Health Tips in Telugu: స్మార్ట్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీ, ఇవన్నీ మన జీవితంలో ఒక భాగమైపోయాయి. వాటి స్క్రీన్‌లను చూస్తూ మనం రోజులో చాలా గంటలు గడుపుతాము. పెద్దలే కాదు, పిల్లలు కూడా ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు చూస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు. ఇప్పుడు కేవలం వినోదమే కాదు చదువు, ఆడుకోవడం, అన్నీ ఈ ఎలక్ట్రానిక్ పరికరాల్లోనే జరుగుతున్నాయి. అయితే, మీ పిల్లల ఆరోగ్యానికి ఎక్కువ స్క్రీన్ సమయం మంచిదేనా? ఇటీవల, కొన్ని అధ్యయనాలను విశ్లేషించిన తర్వాత, స్క్రీన్ వాడకం, పిల్లల మెదడు పనితీరు మధ్య లోతైన సంబంధం ఉన్నట్లు గుర్తించారు.


UNSW గోన్స్కీ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎడ్యుకేషన్ నుంచి 2020 నివేదికలో 84 శాతం మంది ఆస్ట్రేలియన్ అధ్యాపకులు డిజిటల్ టెక్నాలజీలు అభ్యాస వాతావరణంలో పరధ్యానంలో ఉన్నాయని పేర్కొన్నారు. 2021 కామన్ సెన్స్ మీడియా నివేదిక ప్రకారం, ట్వీన్స్ (10-14 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు) ప్రతిరోజూ సగటున 5 గంటల 33 నిమిషాలు స్క్రీన్ పై గడుపుతున్నారు. అయితే టీనేజర్లు 8 గంటల 39 నిమిషాలు ఎక్కువగా కేటాయిస్తున్నారని వెల్లడైంది. స్క్రీన్ వినియోగంలో పెరుగుదల స్క్రీన్-సంబంధిత వ్యసనాల అభివృద్ధికి దారితీసింది, ఇందులో గేమింగ్ డిజార్డర్ 2-3% జనాభాను ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. అదేపనిగా స్క్రీన్ చూడటమనేంది అభిజ్ఞా సామర్ధ్యాలపై దాని ప్రభావం, శ్రద్ధ, జ్ఞాపకశక్తి, భాష, సమస్య-పరిష్కార నైపుణ్యాలపై ప్రభావం చూపుతుంది. ది కాన్వర్సేషన్ ప్రచురించిన ఇటీవలి మెటా-విశ్లేషణ ప్రకారం పలు రకాల స్క్రీన్ వినియోగాన్ని పరిశీలించే 34 అధ్యయనాలు, క్రమరహిత స్క్రీన్ వినియోగం ఉన్న వ్యక్తులలో మెదడుపై తీవ్ర ప్రభావం చూపించిందని వెల్లడించింది. 


ఈ పరిశోధనలో, అధిక స్క్రీన్ సమయం పిల్లల మెదడు అభివృద్ధిపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం జరిగింది. 34 అధ్యయనాలను విశ్లేషించారు.  అధిక స్క్రీన్ సమయం కారణంగా, క్రమరహిత స్క్రీన్ వాడకం సమస్య ఉన్న పిల్లలు సరిగ్గా అభివృద్ధి చెందలేదని కనుగొన్నారు. పిల్లల స్క్రీన్ సమయాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని, కానీ నేటి కాలంలో అది చాలా కష్టమని ఈ పరిశోధన స్పష్టం చేస్తోంది. మీరు మీ పిల్లల స్క్రీన్ సమయాన్ని తగ్గించగల కొన్ని మార్గాలు చూద్దాం. 


⦿ పిల్లలు భోజనం చేసేటప్పుడు ఫోన్లు, టీవీలు చూడనివ్వకండి. భోజనం చేసేటప్పుడు పరధ్యానంగా ఉండకూడదు. కాబట్టి ఆ సమయంలో ఫోన్లు, ట్యాబ్‌లు వారి చేతికి ఇవ్వొద్దు. కూర్చుని ఆహారం తినడానికి లేదా వారితో మాట్లాడటానికి ప్రయత్నించండి. ఫోన్ చూడాలనే ఆలోచన రాకుండా చూడండి. 


⦿ ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు మొదలైనవాటిని వారి పడకగదికి దూరంగా ఉంచండి. ఈ వస్తువులను వారి పడకగదిలో ఉంచడం వల్ల వారి దృష్టిని మళ్లీ మళ్లీ ఆకర్షిస్తుంది. అలాగే, వారు నిద్రపోయే ఒక గంట ముందు ఫోన్లు మొదలైనవాటిని ఉపయోగించకూడదని గుర్తుంచుకోండి.


⦿ వీడియో గేమ్‌లు ఆడకుండా బయటికి వెళ్లి ఆడుకునేలా వారిని ప్రోత్సహించండి. ఇది వారి స్క్రీన్ సమయాన్ని కూడా తగ్గిస్తుంది. పిల్లలకు శారీర  శ్రమ అనేది వారి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇవే  కాకుండా మీరు పజిల్స్, బోర్డ్ గేమ్స్ మొదలైన ఆటల్లో పిల్లలు ఆసక్తి కనబరిచేవిధంగా చర్యలు తీసుకోవాలి.


⦿ మీరూ మారాలి: పిల్లల ముందు మీరు ఫోన్ ఉపయోగిస్తే.. వారికి కూడా ఫోన్ చూడాలనే ఆసక్తి కలుగుతుంది. కాబట్టి, మీరు పిల్లలు ఉన్నప్పుడు ఫోన్లు అతిగా చూడొద్దు. వారికి కనిపించకుండా, అందకుండా ఒక ప్రాంతంలో వాటిని పెట్టండి. కేవలం ఫోన్ కాల్స్‌కు మాత్రమే ఆన్సర్ ఇవ్వండి.


Also Read : చలికాలంలో బిర్యానీ ఆకుల కషాయం తాగితే ఎంత మంచిదో తెలుసా?


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.