Factly Check Clarity On Disha Article Clipping On Nara Lokesh: ఇటీవల కర్ణాటకలో మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ మనవడు, జేడీ(ఎస్) హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకి సంబంధించినవిగా చెప్తున్న పలు అశ్లీల వీడియోలు బయటకు రావడం కలకలం రేపింది. ఆయనపై లైంగిక  వేధింపుల ఆరోపణలు రావడంతో JD(S) పార్టీ ప్రజ్వల్ రేవణ్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే, ఈ కన్నడ సెక్స్ స్కామ్ కు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు సంబంధం ఉందని.. ప్రజ్వల్ రేవణ్ణతో లోకేశ్ కు సత్సంబంధాలు ఉన్నాయనే అర్థం వచ్చేలా ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ప్రజ్వల్, లోకేశ్ ఒకే ఫోటోలో ఉండడం మనం చూడొచ్చు. అయితే, ఇదే ఫోటోను రిపోర్ట్ చేస్తూ 'కన్నడ సెక్స్ స్కామ్ లో నారా లోకేశ్' అనే టైటిల్ తో ఆన్ లైన్ తెలుగు 'దిశ' పత్రిక కథనమంటూ ఓ పేపర్ క్లిప్పింగ్ కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. అయితే, ఇది పూర్తిగా ఫేక్ అని మార్ఫింగ్ చేసిందని 'ఫ్యాక్ట్ లీ చెక్' స్పష్టత ఇచ్చింది.


ఫోటోలు మార్ఫింగ్


వైరల్ అవుతున్న పోస్టులో చూపినట్లుగా నారా లోకేశ్.. ప్రజ్వల్ రేవణ్ణను గతంలో ఎప్పుడూ కలవలేదు. ఈ వార్తను 'దిశ' సంస్థను ప్రచురించలేదని ఫ్యాక్ట్ లీ చెక్ తేల్చింది. సదరు వార్తను 'దిశ' సంస్థ మే 1, 2024న పబ్లిష్ చేసినట్లు క్లిప్పింగ్ లో చూపగా.. ఆ రోజు పబ్లిష్ అయిన ఎడిషన్లు పరిశీలించగా.. అలాంటి వార్త ఏదీ పబ్లిష్ కాలేదని తేలింది. అయితే, దిశ సంస్థ పబ్లిష్ చేసినట్లు దీన్ని మార్ఫింగ్ చేస్తూ ఈ న్యూస్ క్లిప్పింగ్ రూపొందించారని 'ఫ్యాక్ట్ లీ చెక్' గుర్తించింది.


అవి ఎప్పటి ఫోటోలో తెలుసా.?


ఫోటోలో కనిపిస్తున్న నారా లోకేశ్ డిసెంబర్, 2022లో బెంగుళూరులో కేజీఎఫ్ ఫేం కన్నడ స్టార్ యష్ ను కలిసినప్పుడు తీసిన ఫోటోగా ఫ్యాక్ట్ లీ చెక్ గుర్తించింది. అలాగే, ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన క్లిప్పింగ్ లో చూపిన ఫోటో ఆయన తన అధికారిక ఇన్ స్టా గ్రాంలో మార్చి 29, 2024న షేర్ చేసినట్లు తేలింది. ఈ ఫోటో ఇటీవల ప్రజ్వల్ రేవణ్ణ మల్లేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే, కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం అశ్వత్ నారాయణను ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసినప్పుడు తీసిన ఫోటో. దీన్ని అశ్వత్ కూడా తన ఇన్ స్టాలో షేర్ చేశారు. ఈ రెండు వేర్వేరు ఫోటోలను ఎడిట్ చేసి.. లోకేశ్, ప్రజ్వల్ రేవణ్ణ కలిసి ఉన్నట్లు ఓ మార్పింగ్ ఫోటోను రూపొందించినట్లు ఫ్యాక్ట్ లీ చెక్ నిర్ధారించింది.


ఖండించిన 'దిశ' యాజమాన్యం






దిశ పబ్లిష్ చేసినట్లుగా ఫేక్ క్లిప్పింగ్ వైరల్ కావడంతో దీనిపై సదరు వార్త సంస్థ సైతం ఖండించింది. ఇది పూర్తిగా ఫేక్ అని అసలైన వార్తా కథనాన్ని కూడా ట్విట్టర్ లో షేర్ చేసింది.


This story was originally published by factly.in as part of the Shakti Collective. This story has been edited by ABPDesam staff.


Also Read: Fact Check: కొవిషీల్డ్ వ్యాక్సిన్‌తో రక్తం గడ్డకట్టుకుపోతుందా? ఈ ప్రచారంలో నిజమెంత?