సీనియర్ హీరో వెంకటేష్ నటించిన 'నారప్ప' సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇది తమిళ 'అసురన్' సినిమాకి రీమేక్ అనే సంగతి తెలిసిందే. అయితే కొంచెం కూడా మార్పులు చేయకుండా సీన్ టు సీన్ దించేశారు. చివరకు డైలాగ్స్ కూడా ట్రాన్సలేట్ చేశారే కానీ కొత్తగా ఏం రాయలేదు. తమిళ నేపథ్యాన్ని రాయలసీమకి అతికించడంలో సక్సెస్ అయ్యారు కానీ డైలాగ్స్, సీన్స్ మొత్తం యాజిటీజ్ గా ఉండడంతో ఒరిజినల్ వెర్షన్ చూసిన వారు 'నారప్ప'కి కనెక్ట్ అవ్వడం కష్టమే. కొన్ని సీన్లలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా తమిళ వెర్షన్ నుండి కాపీ చేసేశారు. 


ఉన్నది ఉన్నట్లుగా కాపీ చేయడానికి రీమేక్ చేయడం ఎందుకనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే.. లాక్ డౌన్ సమయంలో అందరూ ఇళ్లల్లోనే ఉన్నారు. థియేటర్లు ఓపెన్ లేకపోవడంతో ఓటీటీలపై పడ్డారు. భాషతో సంబంధం లేకుండా కొంచెం బాగుందనే టాక్ వచ్చిన సినిమాలను కూడా చూసేశారు. తమిళం, మలయాళం, హిందీ భాషలకు చెందిన చాలా సినిమాలు ఓటీటీలో రాగా.. అందులో కొన్ని మంచి హిట్స్ అందుకున్నాయి. వాటిల్లో 'అసురన్' ఒకటి. ధనుష్ హీరోగా నటించారు. ఈ సినిమా గురించి తెలుసుకున్న చాలా మంది తెలుగు ఆడియన్స్ ఓటీటీలో సినిమాను చూసేశారు.


ఎప్పుడైతే తెలుగులో రీమేక్ చేస్తున్నారని వార్తలు వచ్చాయో.. అప్పుడు మరికొంతమంది సినిమాను చూసేశారు. దాదాపు అరవై, డెబ్భై శాతం మంది ఆడియన్స్ 'అసురన్'ని చూశారు. పైగా ఈ మధ్య అమెజాన్ లో విడుదలవుతున్న సినిమాలను వివిధ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఒకే సినిమా నాలుగైదు భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు రీమేక్ వెర్షన్ కాస్త.. డబ్బింగ్ వెర్షన్ లా మారింది. అయినా 'నారప్ప' సినిమాను ఒరిజినల్ తో పోల్చే సాహసం కూడా చేయలేము. 



సినిమా చూస్తున్నంతసేపు తమిళ వెర్షన్ లో కనిపించిన ఇంటెన్సిటీ కానీ సోల్ కానీ కనిపించదు. 'అసురన్' అనేది ఓ కల్ట్ హిట్. అలాంటి సినిమాలను వేరే భాషల్లో రీమేక్ చేసినప్పుడు.. ఒరిజినల్ వెర్షన్ ను చూసిన కళ్లతో రీమేక్ వెర్షన్ ను చూడలేము. 'అసురన్' సినిమాను చూసిన వాళ్లకు 'నారప్ప' ఒక ప్యారడీలా అనిపించొచ్చు. కథలో మార్పులు చేస్తే రిస్క్ అనుకున్నారేమో ఏమో గానీ దర్శకుడు కొంచెం కూడా మార్చాలని అనుకోలేదు. కనీసం డైలాగ్స్ విషయంలోనైనా శ్రద్ధ చూపిస్తే బాగుండేది కానీ అది కూడా జరగలేదు. కథపై ఎలాంటి కసరత్తులు చేయకుండా.. యథాతథంగా రీమేక్ చేసేశారు. దీంతో కథలో సోల్ మిస్ అయి.. అటూ ఇటూ కాకుండా అయిపోయింది. 



ఒరిజినల్ వెర్షన్ చూడకుండా నేరుగా 'నారప్ప'ని చూసేవాళ్లకు మాత్రం కచ్చితంగా సినిమా నచ్చుతుంది. వెంకటేష్ ఎమోషనల్, టెరిఫిక్ పెర్ఫార్మన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవ్వడం ఖాయం. కొడుకుని కాపాడుకోవడం కోసం చేసే ప్రయత్నంలో వెంకీ ఎమోషన్స్ పీక్స్ లో ఉన్నాయి. ప్రియమణి, రాజీవ్ కనకాల, రావు రమేష్ ఇలా అందరూ సత్తా ఉన్న తారలే ఇందులో నటించారు. ఈ విషయంలో 'నారప్ప'కు పెరి పెట్టడానికి లేదు. ఈ సినిమా ఓటీటీలో విడుదలైంది కాబట్టి కలెక్షన్స్ గోల ఉండదు. సో.. హిట్, ప్లాప్ అనే ప్రామాణికాలు కూడా ఉండవ్.