Benefits of Bay Leaves : వంటగదిలో ఎన్నో ఔషదగుణాలున్న మూలికలు ఉంటాయి. మనకు వాటిని సరిగ్గా ఉపయోగించడం తెలియక నిర్లక్ష్యం చేస్తాము. కానీ వాటిని సరిగ్గా వినియోగిస్తే.. మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అలాంటి వాటిలో బిర్యానీ ఆకు ఒకటి. దీనిని కేవలం పులావ్, బిర్యానీల్లో వినియోగిస్తాము. ఏదో సువాసన కోసం దీనిని ఆహారాల్లో తీసుకుంటున్నాము అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ బిర్యానీ ఆకుల వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. 


చలికాలంలో బిర్యానీ ఆకులు మీకు ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు అందిస్తాయి. వీటిలో చాలా ఔషద గుణాలు ఉన్నాయి. వీటితో తయారు చేసిన కషాయం తాగితే.. ఇది మీకు కేవలం శారీరక ప్రయోజనాలు అందించడమే కాకుండా.. మానసిక ప్రయోజనాలు కూడా అందిస్తుంది. మరి బిర్యానీ ఆకులతో కషాయం ఎలా తయారు చేయాలో.. వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 


బిర్యానీ ఆకుల కషాయం తయారీ విధానం


బిర్యానీ ఆకుల కషాయం తయారు చేయడానికి ఎక్కువ పదార్థాలు కావాల్సిన అవసరం లేదు. బిర్యానీ ఆకులు, నీటితో కషాయాన్ని తయారు చేసుకోవచ్చు. బిర్యానీ ఆకులను మరుగుతున్న నీటిలో వేసి బాగా మరిగించాలి. అంతే కషాయం రెడీ. దీనినే బిర్యానీ ఆకుల హెర్బల్ టీ అంటారు. దీనిలో నిమ్మరసం కూడా జోడించి తీసుకోవచ్చు. మరి దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 


సైనస్ సమస్యకు చెక్..


శీతాకాలంలో ఇబ్బంది పెట్టే గొంతునొప్పి, శ్వాసకోశ సమస్యలనుంచి ఇది విముక్తిని అందిస్తుంది. దీనిలోని విటమిన్ ఎ, బి6, విటమిన్ సికి ఇది మంచి మూలం. ఈ విటమిన్లు రోగనిరోధకశక్తిని పెంచి.. జలుబు, దగ్గును దూరం చేస్తాయి. మీకు సైనస్ సమస్య ఉంటే.. బిర్యానీ ఆకుల కషాయం మీకు సత్వరమే ఉపశమనం అందిస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించి.. విశ్రాంతిని అందిస్తుంది.


కొలెస్ట్రాల్ కంట్రోల్


అంతేకాకుండా జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. కడుపు నొప్పిని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనిలో రుటిన్, కెఫిక్ ఆమ్లం ఉంటాయి. ఇవి గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అంతేకాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. దీనిని ప్రతిరోజు సేవిస్తే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. 


మీకు షుగర్ ఉందా?


బిర్యానీ ఆకులతో చేసిన కషాయం తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. దీనిని రోజూ తీసుకుంటే.. టైప్ 2 డయాబెటిస్​తో పోరాడవచ్చు. ఇది శరీరంలో గ్లూకోజ్​ స్థాయిలను నియంత్రించి.. మధుమేహం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇవే కాకుండా మూత్రపిండాల్లో రాళ్లు, గ్యాస్ట్రిక్ సమస్యలు, కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ బిర్యానీ ఆకుల కషాయాన్ని తయారు చేసుకుని తాగేయండి. 


Also Read : చలికాలంలో చిలగడదుంపల స్మూతీ.. సింపుల్, టెస్టీ రెసిపీ ఇదే


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.