న శరీరాకృతి, ఆరోగ్యం, నిద్ర అనేవి మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. తినేందుకు కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఎలా పడితే అలా క్రమపద్ధతి లేని ఆహారం తీసుకోవడం వల్ల శరీరం బరువు పెరగడం అనారోగ్య సమస్యలు రావడం జరుగుతుంది. అందుకే ఆహారం తీసుకునే విధానానికి ఒక పద్ధతి ఉంటుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. శరీరం వాత, పిత్త, కఫ దోషాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ మూడు దోషాలు శరీరం ఎలా పని చేస్తుంది, ఎలా కనిపిస్తుంది. జీర్ణక్రియ ఎంత శక్తివంతంగా ఉంది, ఆలోచనలు, మాట తీరు ఎలా ఉందనే అన్ని అంశాలను నియంత్రిస్తాయి. ఆరోగ్యంగా ఉండాలంటే ఆయుర్వేదం చెప్పిన ప్రకారం ఆహారం తీసుకోవాలి. అందుకు మూడు విధానాలు పాటించాలి.


ప్రాసెస్ చేయని సంపూర్ణ ఆహారం తినాలి


శరీరంలో ప్రాణ శక్తికి మూలమైన ఓజస్ ను పెంచడానికి ఆయుర్వేద ఆహారం ఉత్తమమైనది. అందులో బాదం పప్పు ఒకటి. ఆయుర్వేదం ప్రకారం బాదం పప్పులో పోషక విలువలు సమృద్ధిగా ఉన్నాయి. వాతాన్ని సమతుల్యం చేయగల సామర్థ్యం దీనికి ఉంటుంది. ప్రమేహ పరిస్థితులకు బాదంపప్పు ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రీడయాబెటిస్, ఊబకాయం, డయాబెటిస్ మెల్లిటస్, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి వాటిని తగ్గిస్తుంది. మధుమేహ సమస్యలు, బలహీనత తగ్గించుకునేందుకు బాదంపప్పు తీసుకోవచ్చు.


రాత్రి భోజనం తేలికగా ఉండాలి


సూర్యుడు నడినెత్తి మీద ఉన్నప్పుడు మధ్యాహ్న సమయంలో జీర్ణశక్తి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. అందుకే ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మధ్యాహ్నం పూట కాస్త పొట్టకి ఎక్కువ అయ్యేలా తిన్నా ఏమి కాదు. ఇది ఆహారాన్ని జీర్ణించుకోగలుగుతుంది. కానీ రాత్రి వేళ మాత్రం అలా చేయకూడదు. పడుకోవడానికి కనీసం మూడు గంటల ముందు ఆహారాన్ని తీసుకోవాలి. రాత్రి 10 గంటల్లోపు భోజనం ముగించాలి. నిద్ర సమయంలో అతిగా పొట్ట నిండుగా ఆహారం తీసుకోవడం వల్ల అది ఇబ్బంది పెడుతుంది. సిర్కాడియన్ రిథమ్ పనితీరు మందగించేలా చేస్తుంది. ఫలితంగా నిద్ర లేమి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.


70-30 నియమాన్ని అనుసరించండి


ప్లేట్ లో పెట్టినవన్నీ తినాలని ఇంట్లో వాళ్ళు చెప్తుంటారు. ఆహారం మిగల్చకూడదని అంటారు. అందుకే కొందరు పొట్ట నిండినా కూడా ప్లేట్ లో ఉన్న ఆహారం బలవంతంగా అయినా తినేస్తారు. కానీ ఆయుర్వేద జ్ఞానం ప్రకారం సంతృప్తి చెందే వరకు మాత్రమే తినాలి. సరిపడనంత ఆహారం మాత్రమే పెట్టుకోవాలి. కూర ఎక్కువగా అన్నం తక్కువగా తీసుకోవాలి. వేగంగా తినకుండా నెమ్మదిగా బాగా నమిలి ఆహారం మింగాలి. అప్పుడే అది జీర్ణమవుతుంది. ఆహారం తీసుకునే విధానంలో 70-30 నియమాన్ని అనుసరించాలి. అంటే 70 శాతం కడుపు నింపుకుంటే 30 శాతం ఖాళీగా ఉంచాలి. అప్పుడే పొట్టలో ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉంటుంది. అతిగా తినడం నుంచి బయటపడొచ్చు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: బరువు పెరగాలా? అయితే ఈ ఆహారాలు మీ డైట్లో చేర్చుకోండి