ఆయుర్వేదానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. ఇంగ్లీషు మందులతో నయం కానీ కొన్ని జబ్బులు కూడా ఆయుర్వేద మందులకి తగ్గిపోతాయి. ఇప్పుడు వాటిని అనుసరించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. కానీ ఆయుర్వేద చిట్కాలు పాటించడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. అటువంటి ఒక పద్ధతి పాలల్లో నెయ్యి, పసుపు కలుపుకుని తాగడం. ఇలా చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది
తరచూ పొట్ట సమస్యలతో బాధపడే వాళ్ళు పాలలో నెయ్యి, పసుపు కలుపుకుని తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఇది జీర్ణక్రియని మెరుగుపరిచి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. మలబద్ధకం సమస్యని నివారిస్తుంది. జీవక్రియ మెరుగుపడుతుంది.
కీళ్ల నొప్పులు తగ్గుతాయి
పాలల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలు బలంగా మారేందుకు దోహదపడుతుంది. నెయ్యి కీళ్ల నొప్పులని తగ్గించేందుకు సహాయపడుతుంది. చలికాలంలో ఈ మిశ్రమం తాగడం వల్ల ఆర్థరైటిస్ వాళ్ళకి కూడా మేలు చేస్తుంది. ఎందుకంటే వాతావరణం చల్లగా ఉండటం వల్ల కీళ్ల నొప్పులు అధికంగా ఉంటాయి. వాటి నుంచి బయట పడేందుకు గోరు వెచ్చని పాలలో నెయ్యి, పసుపు కలిపి తాగడం వల్ల శరీరం వేడిగా ఉంటుంది. నెయ్యిలో విటమిన్ కె2 ఉంది. పోషకాలు శోషించేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది.
మెరిసే చర్మం
నెయ్యి, పాలు చర్మానికి సహజమైన, తేమని అందిస్తాయి. చలికాలంలో అందరూ ఎదుర్కొనే సమస్య చర్మం పొడి బారడం. ఇలా పాలు తాగితే ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. నెయ్యి, పాలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం లోపలి నుంచి తేమను ఇచ్చి మెరిసేలా చేస్తుంది. ముఖం మీద ఉన్న మచ్చలని తొలగించడంలో సహాయపడుతుంది.
జలుబు, దగ్గు తగ్గిస్తుంది
చలికాలంలో జలుబు, దగ్గు, ఫ్లూ వ్యాధుల బారిన త్వరగా పడిపోతారు. పడుకునే ముందు గోరు వెచ్చని పాలు, నెయ్యి, పసుపు కలుపుకుని తాగడం వల్ల జలుబు, దగ్గు నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. గొంతు నొప్పి, దగ్గు తీవ్రతని కూడా తగ్గిస్తుంది.
తయారీ విధానం
ఒక పాత్ర తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. తర్వాత ఒక గ్లాసు పాలు అందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులో ఒక చిటికెడు పసుపు వేసి బాగా కలిసేదాకా తిప్పాలి. ఒక నిమిషం పాటు వాటిని మరిగించాలి. కొద్దిగా చల్లారిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ బెల్లం పొడిని కలుపుకుని తాగడమే. బెల్లం వద్దని అనుకుంటే దానికి బదులుగా స్టెవియా లేదా ఏదైనా కృత్రిమ స్వీటేనర్ కూడా ఉపయోగించొచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: కరివేపాకు తినకుండా పక్కన పెట్టేస్తున్నారా? ఈ ప్రయోజనాలన్నీ మిస్ అవుతునట్టే!