ఛాతిలో లేదా కడుపులో మంట, కడుపు ఉబ్బరంగా అనిపించడాన్ని గ్యాస్ ప్రాబ్లం అని చెబుతుంటాం. మనలో ఎవరో ఒకరు ఈ సమస్యను ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొనే ఉంటాం. కడుపులో గ్యాస్ చేరినపుడు భుక్తాయాసంగా ఉంటుంది. గ్యాస్ పైకి లేదా పక్కలకు విస్తరించినపుడు రకరకాలుగా నొప్పి కూడా వస్తుంది. దీని కోసం మాములుగా యాంటీసీడ్స్(Antacids) వాడుతుంటారు. ఇవి ఎక్కువ కాలం పాటు వాడితే కిడ్నీల మీద దుష్ప్రభావం పడుతుంది. అలా అని మందులు వేసుకోకపోతే రోజువారీ జీవితంలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కనుక ఇతర దుష్ప్రభావాలు లేకుండా చిన్న చిన్న చిట్కాలతో కూడా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.


ఆయుర్వేద వైద్యులు డాక్టర్ డిక్సా భావ్ సర్ సవలియా ఇన్ స్టాగ్రామ్ ద్వారా అసిడికి కొన్ని చికిత్సల గురించి తెలిపారు. వయసు పెరిగే కొద్దీ పిత్త గుణం ఆధిపత్యం చూపుతుంది. వాత, కఫ దోషాలు బాల్యంలో, ఇంకా వృద్ధాప్యంలో ఎక్కువ ఆధిపత్యంలో ఉంటాయని ఆమె అభిప్రాయపడ్డారు.


మనం తీసుకునే ఆహారం విషయంలో నిర్లక్ష్యం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయని సావలియా పేర్కొన్నారు. ఈరోజుల్లో చాలా మంది కంటికి నచ్చింది లేదా రుచి బావుందని తినేస్తున్నారు. ఫలితంగా జీర్ణసంబంధ ఇబ్బందులు వస్తున్నాయి. అంతేకాదు, పెరిగిన ఒత్తిడి కూడా అసిడిటి సమస్య పెరగడానికి మరో కారణం. తగినంత శారీరక శ్రమ లేకపోవడం, వ్యాయామం గురించి పట్టించుకోకపోవడం వంటివి కూడా కారణాలే అని అభిప్రాయపడ్డారు. 12 వారాల పాటు తీసుకోవాల్సిన ఆయుర్వేద చికిత్సల గురించి మూడు రకాల చిట్కాలను  వివరించారు ’’శరీరంలో మాత్రమే కాదు మనసులో కూడా చేరిన పిత్తం తగ్గించి మీ అసిడిటీ సమస్య నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది’’ అని చెప్పారు.




  1. ధనియాల కషాయం




ఒక గ్లాసు అంటే దాదాపు 300 మి.లీ. నీళ్లు తీసుకొని దానిలో ఒక టేబుల్ స్సూన్ ధనియాలు, 5 పుదీనా ఆకులు, 15 కరివేపాకులు వేసి 5 నిమిషాల పాటు మరిగించాలి. తర్వాత ఈ కషాయాన్ని వడకట్టి పరగడుపున తీసుకోవాలి.




  1. సోంప్




ప్రతి భోజనం తర్వాత ఒక టీ స్పూన్ సోంఫ్ నమలడం ద్వారా కూడా కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం దొరుకుతుంది.




  1. రోజ్ టీ




ఒక కప్పు అంటే దాదాపు 150 మి.లీ. నీళ్లు తీసుకుని 3 నిమిషాల పాటు మరిగించాలి. దానికి కొన్ని ఎండు గులాబి రేకులను చేర్చి మూత పెట్టి ఉంచాలి. 5 నిమిషాల తర్వాత వడగట్టి తీసుకుంటే మంచిది. దీన్ని రాత్రి నిద్రకు అరగంట ముందు తాగితే మంచి గుణం కనిపిస్తుంది.


ఇలా.. 12 వారాల పాటు పైన సూచించిన చిట్కాలు పాటించి చూడండి. తప్పకుండా మీ సమస్య దూరం అవుతుందని ఆమె హామీ ఇస్తున్నారు. కొందరు క్రానిక్ అసిడిటీతో కూడా బాధ పడుతుంటారు. వీటికి ఆయుర్వేదంలో మంచి పరిష్కారాలు ఉన్నాయని ఆమె తన పోస్ట్ లో వివరించారు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.