కొవిడ్‌ 19 సంబంధిత మరణాలకు ధ్రువపత్రాలు జారీ చేసేందుకు మార్గదర్శకాలను సుప్రీం కోర్టుకు నివేదించింది కేంద్రం. కేంద్ర ఆరోగ్య శాఖ, భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ఈ మార్గదర్శకాలు రూపొందించినట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు సుప్రీం కోర్టులో కేంద్రం ఓ అఫిడవిట్‌ దాఖలు చేసింది.


కొవిడ్‌ మృతుల బంధువులకు మరణ ధ్రువపత్రాలు జారీ చేసేందుకు మార్గదర్శకాలను రూపొందించాలని సుప్రీం ఈ నెల 3న కేంద్రాన్ని ఆదేశించింది. ఇందుకోసం 10 రోజులు గడువు ఇచ్చింది. 


మార్గదర్శకాలు ఇవే..



  1. ఓ వ్యక్తికి కొవిడ్‌ సోకినప్పటికీ విషం తీసుకోవడం వల్ల, ఆత్మహత్యలతో, హత్యకు గురై, రోడ్డుప్రమాదాలతో మరణిస్తే కొవిడ్‌ మరణంగా పరిగణించబోరని మార్గదర్శకాల్లో కేంద్రం పేర్కొంది.

  2. ఆర్టీపీసీఆర్, మాలిక్యులర్‌ పరీక్ష, ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్ష లేదా ఆసుపత్రి/వైద్యుడి పర్యవేక్షణలో చేసిన పరీక్షలను కొవిడ్‌ నిర్ధరణకు ప్రామాణికంగా భావిస్తారు.

  3.  కొవిడ్‌ నిర్ధారణైన కేసుల్లో ఆసుపత్రుల్లో లేదా ఇళ్ల వద్ద గానీ మరణిస్తే జనన, మరణ నమోదుచట్టం 1969లోని సెక్షన్‌ 10 ప్రకారం వైద్యపరంగా మరణ ధ్రువీకరణ పత్రం ఫారం 4, ఫారం 4ఏ నమోదు అధికారికి జారీ చేస్తారు. దీన్ని మాత్రమే కొవిడ్‌ మరణంగా పరిగణిస్తారు.

  4. ఆసుపత్రిలో లేదా ఇళ్ల వద్ద చికిత్స పొందుతూ మరణించిన వారి వివరాలను 30 రోజుల్లోపు నమోదు చేయిస్తే కొవిడ్‌ మరణంగా పరిగణిస్తారు.

  5. ఈ కేసుల నిర్ధారణకు అవసరమైతే జిల్లాస్థాయి కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.

  6. బంధువుల దరఖాస్తులు, ఫిర్యాదులను ఈ కమిటీ 30 రోజుల్లో పరిష్కరించాల్సి ఉంటుంది.


రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇందుకు సంబంధించిన అధికారులకు సరైన కొవిడ్ మరణాల నమోదుపై శిక్షణ ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది. 


తగ్గిన కేసులు..


దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. కొత్తగా 28,591 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 338 మంది మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. రికవరీల సంఖ్య  3,24,09,345కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 3,84,921 యాక్టివ్ కేసులు ఉన్నాయి.


వ్యాక్సినేషన్ రికార్డ్..






దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 74 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాపై యుద్ధంలో మరో మైలురాయిని చేరుకున్నామని ట్వీట్ చేసింది.