రివేపాకు గురించి అందరికీ తెలిసిందే. ప్రతి వంటింట్లో తప్పకుండా ఇది ఉంటుంది. భారతీయులు తమ వంటల్లో తప్పనిసరిగా దీన్ని ఉపయోగిస్తారు. కమ్మని రుచి, వాసన వంటకి అదనపు రుచి తీసుకొస్తుంది. రుచి కోసం కూరల్లో వేసి వండుతారు బాగానే ఉంటుంది. కానీ తినేటప్పుడు ప్లేట్ లో మాత్రం తీసి పక్కన పడేస్తారు. అది తినకపోతే ఏమి కాదులే అనుకుంటారు. కానీ కరివేపాకు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కరివేపాకులో పిండి పదార్థాలు, ఫైబర్, కాల్షియం, భాస్వరం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఇవి చాలా ముఖ్యం.


ఇన్ఫెక్షన్స్ తో పోరాడేందుకు సహాయపడుతుంది. శరీరానికే కాదు జుట్టు పెంచుకోవడానికి కంటి చూపు సమస్యలు రాకుండా నివారిస్తుంది. కరివేపాకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి జీర్ణక్రియ మెరుగ్గా ఉండేలా చూస్తుంది. ఇందులోని హిపటో ప్రొటెక్టివ్ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల లివర్ డ్యామేజ్ రాకుండా రక్షణ కల్పించే సామర్థ్యం ఉంటుంది.


కరివేపాకు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు


మధుమేహానికి చెక్: రక్తంలో చక్కెర అదుపులో ఉంచుకోవడానికి మధుమేహులు కరివేపాకు తీసుకుంటే చాలా మంచిది. ఇందులో కొయినిజన్ అనే రసాయనం ఉంటుంది. ఇది షుగర్ రోగులకి చాలా మేలు చేస్తుంది. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రించే హైపో గ్లైసెమిక్ లక్షణాలను కలిగి ఉంటుంది.


కడుపు నొప్పి తగ్గిస్తుంది: కరివేపాకు జీర్ణ వ్యవస్థకి మేలు చేస్తుంది. కడుపు నొప్పిని నయం చేస్తుంది. పేగు కదలికలకి సహాయపడుతుంది. ఆహారం జీర్ణమయ్యేందుకు అవసరమయ్యే ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. విరోచనాలు, మలబద్ధక సమస్యని అడ్డుకుంటాయి.


కొవ్వును నియంత్రిస్తుంది: యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే కరివేపాకు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. జీర్ణక్రియని మెరుగుపరిచి కొవ్వు కరిగిస్తుంది.


తెల్ల జుట్టును నివారిస్తుంది: కరివేపాకు తినడం వల్ల జుట్టుకి చాలా మేలు కలుగుతుంది. తెల్ల జుట్టు రాకుండా చేసి చుండ్రుని నయం చేస్తుంది. జుట్టు దెబ్బతినకుండా కాపాడుతుంది. బలహీనమైన జుట్టుకి పోషకాలు అందించి, జుట్టు రాలడాన్ని అడ్డుకుంటుంది. కొబ్బరి నూనెలో కరివేపాకు వేసుకుని రాసుకోవడం వల్ల కుదుళ్లు గట్టిపడతాయి.


మార్నింగ్ సిక్ నెస్ తగ్గిస్తుంది: గర్భిణీ స్త్రీలలో ఎక్కువగా మార్నింగ్ సిక్ నెస్ ఉంటుంది. వాంతులు, వికారంగా అనిపిస్తుంది. వాటిని కరివేపాకు సమర్థవంతంగా అడ్డుకుంటుంది.


యూరినరీ ఇన్ఫెక్షన్స్ పోగొడుతుంది: కరివేపాకుతో తయారుచేసిన జ్యూస్ లో కొద్దిగా దాల్చిన చెక్క పొడి కలుపుకుని తాగడం వల్ల యూరినరీ సమస్యలు తగ్గుతాయి. కరివేపాకులో ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల రక్తంలో ఆక్సిజన్ సరఫరా చేయడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: పర్పుల్ కలర్ కాయగూరలు తినొచ్చా? వాటిలో ఎలాంటి పోషకాలుంటాయి?