కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల ఫ్యాటీ లివర్ డీసీజ్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మీరు తినే, తాగే వాటి మీద కాలేయం ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, మద్యపానం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. దీని వల్ల దీర్ఘకాలంలో కాలేయ వైఫల్యం లేదా కాలేయ సిర్రోసిస్ కి దారి తీస్తుంది. ఫ్యాటీ లివర్ వ్యాధి ఒక నిశ్శబ్ద వ్యాధి. ఎటువంటి లక్షణాలను చూపించకుండానే కాలేయాన్ని ప్రమాదంలో పడేస్తుంది. బరువు పెరగడం, జీర్ణ రుగ్మతలకు కారణమవడం, మధుమేహం, గుండె పోటు, స్ట్రోక్ వంటి భయంకరమైన వాటికి దారి తీస్తుంది. కాలేయానికి జరిగే నష్టాన్ని సహజంగా పరిష్కరించుకునేందుకు ఆయుర్వేదంలో గొప్ప మార్గం ఉంది.


యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ చికాగో అధ్యయనం ప్రకారం ఈ రుగ్మతను పరిష్కరించడంలో కీలకమైనవి అప్పుడప్పుడు ఉపవాసం చేయడం, క్రమం తప్పని వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, చక్కెర, జంక్, ఆయిల్ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన ఆహారాలను దూరం పెట్టాలి. ఇదే కాదు ఆయుర్వేద నివారణ మరొకటి ఉంది. ఇది సహజంగా ఫ్యాటీ లివర్ పరిస్థితిని నయం చేస్తుంది. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.


ఆయుర్వేద టీకి  కావాల్సిన పదార్థాలు


అల్లం పొడి(శొంఠి)- ½ టీ స్పూన్


మెంతి గింజలు- ½ టీ స్పూన్


పసుపు-1/2 టీ స్పూన్


నిమ్మరసం- 1 టేబుల్ స్పూన్


పిప్పరమెంటు ఆకులు- 2 లేదా 3


తయారీ విధానం


ఒక కుండలో గ్లాసు నీటిని వేసి మరిగించుకోవాలి. మెంతి గింజలు, అల్లంపొడి, పసుపు, పుదీనా ఆకులు వేసుకుని బాగా ఉడికించుకోవాలి. బాగా మరిగిన తర్వాత ఆ పానీయాన్ని వడకట్టుకోవాలి. ఉదయం లేదా సాయంత్రం ఈ టీ తాగితే చాలా మంచిది. అందులో చివరగా నిమ్మరసం జోడించుకుంటే సరిపోతుంది.


టీ ప్రయోజనాలు


ఈ సాధారణ పదార్థాల సమ్మేళనాలు కాలేయంపై కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వ్యాధిని తగ్గిస్తుంది. అల్లంలోని జింజేరోల్ అనే సమ్మేళనం వల్ల ఇది జరుగుతుంది. మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. సెల్యులార్ దెబ్బతినకుండా కాపాడుతుంది. కాలేయాన్ని రక్షిస్తుంది.


ఇందులో వేసే మెంతి గింజలు కాలేయ ఆరోగ్యాన్ని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనొలిక్ సమ్మేళనాలు కలిగి ఉన్నాయి. ఇక పసుపులో ఉన్న ఎంజైమ్ లు కొవ్వుని కాల్చేయడంలో తోడ్పడతాయి. మంటను కూడా నయం చేస్తుంది. కాలేయానికి మేలు చేసే ఆహారాన్ని ఎంపిక చేసుకుని తినాలి. కాలేయం కోసం వెల్లుల్లి, ఓట్స్ తో వండిన ఆహారం, చేపలు, కాఫీ, గ్రీన్ టీ, ద్రాక్ష, ఆలివ్ ఆయిల్, బెర్రీ పండ్లు, గుడ్లు, నట్స్ వంటివి తినాలి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: మీకు ఇష్టమైనవి తింటూనే ఆరోగ్యంగా బరువు తగ్గండిలా