వేసవి వేడి నుంచి వానలతో ఉపశమనం లభిస్తుంది. కానీ వానలు ఇన్ఫెక్షన్లను కూడా తెస్తాయి. ఈ వాతావరణంలో దగ్గు, జలుబు చాలా త్వరగా వ్యాపిస్తాయి. వీటి బారిన పడకుండా ఉండాలంటే రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండాలి. దగ్గు, జలుబు బారిన పడకుండా ఉండేందుకు, వాటి బాధల నుంచి త్వరగా ఉపశమనం పొందేందుకు చిన్నచిన్న ఆయుర్వేద చిట్కాలు బాగా పనిచేస్తాయి.


తేమగా ఉండే వర్షాకాలపు వాతావరణంలో సూక్ష్మజీవులు చాలా త్వరగా వ్యాపిస్తాయి. అందువల్ల దగ్గు, జలుబు వంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్ల బారిన పడడం సాధారణమే. వీటి నుంచి రక్షించుకునేందుకు, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు ఆయుర్వేదంలో సులభమైన మార్గాలను సూచించారు. ఆయుర్వేదం పురాతన భారతీయ వైద్య విధానం. ఇది శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాలను సంతులన పరిచే దిశగా పనిచేస్తుంది. వాతావరణ మార్పులు వివిధ శారీరక వ్యవస్థలను అసంతులన పరుస్తాయి. వర్షాకాలంలో ఇది జలుబు, దగ్గుల వంటి అనారోగ్యాలకు కారణం అవుతుంది.


వర్షాకాలంలో ఉష్ణోగ్రతల్లో మార్పులు చాలా త్వరత్వరగా జరుగుతాయి. గాలిలో తేమ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల బ్యాక్టీరియా, వైరస్ ల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు చాలా సులభంగా వ్యాపిస్తుంటాయి. రోగ నిరోధకవ్యవస్థ బలహీనంగా ఉన్నవారిని మరింత సులభంగా వేధిస్తాయి. ఇలాంటి వారు నివారణోపాయాలు పాటించడం, జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.


ఆయుర్వేద పరిష్కారాలు


హెర్బల్ టీలు


తులసి


తులసి ఆంటీ మైక్రోబ్రియల్ లక్షణాలు కలిగి ఉంటుంది. తులసి ఆకులతో కాచిన టీ ఇమ్యూనిటి పెంచడంలో తోడ్పడుతుంది. ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది.


పసుపు-అల్లం


పసుపు, అల్లం కలిపి కాచిన కషాయం తాగితే ఇన్ఫ్లమేషన్ తగ్గించి గొంతులో నొప్పి, అసౌకర్యం నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.


ఆవిరి పట్టడం


ఆవిరిపట్టే నీటిలో కొద్దిగా వాము చేరిస్తే నాసికా మార్గాల అడ్డంకులు తొలగించి శ్వాస సజావుగా సాగేందుకు దోహదం చేస్తుంది.


చవన్ ప్రాష్


యాంటీఆక్సిడెంట్లు, నిరోధక వ్యవస్థ బలానికి అవసరమయ్యే ఉసిరి వంటి మూలికలతో చేసే చవన్ ప్రాష్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.


త్రిఫల


శ్వాస వ్యవస్థ, జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి త్రిఫల చాలా మంచిది. ఇది నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.


ఆహార నియమాలు


వేడి వేడి సూపులు


మిరియాలు, దాల్చిని, వెల్లుల్లి వంటి మసాల దినుసులు ఉపయోగించి చేసే పోషకాలు కలిగిన సూపులను వేడివేడిగా తీసుకుంటే శ్వాస వ్యవస్థలో కలిగే అసౌకర్యాన్ని తగ్గిస్తాయి.


చల్లని పానియాలు, ఐస్ క్రీమ్ వంటి చల్లని ఆహారాలను తీసుకోకపోవడమే మంచిది.


వాతావరణం చల్లగా ఉండి వర్షం పడుతుంటే ఉదయాన్నే వర్కవుట్ మానేసేందుకు మంచి అవకాశం అని బద్దకం వ్యాయామానికి దూరం చేస్తుంది. ఇది నిరోధక వ్యవస్థను బలహీన పరుస్తుంది. వాకింగ్, జిమ్ కు వెళ్లడం కుదరకపోయినా యోగా, ప్రాణాయామం వంటి వాటి సాధన తప్పనిసరి. ఇది శ్వాస వ్యవస్థను ఆరోగ్యంగా, బలంగా ఉంచేందుకు తోడ్పడుతుంది.


Also Read : Lung Cancer: స్మోకింగ్ వల్లే లంగ్ క్యాన్సర్ వస్తుందా? వేరే కారణాలూ ఉన్నాయంటోన్న పరిశోధకులు, అవి ఇవే!


















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.