కొత్త అల్లుడికి ఆషాడం మాసంలో కానుకలు ఇవ్వడం మన హిందూ సంప్రదాయం. ఎవరి స్తోమతని బట్టి వారు ఇచ్చుకుంటారు. కొందరు బంగారం, వెండి కానుకలిస్తే మరికొందరు ఇంట్లోకి అవసరమైన వస్తువులు బీరువా, మంచం, ఇంట్లో వాడుకునే సామాన్లు ఇస్తారు. కానీ గోదావరి జిల్లాకు చెందిన ఓ కుటుంబం ఆషాఢ కావిళ్లు పేరుతో వియ్యాలవారింటికి పంపించిన సారె చూసి చర్చించుకోని వారు లేరు. ఓ రకంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది ఆ సారె.
రాజమండ్రికి చెందిన వ్యాపారవేత్త బత్తుల బలరామకృష్ణ… తన కుమార్తెని యానాంకి చెందిన పవన్ కుమార్ కి ఇచ్చి పెళ్లిచేశాడు. ఆషాఢం సందర్భంగా వియ్యంకుడి ఇంటికి పంపిన సారె చూసి నోరెళ్లబెట్టారంతా. ఇంతకీ ఆ సారెలో ఏమున్నాయంటే… బిందెలలో 50 కేజీల స్వీట్స్, హాట్స్, 250 కేజీల కిరాణా వస్తువులు, 100 కేజీల డ్రై ఫ్రూట్స్, టన్ను చొప్పున కొర్రమీను, పండుగ గప్ప, బొచ్చె చేపలు, రొయ్యలు, 250 కేజీల బొమ్మిడాయిలు,10 మేక పోతులు, 50 కోళ్లు, జత మేకల చెవులకి బంగారు రింగులు, 200 ఆవకాయ జాడీలు, 5 వాహనాలతో పంపించాడు.
ఇంత భారీగా సారె పంపించడానికి కారణం కరోనా అన్నాడు వధువు తండ్రి. ఎందుకంటే అత్యంత వైభవంగా జరగాల్సిన పెళ్లి కరోనా కారణంగా చాలా సాదాసీదాగా జరిగిపోతున్నాయ్. కరోనాకి ముందు పెళ్లి ఎంత ఘనంగా జరిపించామన్నదే చర్చించుకునేవారు. పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు, కళ్లు మిరిమిట్లు గొలిపే లైటింగ్, భారీగా తరలివచ్చే బంధుమిత్రులు, అద్భుతమైన విందు…ఇలా ఉండేది. మీరు గొప్ప అంటే మేం గొప్ప అని….అంతకుమించి అని మాట్లాడుకునేవారు. కానీ కరోనా ఎంట్రీతో పరిస్థితి ఒక్కసారిగా తారుమారయ్యాయి. పట్టుమని పది మంది ఓ దగ్గర చేరితే వామ్మో అంటున్నారు. గుంపులో ఎవరో ఒకరు తుమ్మినా దగ్గినా బంధుమిత్రులంతా క్వారంటైన్ కే. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లికి కొద్దిమంది మాత్రమే అని పరిమితులు విధించాయి ప్రభుత్వాలు. దీంతో వైభవంగా జరగాల్సిన పెళ్లిళ్లు సాదాసీదాగా కానిచ్చేస్తున్నారు. అందుకే పెళ్లి ఎలాగూ ఘనంగా జరిపించలేకపోయాం…సారె అయినా కళ్లు చెదిరేలా వైభవంగా ఉండాలని ఆలోచించారు వధువు కుటుంబ సభ్యులు.
నూతన వధువు సారె తీసుకురావడమనే ఆచారం తమ దగ్గర ఎప్పటి నుంచో ఉందన్న వరుడి కుటుంబ సభ్యులు… వియ్యంకుడు పంపిన భారీ ఆషాఢం సారె కావిడి ఇంతవరకూ ఎవరూ పంపించి ఉండరన్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఈ రేంజ్ లో ఆషాడ సారె చూసి వియ్యాలవారి కుటుంబం ఆశ్చర్యపోయింది.
ఏదేమైనా ఈ సారె చూసిన వాళ్లంతా కొత్త ట్రెండ్ ఫాలో అవుతారేమో చూడాలి. పెళ్లిళ్లు వైభవంగా చేయలేనివారంతా ఇకపై సారె ఘనంగా పెట్టేందుకు దృష్టి సారిస్తారేమో......