Fact Check: కొవిషీల్డ్ వ్యాక్సిన్‌తో సైడ్‌ఎఫెక్ట్స్‌ వస్తాయంటూ ఆస్ట్రాజెన్‌కా కంపెనీ (Astra Zeneca's Covishield) స్వయంగా వెల్లడించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పటి నుంచి ఈ వ్యాక్సిన్‌పై చాలా చర్చ జరుగుతోంది. తీసుకున్న వాళ్ల పరిస్థితేంటంటూ ఆందోళన మొదలైంది. ఇదే క్రమంలో కొన్ని వదంతులూ వ్యాప్తి చెందుతున్నాయి. ఈ వ్యాక్సిన్‌తో దుష్ప్రభావాలున్న మాట నిజమే అయినా మరింత భయపెట్టేలా మెసేజ్‌లు ఫార్వర్డ్ చేస్తున్నారు. ఈ టీకా తీసుకున్న వారిలో thrombocytopenia syndrome (TTS) వస్తుందంటూ ఓ ప్రచారం జరుగుతోంది. అంటే రక్తం గడ్డకట్టుకుపోవడం, ప్లేట్‌లెట్స్ తగ్గిపోవడం. దీనిపై కొందరు వైద్యులు వివరణ ఇస్తున్నారు. ఇది చాలా అరుదుగా జరుగుతుందని, అనవసరంగా ఆందోళన చెందాల్సిన పని లేదని తేల్చి చెబుతున్నారు. THE HEALTHY INDIAN PROJECT దీనిపై ఫ్యాక్ట్‌చెక్ చేసింది. TTS వచ్చే అవకాశాలున్నప్పటికీ అవి చాలా అరుదని ఈ ఫ్యాక్ట్‌చెక్‌లో తేలింది. 



క్లెయిమ్: 


సోషల్ మీడియాలో కేంద్రప్రభుత్వంపై విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌కి అనుమతినిచ్చి కోట్లాది మంది ప్రజల్ని ప్రమాదంలో పడేశారంటూ మండి పడుతున్నారు నెటిజన్లు. ఇదే సమయంలో  Thrombocytopenia Syndrome(TTS) గురించీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. యూకేలోని కోర్టులో ఆస్ట్రాజెన్‌కా కంపెనీ తమ వ్యాక్సిన్‌తో ఈ సైడ్‌ఎఫెక్ట్ వచ్చే ప్రమాదముందని చెప్పడమే ఇంత ఆందోళనకు దారి తీసింది. అప్పటి నుంచి ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 






ఫ్యాక్ట్‌ చెక్..


Thrombocytopenia Syndrome చాలా అరుదైన వ్యాధే అయినా ఎంతో ప్రమాదకరమైంది. ఉన్నట్టుండి ప్లేట్‌లెట్స్ కౌంట్‌ని తగ్గించేస్తుంది. అదే సమయంలో రక్తం గడ్డకట్టుకుపోయేలా చేస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతి నొప్పి, కాళ్ల వాపులు, తీవ్రమైన తలనొప్పి, కడుపు నొప్పి లాంటివి ఈ సిండ్రోమ్ లక్షణాలు. 


రిపోర్ట్‌లు ఏం చెబుతున్నాయి..?


కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ వల్ల సైడ్‌ఎఫెక్స్ట్ వస్తున్నాయంటూ యూకేలోని ఓ కోర్టులో పిటిషన్ దాఖలు కాగా సంస్థ కోర్టులో కీలక వ్యాఖ్యలు చేసింది. టీకా తీసుకున్న వాళ్లలో ఈ సిండ్రోమ్ తలెత్తే అవకాశముందని చెప్పింది. ఇండియాలోనూ ఇదే వ్యాక్సిన్ ఇచ్చారు. Oxford Universityతో కలిసి బ్రిటీష్ కంపెనీ ఆస్ట్రాజెన్‌కా కొవిషీల్డ్ టీకాను తయారు చేసింది. ఇదే వ్యాక్సిన్‌ని ఇండియాలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌ తయారు చేసింది. క్లినికల్ ట్రయల్స్‌లో కొవిడ్‌ నుంచి 60-80% వరకూ రక్షణ కల్పిస్తుందని తేలడం వల్ల అప్రూవల్ లభించింది. అయితే...కేవలం ఈ వ్యాక్సిన్‌తో మాత్రమేTTS  సిండ్రోమ్ వస్తుందని అనుకోడానికి వీల్లేదని నిపుణులు చెబుతున్నారు. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తయారు చేసిన Janssen టీకాతోనూ ఈ ప్రమాదం ఉండొచ్చని అంటున్నారు. 2023లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ తరహా వ్యాక్సిన్‌లతో TTS వచ్చే అవకాశముందని వెల్లడించింది. 


అంత ప్రమాదమా..?


భారత్‌లో ఎక్కువ మంది తీసుకున్న కొవిడ్ వ్యాక్సిన్ కొవిషీల్డ్. కానీ ఇన్నేళ్లలో ఎక్కడా TTS సిండ్రోమ్‌ వచ్చిన వాళ్లు చాలా తక్కువే. ఒకవేళ ఇలాంటి కేసులు వచ్చి ఉంటే కచ్చితంగా అవి మీడియా దృష్టికి వచ్చి ఉండేవని ఎక్స్‌పర్ట్స్ తేల్చి చెబుతున్నారు. అయితే...ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌లు చాలా సేఫ్. మిగతా మెడిసిన్స్‌కి సైడ్‌ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో అలాగే వ్యాక్సిన్స్‌కి కూడా ఉంటాయని, కానీ అవి చాలా అరుదుగా కనిపిస్తాయని వివరిస్తున్నారు. వ్యాక్సినేషన్ పూర్తైన వారాల్లోనే TTS సిండ్రోమ్ లక్షణాలు కనిపిస్తాయని, ఒకవేళ అలాంటి ఇబ్బంది ఏమైనా వస్తే వైద్యుల్ని సంప్రదించాలని క్లారిటీ ఇచ్చారు. 



This story was originally published by THIP , and translated by ABP Desam staff as part of the Shakti Collective.




Also Read: Bengaluru News: రూ.కోట్ల ఆస్తిని కాదని 11 ఏళ్ల వయసులో సన్యాసం, తల్లి కూడా అదే బాటలో