Afternoon Sleep : ఇంట్లోనే ఉండే వారు సాధారణంగా పగటి పూట ఒక నిద్ర వెయ్యడం సాధారణం. సెలవుంటే ఉద్యోగాలు చేసేవారు సైతం పగటి నిద్ర పోకుండా ఉండరు. మరి  పగటి నిద్ర మంచిదేనా? ఇలా నిద్ర పోవడం ఆరోగ్యకరమేనా లేదా అనారోగ్యానికి సూచన కాదా? ఆయుర్వేదంలో పగటి నిద్ర గురించి ఏం చెప్పారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


పగటి నిద్ర గురించి ఆయుర్వేదంలో ప్రత్యేకంగా చెప్పారు. పగటి నిద్ర మంచిదేనా అన్న ప్రశ్నకు సమాధానం వ్యక్తి శారీరక పరిస్థితులు, వాతావరణం, మరియు జీవితశైలి పై ఆధారపడి ఉంటుంది. అయితే, సాధారణంగా ఆయుర్వేదం పగటి నిద్ర మంచిది కాదనే చెబుతుంది. ముఖ్యంగా ఆరోగ్యంగా ఉన్న యువకులకు మధ్యాహ్న నిద్ర ఎంత మాత్రమూ మంచిది కాదు. ఇలా మధ్యాహ్నం పడుకోవాలని అనిపిస్తోందంటే  కారణం శరీరంలోని త్రిదోషాల (వాత, పిత్త, కఫ) సమతుల్యతలో లేవని లేదా పగటి నిద్ర  వీటికి ఆటంకం కలిగిస్తుందని అర్థం.  


పగటి నిద్ర కఫ దోషాన్ని పెంచుతుందని, దీనివల్ల శారీరకంగా బద్దకం, అజీర్తి, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు వస్తాయని ఆయుర్వేదం అభిప్రాయపడుతోంది. అయితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పగటి నిద్ర అంటే ఫర్వాలేదని ఆయుర్వేదం చెబుతోంది. వేసవి కాలంలో, అధిక వేడితో శరీరంలోని వాత దోషం పెరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో, పగటి నిద్ర మంచిదేనని ఆయుర్వేదం చెబుతోంది. పగటి నిద్ర శరీరం చల్లగా ఉండేందుకు, శక్తి సంతరించుకోవడానికి సహాయపడుతుంది.


శరీరానికి అవసరమైన విశ్రాంతిని పొందడం ఆరోగ్యపరంగా మంచిది. కండరాలు క్షీణించేవారికి లేదా అనారోగ్యంతో ఉన్నవారికి పగటి నిద్ర సహాయపడుతుంది.  శరీర బలహీనంగా ఉన్నపుడు, ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నపుడు, గర్భిణులు, వృద్ధులు, లేదా శారీరక శ్రమ ఎక్కువగా చేసే వ్యక్తులకు పగటి పూట కాసేపు నిద్రపొవడం అవసరం అనుకోవచ్చు. రాత్రి పూట పనులు చేసేవారు, ఉద్యోగరీత్యా మెలకువగా ఉండాల్సిన అవసరం ఉన్నవారు,  ఏదైనా కారణంగా రాత్రి నిద్ర లేని పరిస్థితుల్లో పగటి నిద్ర అవసరమవుతుంది. దీని వల్ల శరీరం తిరిగి శక్తిని పొందుతుంది.


 పగటి నిద్ర అవసరమైనపుడు అది 20-30 నిమిషాలకు మించకూడదు. ఈ చిన్న కునుక శరీరానికి విశ్రాంతినిచ్చి శక్తి సంతరించుకునేలా చేస్తుంది. దీన్ని 'పవర్ న్యాప్' అంటారు. రాత్రి తగినంత నిద్ర పోయినపుడు, అలసటగా లేకపోయినా పగటిపూట నిద్ర పోవడం అంత మంచిది కాదు. ఇది అనారోగ్యాలకు కారణం కాగలదు. అజీర్తి, ఆకలి మందగించడం, బద్దకం వంటి సమస్యలకు కారణం కాగలదు. ఆయుర్వేదం ప్రకారం, సాధారణ ఆరోగ్యవంతులైన వ్యక్తులకు పగటి నిద్ర అవసరం లేదు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, పగటి నిద్ర శరీరానికి లాభదాయకం కావచ్చు.


రాత్రి పూట నిద్రకు, మధ్యాహ్నాలు మెలకువగా, చురుకుగా ఉండేందుకు అనువుగా మానవ శరీరం నిర్మితమై ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అవసరానికి మించి మధ్యాహ్నాలు విశ్రాంతి తీసుకోవడం, నిద్ర పోవడం వల్ల శరీరంలో త్రిదోషాలు సంతులనం కోల్పోయి రోగానికి కారణం కాగలదు. ఆరోగ్యవంతులు మధ్యాహ్నాలు నిద్రపోకవడమే మంచిదని ఆయుర్వేదం చెబుతోంది.


Also Read : పీరియడ్ పెయిన్​కి మెడిసిన్ తీసుకుంటే చనిపోతారా? షాకింగ్ విషయాలు ఇవే