గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేసే పనిలో భాజపా బిజీబిజీగా ఉంది. ఇందుకోసం కేంద్రమంత్రులు ప్రహ్లాద్ జోషి, నరేంద్ర సింగ్ తోమర్ లను గుజరాత్ పంపించింది. కొత్త సీఎంను ఎంపిక చేసేందుకు ఈ రోజు మధ్యాహ్నం జరగనున్న పార్టీ శాసనసభాపక్ష సమావేశానికి వీరు హాజరుకానున్నారు.
సీఎం రాజీనామా..
గుజరాత్ సీఎం పదవికి విజయ్ రూపానీ శనివారం రాజీనామా చేయడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు రూపానీ. ఈ అవకాశం ఇచ్చిన పార్టీకి, అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు.
అయితే రాజీనామాకు గల కారణాలను రూపానీ వెల్లడించలేదు. తాను ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని.. ఇది సూదీర్ఘ సమయమని ఆయన అన్నారు. సీఎం మార్పు అనేది భాజపాలో సర్వ సాధారణమన్నారు. మునుపటిలానే అధిష్ఠానం కింద పార్టీ కోసం కృషి చేస్తానన్నారు.
ఇటీవల ఉత్తరాఖండ్, కర్ణాటకలలో కూడా భాజపా సీఎంలను మార్పు చేసింది. రాబోయే ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయడం కోసమే నాయకత్వ మార్పు చేస్తున్నట్లు తెలుస్తోంది. 2017 డిసెంబర్ లో రూపానీ (65) సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.
ఆ నలుగురు..
కొత్త సీఎం పదవికి చాలా మంది పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఏబీపీ సమాచారం ప్రకారం నలుగురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
- ఇటీవల కొత్తగా కేంద్ర ఆరోగ్యమంత్రి అయిన మన్ శుఖ్ మాండవీయ
- పర్షోత్తమ్ రూపాలా.. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఈయన పదవీకాలం 4 నెలల్లో పూర్తి కానుంది. పాటిదార్ కమ్యూనిటీలో రూపాలా ప్రముఖులు.
- ప్రస్తుత గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ రతిలాల్ పటేల్ కు కూడా అవకాశాలు ఉన్నాయి.
- లోక్ సభ ఎంపీ, గుజరాత్ భాజపా చీఫ్ చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్ పేరు కూడా వినిపిస్తోంది.
Also Read: BKU Leader Rakesh Tikait: ఎండైనా, వానైనా తగ్గేదేలే.. వరద నీటిలో టికాయత్ వినూత్న నిరసన