రుద్ర అంటే శివుడు, అక్ష అంటే కన్నీరు. రుద్రాక్షలు అనేవి శివుని కంటి నుంచి జాలువారిన బిందువులు. రుద్రాక్షలు వాటి ఉపయోగాల గురించి శివపురాణం, దేవీ పురాణం, పద్మ పురాణంలో ప్రధానంగా చర్చించారు.




శివపురాణం ప్రకారం రాక్షసరాజైన త్రిపురాసురుడు వరగర్వంతో దేవతలను తీవ్ర ఇక్కట్లకు గురిచేస్తుండేవాడు. దేవతలంతా పరమ శివుని మొరపెట్టుకన్నారు. త్రిపురాసుర సంహారం కోసం శక్తిమంతమైన అఘోరాస్త్రం పొందడానికి తీవ్రమైన తపస్సు చేశాడు శివుడు. తపస్సు కోసం సమాధిలోకి వెళ్లిన పరమశివుడు చాలా కాలం తర్వాత కళ్లు తెరిచినప్పుడు కొన్ని అశ్రు బిందువులు భూమి మీద పడ్డాయి. ఆ అశ్రువులే విత్తనాలుగా మారి రుద్రాక్ష వృక్షాలుగా మొలకెత్తాయని.. ఈ చెట్టు నుంచి వచ్చే ఫలాల్లో బీజాలనే రుద్రాక్షలంటారని చెబుతారు.




ఆధ్యాత్మికంగా, శాస్త్రీయంగా రుద్రాక్షకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. చాలామంది శివ భక్తులు మెడలో మాలగా ధరించడం చూస్తూనే ఉంటాం. వీటిని ధరించడం వల్ల  మానసిక ప్రశాంతత లభిస్తుందని కొందరి భక్తుల నమ్మకం. అయితే ఇండో వెస్ట్రన్ కల్చర్ లో  ఫ్యాషన్ కోసం కూడా రుద్రాక్షలు ధరించేవారి సంఖ్య ఎక్కువ ఉండడంతో వీటికి మరింత ప్రాముఖ్యత పెరిగింది.




ప్రారంభదశలో ఓ నీలిరంగు పండులోపల ఉండే గుజ్జులో రుద్రాక్ష ఉంటుంది. సాధారణంగా హిమాలయ ప్రాంతాల్లో ఉండడం మనం చూస్తుంటాం. ఈ మధ్యకాలంలో ఢిల్లీ యూనివర్శిటీ పరిసరాల్లో కూడా వీటిని గుర్తించారు …కానీ… ఇంట్లో పెంచే మొక్కలుగా గుర్తించడం చాలా అరుదు…. కానీ ఓ పద్ధతి అనుసరిస్తే ఇంట్లోకూడా పెంచుకోవచ్చు.




స్థానిక నర్సరీల్లో, ఆన్‌లైన్లో సులభంగా లభించే ఒకే రుద్రాక్ష ప్లాంట్ నుంచి పదుల నుంచి వందల మొక్కలు తయారు చేయవచ్చు. రుద్రాక్ష కాండం “పెన్సిల్ మందం లేదా అంతకంటే ఎక్కువ” ఉంటుంది. రుద్రాక్ష కొమ్మ బెరడుని పదునైన కత్తితో రెండు అంగుళాల లోతులో స్క్రాచ్ చేయాలి. ఆ తర్వాత పెళుసులాంటి నాచుని బాల్స్ లా తయారు చేసి దాల్చిన చెక్క పొడి లేదా తేనెలో ముంచి  కొన్ని గంటలపాటూ నీటిలో నానబెట్టాలి. మట్టి-వర్మీ కంపోస్ట్ అయినా పర్వాలేదు. ప్రతి బంతిని ఒక ఎయిర్ లేయరింగ్ కోసం ఉపయోగించవచ్చు. ఈ ప్రక్రియలో ఆ బాల్ ఎండిపోకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.




చాకుతో స్క్రాచ్ చేసిన భాగంలో ఈ నాచు బాల్ ని చుట్టిపెట్టి...ఓ ప్లాస్టిక్ కవర్ తో కానీ... జనపనారతో కానీ కప్పి ఉంచాలి. కనీసం మూడు నుంచి ఏడు వారాల పాటూ ఆ ప్లాస్టిక్ కవర్ ని తాకకుండా ఉంచడం వల్ల ఏర్పడిని ఎయిర్ లేయరింగ్ నుంచి మూలాలు పుట్టుకొస్తాయి. ఆ తర్వాత చెట్టు నుంచి ఆ భాగాన్ని కత్తిరించాలి. బెరడు చుట్టూ చుట్టిన నాచు బంతి పెళుసుగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వేరు చేసి... సున్నితంగా ఆ ప్లాస్టిక్ పొరని విప్పి  ఓ కుండలో నాటాలి. మీ మొక్క ఎత్తు ఆధారంగా కుండ  పరిమాణాన్ని నిర్ణయించవచ్చు. ప్లాస్టిక్ కుండలు పర్యావరణ అనుకూలమైనవి కావు కాబట్టి మట్టి కుండల్లో నాటితే మంచిది.




రుద్రాక్ష మొక్క పెరుగుతున్న దశలో, మొక్కకు తగినంత పోషణ అవసరం. ఇందుకోసం సాదా తోట మట్టిని ఆవు పేడ లేదా కంపోస్ట్‌ వేస్తూ ఉండాలి. బొగ్గు బూడిద కూడా మొక్కకు పోషకాలు అందిస్తుంది. ప్రాసెస్ చూస్తే చాలా సులువే. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఇంట్లో పెంచేయండి రుద్రాక్ష....