సర్కార్ కు ఆయన ఫోన్ లో ఈ మేరకు ఆధారాలు దొరికాయేమో కానీ.. సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ సందర్భంగా కీలకమైన మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది. అఫిడవిట్‌లో చెప్పిన దానికి ఆధారాలు సమర్పిస్తే.. కేసు సంచలనం అయ్యే అవకాశం ఉంది.